ఆన్‌లైన్‌లోనే.. ఆరోగ్య ‘యోగ’

Yoga In Online Improves Respiratory System Health Covid Pandemic Time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల జీవనశైలిలో ఎన్నెన్నో మార్పులు తెచ్చింది. నాలుగు గోడల మధ్యలోనే అన్ని వ్యవహారాలూ చక్కబెట్టే ఓర్పూ నేర్పూ అలవాటు చేసింది. అదే క్రమంలో వ్యాయామాలకూ ఇళ్లే కేంద్రమైంది. మరీ ముఖ్యంగా కోవిడ్‌పై పోరాటం తప్పనిసరి కావడంతో యోగా, ప్రాణాయామ సాధనపై నగరవాసుల్లో ఆసక్తి బాగా పెరిగింది. కేవలం తాము నివసిస్తున్న నగరం నుంచి మాత్రమే కాదు వేర్వేరు ప్రాంతాలకు చెందిన యోగా శిక్షకులు  శిక్షణ తరగతులకు సైతం హాజరయ్యే వెసులుబాటు కలిగింది. మొత్తం మీద చూస్తే ఆన్‌లైన్‌లోనే యోగా సాధన మరింత ప్రయోజనకరమంటున్నారు యోగా ప్రియులు.


‘‘గత రెండేళ్లుగా ఇంట్లోనే వ్యాయామం అలవాటైంది. కరోనాపై పోరాటానికి యోగా చాలా ఉపయోగపడుతుందని తెలిసింది, కాబట్టి ఇంటిల్లిపాదీ యోగా సాధన ప్రారంభించి కొనసాగిస్తున్నాం. ఆన్‌లైన్‌లో కృష్ణాజీ ఉచితంగా అందించే శిక్షణ తరగతులకు రెగ్యులర్‌గా అటెండ్‌ అవుతున్నాం’’ అని మెహదీపట్నంలో నివసించే స్మిత వాడేకర్‌ తెలిపారు. 

ఆన్‌లైన్‌లోనే మేలు...
ఇతర వ్యాయామాల పరికరాల అవసరం గానీ, నేరుగా నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌ శిక్షణకీ పెద్దగా తేడా లేకపోవడంతో ఆన్‌లైన్‌ యోగా అనూహ్యంగా అందరికీ సులభంగా దగ్గరైపోయింది. కేవలం ఒక యోగా మ్యాట్‌ తీసుకుని ఇంట్లో ఏ కాస్త జాగా దొరికినా యోగ చేయడం ఇప్పుడు  సర్వసాధారణమైంది. ‘‘గతంలో ఎన్నోసార్లు యోగా శిక్షణ తీసుకుందాం అనుకుంటూనే  వాయిదా వేస్తూ వచ్చాం. ఇప్పుడు ఇంట్లోకే యోగా క్లాసెస్‌ వచ్చేయడంతో ఇక వాయిదా వేయాల్సిన అవసరం లేకపోయింది’’ అని నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి ఉమాకాంత్‌ చెప్పారు. గత కొన్ని నెలల్లో ప్రాణయామ, సూర్య నమస్కారాలు వంటి పలు రకాల సులభమైన ఆసనాల సాధన బాగా అలవాటైందని, నిజానికి యోగా శిక్షణకి వెళ్లడం కంటే ఆన్‌లైన్‌లోనే నేర్చుకోవడం మరింత సులభమనీ ఆయన అభిప్రాయపడ్డారు.

పెరిగిన విశ్వాసం
కోవిడ్‌ ప్రధానంగా శ్వాస కోస వ్యాధి కావడం, ఊపిరితిత్తుల సామర్ధ్యానికి య్రోగాలో భాగమైన పాణయామ వంటివి చాలా ఉపయుక్తమైనవి అని తేలడంతో యోగాపై నగరవాసుల్లో మరింత నమ్మకం బలపడింది. తక్కువ వ్యయ ప్రయాసలతోనే ఎక్కువ ఆరోగ్య లాభాలు అందించే దిగా యోగా సాధన సిటీజనులకు నచ్చే వ్యాయామాల జాబితాలో ప్రధమ స్థానం దక్కించుకుంది. 

ఉచితంగా..యోగా
గత కొంత కాలంగా యోగా శిక్షణ అందిస్తున్నాను. లాక్డవున్‌ తర్వాత ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించాను. ఇంత పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి  ఆన్‌లైన్‌ యోగా శిక్షణకు హాజరవడం ఇంతకు ముందెన్నడూ చూడలేదు. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత కూడా పలువురు ఆన్‌లైన్‌ ద్వారా యోగా సాధన చేసి త్వరగా వ్యాధి నుంచి కోలుకోగలిగారు. ఈ సమయంలో వీలైనంత ఎక్కువ మందికి ఉపయోగపడాలని పూర్తి ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నాను. ఎవరైనా సరే  మెయిల్‌ krishnajikorti@gmail.com ద్వారా లేదా ఫోన్‌ నెం: 9969860352లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవచ్చు. 

-కృష్ణాజీ, శ్రీ నాగరాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా, ముంబయి
 

చదవండి: Yoga Day 2021: ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన బహుమతి యోగా : రాష్ట్రపతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top