ఆయన ఒక ప్రశ్నార్థకం!

Kommineni Srinivasa Rao Guest Column On Pawan Kalyan - Sakshi

విశ్లేషణ

‘ప్రశ్నించాలి’ అని రాజకీయం మొదలుపెట్టారు పవన్‌ కల్యాణ్‌. కానీ దేన్ని ప్రశ్నించాలో, ఏది ప్రశ్నిస్తే జనానికి మేలో తెలుసుకోలేక పోయారు. పెద్ద నిర్మాతల కోసం ప్రశ్నిస్తారు; చిన్న సినిమాల కోసం గొంతెత్తరు. బెనిఫిట్‌ షో టికెట్ల గురించి ప్రశ్నిస్తారు; ఏ బెనిఫిట్సూ లేకుండా బతుకుతున్న జూనియర్‌ ఆర్టిస్టులు కళ్లకు ఆనరు. ఈ కులాలు ఎందుకున్నాయని బుకిష్‌గా ప్రశ్నిస్తారు; కానీ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని వంచించిన చంద్రబాబును పల్లెత్తు మాటైనా అనడం లేదని తెలిసిన జనానికి అడ్డంగా బుక్కైపోతారు. అతి దారుణంగా ఓడిన పార్టీకి అంతకంటే ఘోరంగా ఓడిన నాయకుడాయన. ఆ నిరాశలో ఏం మాట్లాడుతున్నారో తెలియకపోవడం సహజం. కానీ తనను తాను ఎక్కువ చేసుకొని, చాలా తక్కువైపోవడం మాత్రం అసహజం.

జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఒక సినిమా ఉత్సవంలో చేసిన ప్రసంగం చూస్తే ఆయనలోని నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపి స్తాయి. ఆయన ఎందుకు ఇంతగా నైరాశ్యానికి గురయ్యారు? దీనిపై కొందరు సినీ ప్రముఖులు చెప్పేది ఒకటే. సినిమా నటుడిగా ఆయ నకు వచ్చే కోట్ల పారితోషికం తగ్గిపోయే ప్రమాదం ఉందట. నాకైతే ఈ సినిమాలు, డబ్బుల గొడవ గురించి పెద్దగా తెలియదు గానీ, పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యల తర్వాత విషయ సేకరణ చేస్తే అర్థం అయిందే మిటంటే– ఆయన సినిమా విడుదల అవడానికి ముందు బెనిఫిట్‌ షోల పేరుతో డబ్బు దోచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదన్న కారణంగానే ఆయన అవాకులు చవాకులు పేలారని చెబుతున్నారు. చిత్రం ఏమిటంటే, అలా బెనిఫిట్‌ షోల్లో అధిక రేట్లు వసూలు చేసి భారం మోపుతున్నది వారి అభిమానుల పైనే.

ఒక్కో టికెట్‌ బెనిఫిట్‌ షోలో వెయ్యి రూపాయలు మించే ఉంటుందట. ఇదంతా ఎవరి కోసం అంటే, ఆ సినిమాలలో నటించే హీరో, లేదా హీరోయిన్‌లకు ఇచ్చే కోట్ల రూపాయల పారితోషికం కోసం. తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు నలభై కోట్ల నుంచి యాభై కోట్ల వరకు తీసుకుంటారు. బహుశా వారిలో పవన్‌ కల్యాణ్‌ కూడా ఉండి ఉండవచ్చు. ఆయనే ఆయా ఉపన్యాసాలలో తాను సినిమాలలో కోట్లు సంపాదిస్తున్నానని చెప్పారు. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు సంబంధించి తెచ్చిన కొన్ని విధానాలపై అభ్యంతరాలు ఉండవచ్చు. కానీ వాటిని వ్యక్తపరిచే పద్ధతి ఇది కాదు. రాజకీయం, ద్వేషం, అక్కసు, తన పార్టీకి ప్రజలలో ఆదరణ ఎంత మాత్రమూ లభించడం లేదన్న నిస్పృహ... ఇవన్నీ ఆయన వ్యాఖ్య లలో కనబడతాయి.

ఈ సినిమా టికెట్లపై వచ్చే ఆదాయాన్ని చూపి ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుందట. దీనినే మోకాలికీ, బోడి గుండుకూ ముడిపెట్టడం అంటారు. ఒక టీడీపీ పత్రిక అలా రాసింది. పవన్‌ దానిని భుజాన వేసుకున్నారు. ఒక్కో సినిమా ఆడితే వచ్చే డబ్బు ఎంత? అందులో ప్రభుత్వ వాటా ఎంత? ఎప్పటికప్పుడు సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తే వచ్చే సొమ్ము ఆటోమేటిగ్గా  నిర్మాతకు వెళ్లిపోతున్నప్పుడు ఇంక ప్రభుత్వం వద్ద ఉండేదెంత? ఎప్పుడూ వచ్చే పన్నులే కదా. ఆ మాత్రం ఇంగితం లేకుండా పత్రిక రాయడం ఏమిటో? దానిని ఈయన పట్టుకుని మాట్లాడడం ఏమిటో? 

పైగా ఇందులో ముఖ్యమంత్రి జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన తీరు చూస్తే, తనలోని అసలు మనిషిని పవన్‌ బయట పెట్టు కున్నట్లు అనిపిస్తుంది. ఇందులో రాజకీయం లేదు; సినిమా లేదు; తన స్వార్థం కోసం పవన్‌ ఏమైనా అంటారన్న అభిప్రాయం కలుగు తుంది. అసలు సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో ఇలా మాట్లాడవచ్చా? తద్వారా ఆ సినిమా నిర్మాతకు మేలు చేసినట్లా, కీడు చేసినట్లా? ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం ప్రభుత్వం చేపట్టాలని తామే కోరామని కొందరు ప్రముఖ నిర్మాతలు మంత్రి పేర్ని నానితో సమావేశం అయిన తర్వాత మీడియాకు ఎందుకు చెప్పారు? వారి గురించి పవన్‌ ఎందుకు మాట్లాడలేదు? వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసే సినిమా నిర్మాతలు, కోట్లాది రూపాయల పారితోషికాలు పొందే కొద్ది మంది హీరోల కోసం ఇంతగా వాపోతున్న పవన్‌ చిన్న చిత్రాల వారు ఎదుర్కుంటున్న సమస్యలపై ఎన్నడైనా మాట్లాడారా? వారికి చివరికి థియేటర్లు కూడా అందుబాటులో లేకపోవడం, కేవలం కొద్దిమంది చేతుల్లోనే థియేటర్లు ఉండటం గురించి మాట్లాడారా? జూనియర్‌ ఆర్టిస్టులు, ఇతర కార్మికుల బాధల గురించి మాట్లాడారా?

టికెట్ల ధరలను ప్రభుత్వం నిర్దేశించకూడదట. మరి నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వాలపై నేతలు ఎందుకు విమ ర్శలు చేస్తుంటారు? అదే సినిమా టికెట్ల ధరలు మాత్రం ఎంతైనా పెట్టుకున్నా ఎవరూ మాట్లాడకూడదట. ఇది పవన్‌ చెప్పే సోషలిజం. రాజకీయాలలో అవినీతి గురించి మాట్లాడితే తప్పు లేదు. కానీ అదే సమయంలో సినిమా రంగంలో ఉన్న బ్లాక్‌మనీ, బ్లాక్‌లో డబ్బు తీసుకునే హీరోల గురించి కూడా మాట్లాడితే మెచ్చుకోవచ్చు. తన సోదరుడు చిరంజీవి ముఖ్యమంత్రి జగన్‌తో కాస్త సఖ్యతతో ఉండటం కూడా పవన్‌ భరించలేకపోతున్నారు. అన్న అని కూడా చూడకుండా ఆయనను ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. చిరంజీవి ప్రాథేయపడు తున్నారని అంటున్నారట. అలా ప్రాధేయపడే అవసరం లేదనీ, ప్రశ్నించాలనీ సలహా ఇస్తున్నారు.

2014లో ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్‌కల్యాణ్‌ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఎన్నడైనా ప్రశ్నించారా? ఒకే ఒక్కసారి ఒక బహిరంగ సభలో చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్ర మైన అవినీతి ఆరోపణలు చేసిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత ఎన్నికల సమయంలో పరోక్షంగా వారి సహకారంతోనే ఎలా పోటీ చేశారు? అప్పట్లో టీడీపీ వారి నుంచే ఆర్థిక వనరులు పొందడం బహి రంగ రహస్యమని చాలామంది చెబుతారు. నిజంగానే సినీ పరిశ్ర మకు ఇబ్బంది కలుగుతుంటే చెప్పవచ్చు. కానీ ప్రేక్షకులను పీడించే రీతిలో టికెట్ల ధరలు పెడతామంటే ఏ ప్రభుత్వమైనా ఒప్పుకోవాలా? ఇదే వకీల్‌ సాబ్‌ చేసే వాదన అనుకోవాలన్నమాట!

కులాలేమిటి? అంటూ చేగువేరా వారసుడనని పోజులు ఇచ్చి, ఫొటోలు పెట్టుకుని తిరిగిన పవన్‌ ఇప్పుడు ఏమంటున్నారో చూడండి: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడిన వాళ్లు... వైసీపీ రాగానే ఎందుకు మాట్లాడటం లేదో చెప్పా లని పవన్‌ అన్నారు. ‘‘రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగి పోతున్నారు? బోయలకు ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లభిం చడం లేదు?’’ అని ఆయన ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్‌ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో దానిని అణచడానికి ఆనాటి టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపడితే నోరెత్తని ఈయన; కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా బూతులతో అవమానించిన రోజున కనీసం ఖండించని ఈయన ప్రస్తుతం కులాలపై ఆందోళన చెందుతున్నారు. పైగా ఒక సందర్భంలో ఈ కులాలేమిటి? ఈ రిజ ర్వేషన్లు ఏమిటి అని కూడా ప్రశ్నించారు. కానీ ఆ రోజుల్లో కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పిన ఏకైక నేత జగన్‌. కాపులకు రిజ ర్వేషన్‌ ఇస్తానని చెప్పి వారిని మోసం చేశారన్న విమర్శకు గురైన నేత చంద్రబాబునాయుడు. కానీ పవన్‌ మాత్రం ఆ విషయం ప్రస్తావిం చడం లేదు.

మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి సన్నాసి మంత్రి అని అనడం ఎందుకు? సన్నాసిన్నర అని పవన్‌ కల్యాణ్‌ తిట్టించుకోవడం ఎందుకు? పవన్‌కు నానితో పాటు మంత్రులు బొత్స సత్యనారా యణ, అనిల్‌ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్‌ గట్టిగానే సమాధానం ఇచ్చారు. అన్నిటినీ మించి సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి వేసిన ప్రశ్నలకు వేటికీ పవన్‌ లేదా ఆయన మద్దతుదారులు సమా ధానం చెప్పడం లేదు. జవాబు ఇవ్వకపోగా తమను తాము తుమ్మె దలు, నెమళ్లు, ఏనుగులతో పోల్చుకుని వైసీపీ వారిని గ్రామసింహా లతో పోల్చారు. దానికి ప్రతిగా మంత్రి పేర్ని నాని మరింత ఘాటుగా– ‘జనం ఛీత్కారాలు; ఓటర్ల తిరస్కారాలు; తమరి వైవా హిక సంస్కారాలు; వరాహ సమానులకు నమస్కారాలు’ అంటూ సమాధానం ఇచ్చారు.

గాజుటింటిలో కూర్చుని రాళ్లు వేస్తే ఏమి జరుగుతుందో పవన్‌ తెలుసుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలలో తాను రెండు సీట్లలో పోటీచేసి ఓడిపోతే, పార్టీకి ఒక సీటు మాత్రం వచ్చింది. గెలిచిన ఎమ్మెల్యే కూడా పార్టీతో లేరు. తాజాగా జరిగిన మండల ఎన్నికలలో కూడా ఒక మండలం దక్కింది. మున్సిపల్‌ ఎన్నికలలో ఆ ఒక్కటి కూడా దక్కలేదు. సహజంగానే ఆ నిరాశ ఉంటుంది. అందుకే పవన్‌ గగ్గోలు పెడుతున్నారనుకోవాలి. ఏమి చేస్తాం. ఎవరి బాధ వారిది!


కొమ్మినేని శ్రీనివాసరావు

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top