పార్లమెంట్‌ పనితీరు ఇలాగేనా?

Azadi Ka Amrit Mahotsav Karan Thapar on Functioning of Parliament - Sakshi

కామెంట్‌

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను జరుపుకొంటున్నాం. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మన పార్లమెంట్‌ పనితీరు ఎంత సమర్థంగా ఉంటోందని ప్రశ్నించుకోవడానికి ఇంతకంటే సముచిత సందర్భం మరొకటి దొరకదు. 1950లు, 60లలో అంటే స్వాతంత్య్రానంతర కాలపు లోక్‌సభలు దాదాపుగా సగటున నాలుగు వేల గంటలు పనిచేశాయి. కానీ అయిదేళ్ల పాటు పూర్తికాలం పనిచేసిన 16వ లోక్‌సభ కేవలం 1,615 గంటలపాటు మాత్రమే పనిచేసింది. అలాగే, లోక్‌సభ ముఖ్యమైన విధులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వీటిలో ఒకటి – చట్టాలను ఆమోదించడం. వీటికి సంబంధించి తగినంత చర్చ జరగడం లేదు. తొలి రెండు లోక్‌సభా కాలాల్లో 71 శాతం, 60 శాతం బిల్లులను కమిటీల పరిశీలనకు పంపేవారు. కానీ ఇప్పుడు మాత్రం 25 శాతం బిల్లులను మాత్రమే కమిటీల పరిశీలనకు పంపుతున్నారు. అంటే శాసనం అవసరమైనంత మేరకు తనిఖీకి గురవుతోందా అనేది ప్రశ్న.

ప్రస్తుతం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో మనం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా పార్లమెంట్‌ పనితీరు ఎంత సమ ర్థంగా ఉంటున్నదని ప్రశ్నించడం ఎంతో సముచితంగా ఉంటుంది. మనం పెట్టుకున్న అంచనాలను భారత పార్లమెంట్‌ నెరవేరుస్తోందా లేక మనల్ని నిరాశపరుస్తోందా? దీనికి సంబంధించి ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పీఆర్‌ఎస్‌’(పాలసీ రీసెర్చ్‌ స్టడీస్‌) లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ నుంచి సేకరించిన గణాంకాలు ఆందోళన కలిగించే ప్రశ్నలను లేవ నెత్తడమే కాదు... మనకు కలవరం కలిగించే నిర్ధారణలను కూడా ఇస్తున్నాయి.

తగ్గిన పనిగంటలు
ముందుగా మనం లోక్‌సభతో ప్రారంభిద్దాము. అయిదేళ్లపాటు పూర్తి కాలం పనిచేసిన 16వ లోక్‌సభ 1,615 గంటలపాటు పనిచేసింది. అంతకుముందు పూర్తికాలం పనిచేసిన లోక్‌సభలతో పోలిస్తే 16వ లోక్‌ సభ 40 శాతం తక్కువగా పనిచేసింది. 1950లు, 1960ల నాటి లోక్‌సభలు దాదాపుగా సగటున 4,000 గంటలపాటు పనిచేస్తూ వచ్చాయి. కానీ ప్రస్తుతం లోక్‌సభ పనిచేసే సమయం బాగా తగ్గి పోతోందని అర్థమవుతుంది.

లోక్‌సభ ముఖ్యమైన విధులు రెండూ ఇప్పుడు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వీటిలో మొదటిది, చట్టాలను ఆమోదించడం. 15వ లోక్‌సభలో 26 శాతం బిల్లులు 30 నిమిషాలలోపే ఆమోదం పొందేవి. అదే 16వ లోక్‌సభలో 6 శాతం బిల్లులు 30 నిమిషాల లోపు ఆమోదం పొందగలిగాయి. ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి రెండు లోక్‌సభా కాలాల్లో 71 శాతం, 60 శాతం బిల్లులను కమిటీల పరిశీలనకు పంపేవారు. కానీ ఇప్పుడు మాత్రం 25 శాతం బిల్లులు మాత్రమే కమిటీల పరిశీలనకు పంపు తున్నారు. అంటే శాసనం అవసరమైనంత మేరకు తనిఖీకి గురవు తోందా అనేది ప్రశ్న.

తగ్గిన ప్రశ్నలు
ఇక లోక్‌సభ రెండో ముఖ్యమైన విధి ఏమిటంటే, ప్రభుత్వాన్ని జవాబుదారీతనంలో ఉంచటమే. కానీ గత నాలుగు లోక్‌సభల్లో ప్రశ్నోత్తరాల సమయం దానికి కేటాయించిన సమయంలో 59 శాతం వరకు మాత్రమే పనిచేసింది. ఇక రాజ్యసభలో అది 41 శాతానికి పడిపోయింది. సభలో నిత్యం కలిగే అంతరాయాలు ప్రశ్నించే అవ కాశాన్ని హరించి వేస్తున్నాయి. నిస్సందేహంగా ఎంపీల ప్రవర్తనను దీనికి కొంతవరకు నిందించాల్సి ఉంటుంది. కానీ, సభను క్రమ శిక్షణలో పెట్టడంలో స్పీకర్‌ పక్షపాతపూరిత వైఫల్యమే దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి.

ఇక రాష్ట్రాల శాసనసభల్లో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. గత సంవత్సరం శాసనసభలు సగటున 21 రోజులు మాత్రమే పనిచేశాయి. 2020లో రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదం పొందిన బిల్లుల్లో సగం పైగా వాటిని ప్రవేశపెట్టిన రోజే ఆమోదం పొందాయి.

స్వేచ్ఛ లేదు!
ఇక ప్రత్యేకించి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పార్లమెంట్‌ సభ్యులు ఇప్పుడు ఊపిరాడని స్థితిలో ఉండటమే! దీనికి ఫిరా యింపుల చట్టమే కారణమని నేరుగా ఆరోపించవచ్చు. తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు ఉన్న ప్రజాప్రతినిధులు వీరు అని అందరూ చెప్పుకుంటుంటారు. కానీ తమ పార్టీ నాయకత్వానికి వారు బానిసలుగా మారిపోయారు. ఎందుకంటే తమ పార్టీ జారీచేసే విప్‌కి భిన్నంగా ఎంపీలు ఓటు వేయడాన్ని ఈ ఫిరాయింపుల చట్టం నిరో ధిస్తోంది. ఫిరాయింపుల చట్టం పార్లమెంట్, రాష్ట్రాల శాసన సభల స్వభావాన్ని ప్రాథమికంగా మార్చివేసిందని పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ సంస్థకు చెందిన చక్షు రాయ్‌ చెబుతున్నారు.

ఎంపీలకు వారి స్వాతంత్య్రాన్ని వారికి ఇవ్వడానికి, ఫిరా యింపుల వ్యతిరేక చట్టాన్ని ఫైనాన్స్‌ బిల్లులకూ, అవిశ్వాస తీర్మానం సమయంలో ఓట్లకూ మాత్రమే పరిమితం చేయాల్సిన అవసర ముంది. ఇతర అంశాలపై వారి పార్టీ నాయకత్వంతో విభేదించేం దుకు వారిని స్వేచ్ఛగా వదిలిపెట్టాలి.

అభిప్రాయ మార్పిడి జరగాలి
ఇక రాజ్యసభలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. రాజ్యాంగపరంగా రాజ్యసభ అంటే ఒక సవరించే ఛాంబర్‌ అని అర్థం. లోక్‌సభ ఆమోదించిన శాసనం ఇక్కడ పునరాలోచనకు గురి కావచ్చు. అలాగే రాష్ట్రాల ఆందోళనలను వ్యక్తీకరించే చాంబర్‌గా కూడా ఇది వ్యవహరిస్తుంది. 2003లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఫిరాయింపు వ్యతిరేక చట్టం, పార్లమెంట్‌ మొట్టమొదటి విధిని ఛిన్నాభిన్నం చేసిపడేసింది. ఇది రాష్ట్రాలకూ, రాజ్యసభ అభ్యర్థులకూ మధ్య లింకును బద్దలు చేసేసింది. అంటే రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా బలహీనపర్చింది. అంటే రాజ్యసభ తన ఉనికికి సంబంధించిన హేతువును కూడా కోల్పోయినట్లేనా?

స్వాతంత్య్రానంతరం భారత పార్లమెంట్‌ అభివృద్ధి చెందిన తీరును మీరు గమనించినప్పుడు, ఎంపీలను పణంగా పెట్టి పార్టీ నాయకత్వాలు బలం పుంజుకున్నాయి. శాసన సభ్యులను పణంగా పెట్టి రాజకీయ పార్టీలు బలపడుతూ వచ్చాయని అర్థమవుతుంది.

కాబట్టి బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ నుంచి మనం రెండు సంప్రదాయాలు తీసుకోవాలి. ప్రస్తుత దుష్ఫలితాలను నివారించడానికి అవి మనకు సహాయం చేయవచ్చు. ప్రధానమంత్రి ప్రతివారం ప్రశ్నోత్తరాల సమయంలో నేరుగా పాల్గొనే చరిత్ర బ్రిటన్‌కు ఉంది. దీనిలో ప్రధాన మంత్రికీ, ప్రతిపక్ష నాయకుడికీ మధ్య ప్రత్యక్ష అభిప్రాయాల మార్పిడి ఉంటుంది. ఇది భూమ్మీద అతి శక్తిమంతమైన రాజ్యాన్ని ప్రశ్నించే అవకాశం ప్రతిపక్షానికి అందిస్తుంది. భారత్‌లో మనకు కూడా సరిగ్గా అలాంటి అవకాశం ఉండాల్సిన అవసరం ఉంది.

మెరుగుపడాలి!
మరో సంప్రదాయం స్పీకర్‌కి సంబంధించింది. బ్రిటన్‌లో ఒకసారి ఎన్నికయ్యాక స్పీకర్‌ తన పార్టీ నుంచి రాజీనామా చేస్తారు. సిట్టింగ్‌ స్పీకర్‌ రీ–ఎలక్షన్‌కు నిలబడినట్లయితే ఎవరూ ఆయనపై పోటీ చేయరు. దీనివల్ల స్పీకర్‌కూ, తన పార్టీకీ మధ్య లింకు తెగిపోతుంది. అంటే తాను పక్షపాత రహితంగా కచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. మనం చేపట్టాల్సిన మరొక మంచి సంప్రదాయం ఇది.

అంతిమంగా, పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ సంస్థ నిజంగా సమా ధానం చెప్పలేని ప్రశ్న ఒకటి ఉంది. అదేమిటంటే, గత 75 సంవ త్సరాల్లో మన ఎంపీల నాణ్యత, ప్రతిభ, సామర్థ్యం మెరుగు పడ్డాయా? ఏడు దశాబ్దాల క్రితం నాటి కంటే మెరుగైన, ప్రతిభా వంతులైన పార్లమెంట్‌ ఎంపీలు మనకు ఇప్పుడు ఉన్నారా? 1947 నుంచి సమయం, చర్చ, భద్రత విషయంలో పార్లమెంట్‌ పనితీరు క్షీణించి పోయిందా అంటే... ఈ ప్రశ్నకు సమాధానం అవును అని రాకుండాపోయే అవకాశం తక్కువ.


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top