సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త

Galileo Galilei Birth Anniversary: Nagasuri Venugopal Article - Sakshi

బరువైన వస్తువు, తేలికైన వస్తువు కన్నా వేగంగా కిందకి పడుతుందని అరిస్టాటిల్‌ (క్రీ.పూ. 384–332) భావిం చాడు. అది నిజమేనని నమ్ముతూ సాగింది యావత్తు ప్రపంచం సుమారు 20 శతాబ్దాల పాటు! దీన్ని కొందరు విభేదించినా, అరిస్టాటిల్‌ ప్రతిష్ఠ కారణంగా ఆ అభిప్రాయం చలామణి అవుతూ వచ్చింది – గెలీలియో రంగ ప్రవేశం దాకా! ఇటలీ లోని వాలిన పీసా గోపురం నుంచి వేర్వేరు బరువులున్న వస్తువులను పడవేసి, అరిస్టాటిల్‌ చెప్పిన భావన తప్పు అని రుజువు చేశాడు గెలీలియో గెలీలి. ఈ వృత్తాంతం జరిగిందనే ఆధారాలు లేకపోయినా – విరివిగా నేటికీ గిరికీలు కొడుతోంది.

గెలీలియోతో ఆధునిక విజ్ఞానం మొదలైందని పరిగణిస్తూ క్రీ.శ. 1550ను ప్రారంభంగా సూచిస్తాం. ఆయనను ఆధునిక వైజ్ఞానిక పితామహుడిగా పరిగ ణించాలని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్, స్టీఫెన్‌ హాకింగ్‌ వంటి వారు పేర్కొంటారు. కటకాలను ఉపయోగించి దూరపు వస్తువులను తలకిందులుగా చూడగలుగు తున్నారని తెలియగానే ఆరునెలల్లో టెలిస్కోపు నిర్మించుకున్నారు గెలీలియో. దీనితో పాలపుంత విషయాలు, జూపిటర్‌ గ్రహానికుండే చంద్రుళ్ళు, శని గ్రహపు వలయాలు– ఇలా చాలా సంగతులు చూపించి సైన్స్‌ ఏమిటో వివరించిన తొలి ప్రాయోజిక శాస్త్రవేత్త. తన టెలిస్కోపును తనే తయారుచేసుకున్న ఇంజనీరు కూడా! వైద్యుడు కావాలనుకున్నా గణితం మీద ఇష్టంతో గణితాచార్యుడై ప్రకృతి నియమాలు గణితాత్మకమని ప్రతిపాదించారు.

సూర్యుడు, చంద్రుడు మొదలైనవి భూమి చుట్టూ తిరుగుతున్నాయనే నమ్మకం పుస్తకాలలో చేరి మతభావనలలో అంతర్భాగమైంది. కోపర్నికస్‌ (1473–1543) దీన్ని కాదని సూర్యుని చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతున్నాయనే ‘సూర్య కేంద్రక సిద్ధాంతం’ ప్రతిపాదించి, విశ్వాసాలతో ఇబ్బందులు పడి, అలాగే మరణించాడు. కానీ గెలీలియో టెలిస్కోపుతో ఏది ఏమిటో విప్పిచూపాడు. భూకేంద్రక సిద్ధాంతం కంటే సూర్యకేంద్రక సిద్ధాంతం అర్థవంతమని వివరించాడు. ఫలితంగా అది మత పెద్దలకు కంటగింపుగా మారింది. అయినా పట్టు వదలక ఈ విషయాలను నాటకంగా రాసి, మరింతగా జనాల్లోకి తీసుకెళ్లిన సృజనశీలి గెలీలియో. ఈ సాహసగుణమే ఉద్యోగానికి ఎసరుపెట్టింది. చివరికి గృహఖైదులో కనుమూసేలా చేసింది. గెలీలియో ప్రతిపాదనను గుర్తించినట్టు 1992 అక్టోబర్‌ 31న వాటికన్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

స్థిరపడిన విషయాన్ని ప్రశ్నించే తత్వాన్ని తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న గెలీలియోకు కవిత్వం, సంగీతం, కళా విమర్శ అంటే కూడా ఆసక్తికరమైన అంశాలు. నిజానికి అప్పటికి మతం, ఫిలాసఫీ, సైన్స్‌ మూడూ ఒకటే అనే తీరులో సాగేవి. ఈయన గొప్పతనం ఏమిటంటే – మతం నుంచి సైన్సును వేరుచేశాడు. తర్వాత ఫిలాసఫీ నుంచి సైన్సును వింగడించి పరిపుష్టం చేశాడు. గెలీలియో చేసిన మరో గొప్ప పని ఏమిటంటే – గణితాన్ని విజ్ఞాన శాస్త్రంలో ప్రవేశపెట్టడం. గణితం రాకతో విజ్ఞాన శాస్త్రానికి కచ్చితత్వం ఒనగూడింది. ఆయన ఎంత సూక్ష్మగ్రాహి అంటే – చర్చిలో ఊగే దీపాన్ని పరిశీలించి – వేగం తగ్గినా, కదిలే దూరం మారినా, చలనానికి పట్టే వ్యవధి మారదని గుర్తించారు. ఎలా సాధ్యమైందిది? నాడిని కొలిచి ఈ విషయం చెప్పారు. పరోక్షంగా ‘పల్సో మీటర్‌’ భావనను ఆయన ఇచ్చారు. 

1564 ఫిబ్రవరి 15న జన్మించిన గెలీలియో 1642 జనవరి 8న కనుమూశారు. అదే సంవత్సరంలో ఐజాక్‌ న్యూటన్‌ జన్మించడం విశేషం! విశ్వాసాలను పరీక్షకు పెట్టడమే కాదు, పరిశీలనతో తనను తాను సవరించుకునే సైన్స్‌ టెంపర్‌ కలిగిన గొప్ప సాహసి అయిన శాస్త్రవేత్త గెలీలియో గెలీలి.

- డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ 
వ్యాసకర్త ఆకాశవాణి పూర్వ సంచాలకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top