ఇది ఓ చారిత్రక ఘట్టం

This Is A Historical Moment - Sakshi

మహిళా సాధికారతను నిజం చేసే బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్‌ ఆమోదం పొందింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే ఈ బిల్లు దాదాపు మూడు దశాబ్దాలుగా ఆమోదానికి నోచుకోకుండా పడి ఉంది. ఇప్పుడు అది చట్టం కానుండడంతో అన్ని వర్గాలూ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ బిల్లులో రిజర్వేషన్‌ అమలు మొదలయ్యే సమయం గురించి స్పష్టత లేకపోవడం, రాజ్యసభ, రాష్ట్రాల కౌన్సిళ్లలో రిజర్వేషన్ల సంగతిని ప్రస్తావించకపోవడం గమనించదగ్గవి.

ఎన్నాళ్లో వేచిన ఉదయం..
ఎట్టకేలకు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభించింది. దేశాద్యంతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అపురూపమైన ఘట్టమిది. దురదృష్టవశాత్తూ స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంది. పంచాయితీలు, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ జరిగిన 73, 74వ రాజ్యాంగ సవరణల పుణ్యమా అని పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అదే సమయంలో చట్టసభల్లోనూ ఈ రిజర్వేషన్లకు డిమాండ్‌ కూడా మరింత జోరందుకుంది.

1996 నుంచి పలు ప్రభుత్వాలు మహిళల రిజర్వేషన్ల కోసం పలు రకాల బిల్లులు ప్రవేశ పెట్టాయి కానీ.. రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించి బిల్లును కాస్తా చట్టంగా మార్చడంలో మాత్రం అన్నీ విఫలమయ్యాయి. 2008లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి రెండేళ్ల తరువాత ఆమోద ముద్ర వేయించుకుంది. అది కూడా 186 –1 తేడాతో బిల్లును చట్టంగా మార్చడంలో యూపీఏ దాదాపుగా విజయం సాధించింది కానీ.. పార్లమెంటరీ పద్ధతులను అనుసరించి బిల్లును లోక్‌సభకు పంపడంతో పరిస్థితి మారిపోయింది.

ప్రతిపక్షంలో ఉన్నవారితోపాటు యూపీఏ భాగస్వామ్య పక్షాల్లో కొన్ని కూడా దీన్ని వ్యతిరేకించాయి. దీంతో 2014లో లోక్‌సభ అవధి ముగిసిపోవడంతో ఈ బిల్లు కథ కూడా అటకెక్కింది. ఈ దేశంలో చట్టాలను తయారు చేసే సంస్థల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న ఆశలు ఇప్పటివరకూ ఆరుసార్లు నిరాశలయ్యాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్లమెంట్‌లో పూర్తిస్థాయి మెజారిటీ కలిగి ఉంది.

రాజ్యసభ, లోక్‌సభ గండాలు రెండింటినీ అధిగమించిన నేప థ్యంలో ఇప్పుడు 27 ఏళ్ల కల సాకారమైనట్లుగా భావించాలి. దీంతో మోదీ ప్రభుత్వం  చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. నిజానికి తాజా బిల్లు 2008 నాటి బిల్లు తాలూకూ సూక్ష్మ రూపమని చెప్పాలి. లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలోనూ మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం ఉండాలని చెబుతుంది ఇది. ఇప్పుడున్న ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్‌ కోటాలోనూ 33 శాతం మహిళలకు ఉండేలా చూస్తుంది కూడా! రొటేషన్‌ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు. పదిహేనేళ్ల తరువాత రిజర్వేషన్లు రద్దవుతాయి.

2023 బిల్లును రెండు అంశాల్లో మాత్రం విమర్శించక తప్పదు. మొదటిది అమలు మొద లయ్యే సమయం గురించి స్పష్టత లేకపోవడం! ‘‘నియోజకవర్గాల పునర్విభజన తంతును చేపట్టిన తరువాత, జనాభా లెక్కల ద్వారా తగిన సమాచారం సేకరించిన తరువాత, 128వ రాజ్యాంగ సవరణ ప్రచురించిన తరువాత’’ అని బిల్లు పేర్కొంటోంది. వచ్చే ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లు అమలై ఉంటే బాగుండేది. రెండో లోపం.. రాజ్యసభ, రాష్ట్రాల కౌన్సిళ్లలో మహిళలకు రిజర్వేషన్ల సంగతిని ఈ బిల్లూ ప్రస్తావించకపోవడం! ప్రస్తుత పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం లోక్‌సభ కంటే రాజ్యసభలోనే తక్కువగా ఉంది.

మహిళల ప్రాతినిధ్యం అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలోనూ ఉండటం ఆదర్శప్రాయమైన విషయం. ఈ లోటును సరిదిద్దడం ఎలా అన్నది పార్లమెంటేరియన్లు ఆలోచించాలి. 128వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సానుకూల అంశాలను చాలామంది తక్కువ చేసి చూస్తున్నారు. పురుషులు మహిళా ప్రతినిధులకు ప్రాక్సీలుగా వ్యవహరిస్తారని అంటున్నారు. ఇది ఒకరకంగా లింగ వివక్షతో కూడిన అంచనా అని చెప్పాలి. మహిళ సామర్థ్యాన్ని శంకించేది కూడా. చట్టాన్ని దుర్విని యోగపరిచేందుకు కొందరు చేసే ప్రయత్నం మిగిలిన వారి హక్కులను నిరాకరించేందుకు ప్రాతిపదిక  కాజాలదు. 

చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఈ దేశ మహిళలు సుమారు 27 ఏళ్ల సుదీర్ఘకాలం వేచి చూడాల్సివచ్చింది. ఉభయ సభల పరీక్షను దాటుకున్న ఈ బిల్లులో లోటుపాట్లు లేకపోలేదు కానీ... సంపూర్ణమైన చట్టం కోసం ఇంకో రెండు దశాబ్దాలు వేచి ఉండటం కూడా అసాధ్యం. ఇప్పటి ప్రభుత్వం తీసుకున్న చొరవను అభినందిద్దాం. అయితే రాజకీయాల్లో మహిళ, పురుషులిద్దరూ సమాన స్థాయికి చేరేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.


ఆంజెలికా అరిబమ్‌

-వ్యాసకర్త ఫెమ్మే ఫస్ట్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top