అసమానతల ఫలితమే ఆ ఆత్మహత్య

Guest Column By Neera Chandhoke Students Committing Suicide - Sakshi

సందర్భం

దారిద్య్ర సృష్టి, పునఃసృష్టికి సంబంధించిన నేరవ్యవస్థ ప్రతిఫలనమే మన సమాజం. దీని ఫలితాలు గుండెల్ని బద్దలు చేస్తుంటాయి. ఇలాంటి ఒక పర్యవసానం ఢిల్లీలో అత్యున్నత కళాశాలలో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డిని ప్రాణం తీసుకునేలా ప్రేరేపించింది. ఆమె అసాధారణ ప్రతిభావంతురాలు. కానీ ఆ ప్రతిభ, నైపుణ్యాలు, ఆ ప్రయాణం చివరకు మరణం వైపే ఆమెను లాక్కుపోయాయి. తాను చదువుకుంటున్న కాలేజీలో తోటి విద్యార్థులకు ఉన్న సౌకర్యాలు లేకపోవడం వల్లే ఆమె జీవితం నుంచి తప్పుకుంది. ఒక ల్యాప్‌టాప్, ఒక స్మార్ట్‌ఫోన్‌ కూడా పొందలేకపోవడమే ఆమె జీవితాన్ని బలిగొంది. దారి ద్య్రాన్ని, అవమానాలను అధిగమించే ప్రయత్నంలో మరింతమంది విద్యార్థులు తమను తాము బలిదానం అర్పించుకోవడాన్ని భారత్‌ ఇకనైనా అనుమతించకూడదు.

ఢిల్లీలోని కులీనవర్గాలు చదువుకునే ఒక కాలేజీలో తెలంగాణ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి విషాద మరణం రాజకీయ, విద్యాపరమైన అజెండాలకు సంబంధించి భయానకమైన ప్రశ్నలను సంధించింది. ఇది ఎంతో అవసరం కూడా. ఆ విద్యార్థిని మరణాన్ని తప్పించలేకపోవడం కంటే మించిన గుండెపగిలే అంశం మరొకటి ఉండదు. ఆమె దుస్థితిని, దురవస్థను తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు కాస్తయినా అర్థం చేసుకుని ఉంటే ఆ విద్యార్థిని విషాదమరణం సంభవించి ఉండేది కాదు. ఆత్మహత్యలు అకారణంగా సంభవించవు. అవి చాలా తరచుగా కుంగుబాటు, ఆందోళన, నిరాశకు సంబంధించిన ప్రతిఫలనాలుగా మాత్రమే  సంభవించవు.

ఈ డిజిటల్‌ యుగంలో సమానురాలిగా తాను పాల్గొనలేకపోవడంపై ఈ ప్రతిభావంత విద్యార్థినిని ఆవరించిన దుఃఖిత మనస్సును ఏ ఒక్కరూ ఎందుకు గమనించలేకపోయారు? బహుశా ఆమె నూతన యుగంలో పాల్గొనపోయి ఉండవచ్చు. నవ భారతాన్ని ప్రతిబింబించే డిజటలీకరణ ఇప్పటికే సమాజంలో ముందంజలో ఉన్న వర్గాలకు కొత్త సౌకర్యంగానూ, అవకాశాలే లేని వర్గాలకు అత్యంత అసౌకర్యంగానూ దాపురించింది. సంపన్నులకు, నిరుపేదలకు మధ్య అగాధాన్ని పెంచడంలో డిజిటల్‌ డివైడ్‌ అనేది ఇప్పటికే స్పష్టంగా ప్రభావం చూపుతోంది. 

2020 జనవరిలో డావోస్‌లో జరిగిన 50వ ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశంవో ఆక్స్‌ఫామ్‌ ఒక నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో కేవలం ఒక్క శాతం సంపన్నులు 70 శాతం జనాభా (95 కోట్ల మంది) మొత్తం సంపదకంటే నాలుగు రెట్ల సంపదను అధికంగా కలిగి ఉన్నారట. అసమానతలపై తీవ్రంగా యుద్ధం ప్రకటించే విధానాలు అమలు చేయకుండా భారత్‌లో సంపన్నులు, పేదల మధ్య ఈ అంతరాన్ని పరిష్కరించలేం.. అతికొద్ది ప్రభుత్వాలు మాత్రమే దీనికి కట్టుబడి ఉన్నాయని ఆక్స్‌ఫామ్‌ ఇండియా సీఈఓ అమితాబ్‌ బెహర్‌ పేర్కొన్నారు. దారిద్య్రంపై గణాంకాలు ప్రపంచానికి కొత్తేం కాదు. ప్రచురణ పరిశ్రమ చరిత్రలో దీనిపై వెచ్చించిన శక్తి మరే రంగంపైనా పెట్టలేదని చెప్పవచ్చు. కానీ దారిద్య్రం అంటే గణాం కాలు మాత్రమే కాదు. అది సామాజికంగా ఉత్పత్తి, పునరుత్పత్తితో సంబంధముండే విశిష్ట దృగ్విషయం. ఇది పెట్టుబడిదారీ ఉత్పత్తి. అధికోత్పత్తి, అల్పవినియోగం తయారుచేసిన వ్యవస్థ ఫలితమిది. 

ఇలాంటి అసమాన వ్యవస్థలో సామాజిక నిచ్చెన మెట్ల మీది నుంచి పేదలను అనివార్యంగా తోసివేస్తుంటారు. సమాజంలోని ఇతర పౌర బృందాలు పొందే అన్ని రకాల ప్రయోజనాలనుంచి పేదలను దూరం పెడుతుంటారు. ఒక పౌరసమాజం తన ప్రజలకు కల్పించే జీవన ప్రమాణాల్లో అత్యంత తక్కువ శాతం పొందే స్థాయికి ఈ వ్యవస్థలో పేదలను కుదించి వేస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, దారిద్య్ర సృష్టి, పునఃసృష్టికి సంబంధించిన నేరవ్యవస్థే మన సమాజం. దీని ఫలితాలు గుండెల్ని పిండేస్తుంటాయి. ఇలాంటి ఒక పర్యవసానం ఒక విద్యార్థినిని తన ప్రాణం తీసుకునేలా ప్రేరేపిం చింది. ఆమె అసాధారణ ప్రతిభావంతురాలు. కానీ ఆమె ప్రతిభ, నైపుణ్యాలు, ఆమె ప్రయాణం చివరకు మరణం వైపే ఆమెను లాక్కుపోయాయి.

అన్నీ కలిసివచ్చి ఉంటే ఆమె జీవితంలో సుదీర్ఘకాలం ప్రయాణించేది. గణిత శాస్త్రజ్ఞురాలిగా భారత విజయగాథల్లో ఆమె పేరు లిఖితమయ్యేది. కానీ తాను చదువుకుంటున్న కాలేజీలో తోటి విద్యార్థులకు ఉన్న సౌకర్యాలు లేకపోవడం వల్లే ఆమె జీవితం నుంచి తప్పుకుంది. సమాజంలోని సంపన్నులకు లభిస్తున్న అత్యున్నత జీవన శైలిని పక్కనబెడదాం. ఒక ల్యాప్‌టాప్, ఒక స్మార్ట్‌ ఫోన్‌ కూడా పొందలేకపోవడమే ఆమె జీవితాన్ని బలిగొంది. డిజిటల్‌ అవకాశాలను పొందలేకపోతున్న ఆ అవమాన భారంనుంచి ఆమె ఎంతగానో బాధపడి ఉంటుంది. తన నియంత్రణలో లేని పరిస్థితుల కారణంగా ఆమె డిజిటల్‌ భారత్‌లో భాగం కాలేకపోయింది. ఎలాంటి సౌకర్యాలూ లేని కుటుంబంలో పుట్టిన కారణంగా ఆమె ప్రతిభ, కఠోర శ్రమ విధిచేతిలో వంచనకు గురయ్యాయి. కొనుగోళ్లు, అమ్మకాల సరుకుగా మారిన విద్యావ్యవస్థ తనముందుంచే డిమాండ్లను ఆమె పొందలేకపోయింది.

ఇతర సామాజిక అంశాలనుంచి దారిద్య్రాన్ని మాత్రమే విడదీసి మనం మాట్లాడుకోవడం లేదు. మన రాజకీయ ప్రక్రియలో కానీ, మన విద్యా ప్రక్రియలో కానీ సమానత్వం ఘోరంగా వెనుకడుగు వేస్తోంది. సమాజం తన సభ్యులుకు ఏం ఇస్తోంది, సభ్యులు పరస్పరం ఎలా ఉంటున్నారు అనే కీలకమైన అంశంపై చర్చలేవీ? తమ కండబలాన్ని ప్రదర్శించే జాతీయవాదంపైనే అందరూ దృష్టిపెడుతున్నారు. మన సొంత ప్రజానీకంలో ఎంతమంది నిరుపేదల విభాగంలో ఉంటున్నారో, ఎంతమంది దారిద్య్రరేఖకు అతి సమీపంలో జీవనం సాగిస్తున్నారో ఈరోజు చాలా కొద్దిమందికే తెలుసు. ఇతరులతో సమాన స్థాయిలో ఉన్నప్పడే, ఇతరులు గౌరవించడం ద్వారానే తమ స్వీయ గౌరవం నిలబడుతుందని భావించినప్పుడే శ్రమజీవులు తమ పని గొప్పతనాన్ని అర్థం చేసుకోగలరు. 

కొంతమంది నమ్మశక్యం కానంత పేదలుగా ఉంటూ, మరికొంతమంది నమ్మశక్యం కానంత సంపన్నులుగా ఉంటున్న సమాజంలో ఏ ఒక్కరూ ఆత్మగౌరవాన్ని సాధించలేరు. అవకాశాలు పొందడంలో వెనుకబడిన వారు గౌరవప్రదమైన జీవితం గడిపగలిగే కనీస అవసరాలను కూడా తీర్చుకోలేరు. వీరు సామాజికంగా అడుగంటిపోతారు. అవమానాల పాలవుతారు. బహిష్కృతులవుతారు. జీవితంలోని ప్రతి దశ లోనూ అమర్యాదకు, అగౌరవానికి పాత్రులవుతుంటారు. పేదరికంలో ఉండటం అంటే సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వ్యవహారాల్లో సమానత్వ ప్రాతిపదికన అవకాశాలకు దూరమైపోవడం అన్నమాట. ఉన్నత విద్యాసంస్థలు కూడా ఈ అశాంతికి మినహాయింపుగా లేవు.

సమాజంలో అంతర్గతంగా ఉంటున్న ఈ అసమానతలను తెలుసుకోకుండా దారిద్య్రాన్ని మనం పరిశీలించగలమా? ఇలాంటి అసమానతలతో సంఘర్షించకుండా ఉన్నంతవరకు దారిద్య్రం అనేది అసమాన సమాజంలోని ఉత్పత్తి, పునరుత్పత్తికి అనుగుణంగా మళ్లీ మళ్లీ ఉత్పత్తవుతూ, పునరుత్పత్తి చెందుతూ కొనసాగుతూనే ఉంటుంది.  పౌరులు ఇతరుల అభిప్రాయాలను అంగీకరించి, గౌరవించే క్రమాన్ని విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులకు నేర్పుతూ వారిని ఉత్తమ పౌరులుగా మలుస్తుంటాయి. నేను సుదీర్ఘకాలంపాటు అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి తరగతులకు బోధిస్తూ వచ్చాను.

కానీ మా విధిలో మేం విఫలమయ్యామనే వేదన నన్ను దహిస్తుం టుంది.  తమ విద్యార్థులకు మంచి సమాచారం అందించడమొక్కటే టీచర్‌ పని కాదు. ఇప్పుడు విస్తృత సమాచారాన్ని పిల్లలు ఇంటర్నెట్‌ నుంచే పొందుతున్నారు. ఆ డేటాను విజ్ఞతతో ఉపయోగించడం ఎలాగో విద్యార్థులకు టీచర్‌ నేర్పాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవిత సూత్రాలను ఆ సమాచారం నుంచి ఎలా గ్రహించుకోవాలో పిల్లలకు చెప్పడమే టీచర్‌ బాధ్యత.

విప్లవాలను క్లాస్‌ రూమ్‌లు మాత్రమే బోధించే స్థితి పోయింది. నేటి ప్రపంచంలో విప్లవం అంటే రాజద్రోహం, దేశద్రోహం అయిపోతోంది. న్యాయమైన సామాజిక వ్యవస్థను రూపొందించడంలో ఇప్పుడు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. కాని ఒక మార్గం మాత్రం మన మనస్సులను విశాలం చేసే కీలక బాధ్యత గురించి అప్రమత్తంగా ఉంటోంది. ఇతరులందరినీ గౌరవభావంతో చూస్తూ తాము కూడా గౌరవం పొందే జీవన సంస్కృతి వైపు ఈ కొత్త మార్గం విద్యార్థులను ప్రేరేపిస్తుంది. జాతుల సంపద గ్రంథ కర్త ఆడమ్‌ స్మిత్‌ ఏనాడో చెప్పినట్లు వ్యక్తి సమాజం కోసం కృషి చేస్తూనే తనకోసం కూడా స్వార్థ కాంక్షను కలిగి ఉంటాడన్నది వాస్తవం.

అదే సమయంలో ప్రజల పట్ల సానుభూతి ప్రాధాన్యతను కూడా ఆయన ఎంత వివరంగా విశదీకరించారు. సానుభూతి అనేది ప్రజల మధ్య సౌహార్ద సంబంధాలను నెలకొల్పుతుంది. ఇతరుల కష్టాల పట్ల స్పందించే తత్వాన్ని అది ప్రేరేపిస్తుంది. తోటి మనిషికి జరిగిన హాని పట్ల మనం స్పందించేలా చేస్తుంది. ఇతరుల సౌభాగ్యం మనలను సంతోషపెట్టేలా చేస్తుంది. 

సమాజ భవిష్యత్తే ప్రజల భవిష్యత్తుగా భావించే దేశంలో మనం పుట్టి పెరిగాం. కరోనా మహమ్మారి సరిగ్గా దీన్నే స్పష్టం చేసింది. మన తోటి పౌరులు అభద్రతలో ఉన్నప్పుడు మనం భద్రతలో ఉండలేం. అందుకే సానుభూతికి చెందిన నైతిక మనోభావాన్ని మనం పెంచిపోషించాలి. సమానత్వానికి చెందిన శిఖరస్థాయి సూత్రం పైనే ఈ సానుభూతి నిర్మితమవ్వాలి. వర్శిటీలు ఇతరులతో అనుసంధానం చేసే సానుభూతి మార్గంలో నడిచేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంది. దారిద్య్రాన్ని, అధిగమించే ప్రయత్నంలో మరింతమంది విద్యార్థులు బలిదానాలు చేయడాన్ని భారత్‌ అనుమతించరాదు. 

నీరా చాందోకె 
వ్యాసకర్త మాజీ ప్రొఫెసర్,
ఢిల్లీ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top