స్వర్ణాంధ్రానికి స్వతంత్రం లేదా? | Andhra Pradesh High Court orders continuation of Amaravati development | Sakshi
Sakshi News home page

స్వర్ణాంధ్రానికి స్వతంత్రం లేదా?

Apr 4 2026 3:45 AM | Updated on Apr 4 2026 3:45 AM

Andhra Pradesh High Court orders continuation of Amaravati development

శూన్యం నుంచి గారడీ వీరుడు ఒక రాజధానిని పుట్టించవచ్చు అన్నట్టుగాఉంది ‘అమరావతి’ అనే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కథ. తెలంగాణ నుంచి విడి పోయిన తరువాత ఇప్పటి దాకా ఆంధ్ర ప్రదేశ్‌కు నిర్దిష్టమైన రాజధాని లేకపోతే అది శాపమా లేక చేవలేనితనమా? ప్రభుత్వ పరిపాలనా కేంద్రాలన్నీ ఒకే చోట నిర్మించడం తప్పు అని శివరామకృష్ణన్‌ కమిటీ చెబితే అది పనికిరాదు. వికేంద్రీకరణ వద్దు, ప్రతిచోటా కేంద్రీకరణ. తద్వారా రియల్‌ ఎస్టేట్‌ దుకాణాలు!

ఇదొక సంక్షోభం
మన భారత రాజ్యాంగం ప్రకారం ఆ యా రాష్ట్రాలు, పార్లమెంట్‌ ఆమోదం మేరకు ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పాలనలో భాగంగా రాజధాని ఏర్పాటు చేసుకుంటుంది. హైదరాబాద్‌ తరతరాలు, శతాబ్దాల క్రమంలో రాజధానిగా నిలబడింది.ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ఈ కథ వేరు. ఒక బలీయమైన ప్రభుత్వం ఉంటే ఒక జీవో ద్వారా రాజధాని ఏదో నిర్ణయించవచ్చు. కొన్ని రాష్ట్రాలలో ఒకటికన్నా ఎక్కువ రాజధానులు ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే రాజధాని ఉండటం కూడా మనకు తెలుసు. 

2014లో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రంగా ఏర్ప డితే... 2026లో పార్లమెంట్‌ అమరావతిని రాజధాని అని చెబుతూ చట్టం చేసిందంటే... ఇంతకన్నా విషాదం ఏమైనా ఉందా? శాసనసభలో అమరావతిని రాజధానిగా పేర్కొంటూ ఆమోదించిన తీర్మానాన్ని శాసన మండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఎక్కడో ఢిల్లీలో ఉన్న పార్లమెంట్‌కు పంపే ముందు... ఏపీ శాసన వ్యవస్థలో భాగమైన శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టక పోవ డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 

వికేంద్రీకరణ వద్దా?
ఒక దశలో సీఆర్డీఏ చట్టం ద్వారా అమరావతిని రాజధాని అన్న మాట ఈ సందర్భంగా గుర్తుంచు కోవాలి. అలాగే ఒక విధానం ద్వారా (సంవిధానంగా కాదు) ల్యాండ్‌ పూలింగ్‌ చేసి నిర్మించాలను కున్న విషయాన్నీ గమనంలో ఉంచుకోవాలి. దీన్ని నిర్మించడానికి లక్షల కోట్లు కుమ్మరించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరా బాదులోనే సమస్త అభివృద్ధినీ కేంద్రీకరించి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారనే విమర్శ ఉంది.

అందుకే వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి పాలనా కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానులను ప్రతిపాదించారు. ఈ విధానం వికేంద్రీకరణ లక్ష్యంతో ముందుకు వచ్చింది. ఒకే నగరంలో అధికార కేంద్రీకరణ తగ్గించాలనే ఉద్దేశ్యం దీనిలో ఉంది. ఇందువల్ల నిధులు, ఉద్యోగాలు, పరిశ్రమలు, అధికారాలు వికేంద్రీకరించే అవకాశంఉంటుంది. కానీ అమరావతిపై ఉన్న భ్రమల కారణంగా భూములు ఇచ్చిన రైతులు కోర్టులను ఆశ్రయించారు. 

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆదేశించింది. రాజధాని లేని దయనీయ పరిస్థితి ఉన్నందున విధిలేక కోర్టు ఈ తీర్పుఇచ్చింది. ఈ తీర్పు న్యాయవ్యవస్థ పరిమితులపై కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది: రాజధానిని నిర్ణయించేది ఒక పాలసీ అయితే, దాన్ని ఎప్పుడైనా మార్చవచ్చా? కోర్టులు ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించ గలవా వంటి ప్రశ్నలు రాజ్యాంగంలో ఈ విషయంపై ఉన్న ఖాళీని గుర్తించేలా చేశాయి. నిజానికి ఇదొక సంక్షోభం!

ఏదో కారణంగా విశాఖపట్టణం రాజధానిగా వద్దనుకున్నారు. విశాఖ కాకపోతే ‘మావిగ¯Œ ’ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్‌ రాజ ధాని ప్రాంతం అయితే బాగుంటుందన్నది మంచి ప్రతిపాదన. మచిలీపట్నం వద్ద జగన్‌ ప్రభుత్వం నౌకాశ్రయ (పోర్టు) నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం–విజయవాడకు, విజయవాడ–గుంటూరు మధ్య ఆరు వరుసల జాతీయ రహదారులు ఉన్నాయి. విజయవాడ శివార్లలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అమరావ తిలో పెట్టే 10 శాతం ఖర్చుతోనే ఇక్కడ రాజధాని సాధ్యం అవుతుందని చెబుతుంటే వినేవాళ్లెవరు? 

పారదర్శకత ఉందా?
తెలుగు ప్రజలందరికీ ఇది చరిత్రాత్మకమైన రోజని టీడీపీమంత్రులు సంతోషపడుతున్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందనీ, కృష్ణానది తీరంలో అమరావతి నిర్మించా లనేది ఏపీ ప్రభుత్వ నిర్ణయమనీ, ఐకానిక్, వరల్డ్‌ క్లాస్‌ రాజధానిగా నిర్మాణం జరుగుతోందనీ కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. బాగానే ఉంది కానీ అది ఏపీ ప్రభుత్వ నిర్ణయమైతే, పార్లమెంట్‌ చట్టం అవసరం ఎందుకు వచ్చింది? 

పైగా ఇంతటి భారీ వ్యయాలపై, పారదర్శకత లోపంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమని చెప్పడం, ఆ నిధుల మూలాలు స్పష్టంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది రాజ్యాంగబద్ధ విశ్లేషణ. ప్రాంతాల వారీగా, కులాల వారీగా రాజధాని నిర్మాణానికి ప్రతిబం«ధకాలు గమనించక తప్పదు. మౌలిక సదుపాయాలకు గాను లక్ష ఎకరాలకు ఎకరానికి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతున్నది. ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది అంటూ పార్లమెంట్‌లో బిల్లు ఎలా పెడతారు అన్న ఆయన ప్రశ్న కీలకమైనది. 

అలాగే సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగుల స్థలం కావాలనడం ఆశ్చర్యం కలిగించే మరో అంశం. తెలంగాణలో కొత్త సచివాలయానికి 600 కోట్ల రూపాయలు ఎక్కువ అనే విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు కావాలి? అనేక ప్రశ్నలు, గందరగోళాలు, కుంభకోణాల గండాలను దాటి, 12 సంవత్సరాల తరువాతైనా ఒక స్థిరమైన రాజధాని వస్తుందా?

-వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్‌
-మాడభూషి శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement