క్షమాపణే శాంతి మంత్రం | World Forgiveness Day July 7th | Sakshi
Sakshi News home page

క్షమాపణే శాంతి మంత్రం

Jul 6 2025 7:35 AM | Updated on Jul 6 2025 10:02 AM

World Forgiveness Day July 7th

ఎన్నో రక్తపు మరకలకు, ఎందరో ఆర్తనాదాలకు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే హీనగుణాలే కారణమని ప్రాచీన పురాణాలే కాదు, ఆధునిక చరిత్ర కూడా చెబుతోంది. నేటికీ లోకంలో జరుగుతున్న అనేకానేక అకృత్యాలకు మూలకారణం ఈ అరిషడ్వర్గాలే! మరి, లోకాన్నే అతలాకుతలం చేసే ఈ అరిషడ్వర్గాల మెడలు వంచే గొప్ప సుగుణం ఏదైనా ఉందా అంటే, అది ‘క్షమా గుణమే’ అంటాయి అన్ని మతాలూ! ఎన్నో సందర్భాలు ఆ విషయాన్ని రుజువు చేశాయి కూడా! నిజానికి దేన్నైనా మన్నించగలిగేంత నిబ్బరం; దేన్నైనా తట్టుకోగలిగేంత సహనం; దేన్నైనా త్యజించేంత త్యాగశీలత– ఇవి మనిషికి ఊరికే వస్తాయా? క్షమ వల్ల వచ్చే మనశ్శాంతిని మనసారా నమ్మినప్పుడు, మానవత్వాన్ని ఆత్మవిలీనం చేసుకోగలినప్పుడు, స్వార్థాతీతంగా స్వచ్ఛమైన భావాలు ఉద్భవించినప్పుడు మాత్రమే వస్తాయి!

గడ్డి లేని చోట ఎంత పెద్ద నిప్పు కణిక పడినా, కాసేపటికే బూడిదైనట్లు.. కోపం, ద్వేషం, ప్రతీకారం లేని మనిషి ముందుకు, ఎంతటి చెడ్డవాడు వచ్చినా గెలవలేడు అంటుంది శాస్త్రం. అందుకే ‘మనసు నిండా క్షమను నింపుకోవడం ఉత్తమం’ అంటాడు మహాభారతంలో విదురుడు. సోదరులైన పాండురాజు సంతానానికి, ధృతరాష్ట్రుడి సంతానానికీ ఎన్నోమార్లు సయోధ్య కుదర్చాలని విఫలయత్నం చేసిన ధర్మజ్ఞుడు అతడు! మరి క్షమించడం అంత తేలికా? జీవితాలను ఛిద్రం చేసిన వారిని, బంధాలను దూరం చేసిన వారిని, జీవితానికి సరిపడా దుఃఖాన్ని మిగిల్చిన వారిని నిజంగానే క్షమించగలమా? అసలు క్షమాగుణం గురించి చరిత్రేం చెప్పింది? మతమేమంటోంది? శాంతి, కరుణ, జాలి, దయ, సానుభూతి, త్యాగం, సహనం లాంటి ఉదాత్త గుణాలు కలిగిన ఉన్నతమైన మనుషులకే అసాధ్యమనిపించే క్షమాగుణం... నిత్యం ప్రతికూల ఆలోచనలతో లోలోపలే రగిలిపోయే దుర్జనులను ఎలా మార్చగలుగుతుంది?

చరిత్రను తవ్వాలంటే మొదటిగా దక్షిణాఫ్రికా నుంచే మొదలుపెట్టాలి. అక్కడ జరిగినవన్నీ మనసులను మెలిపెట్టే ఉదంతాలే! అక్కడ శ్వేతజాతీయుల పాలనలో కొనసాగిన జాతి వివక్షకు లక్షలాది మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. 1948లో నేషనలిస్ట్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్కడి నల్లజాతీయులు అన్ని హక్కులనూ కోల్పోయారు. శ్వేతజాతీయుల దురహంకారానికీ, అమానుష చర్యలకూ ఎన్నో బతుకులు తెల్లారిపోయాయి. ఈ భయంకరమైన చీకటి కాలం నెల్సన్‌ మండేలా పోరాటంతో అంతమైంది. నాటి ఆకృత్యాలకు ఆయన కూడా బాధితుడే! ఏకంగా ఆయన 27 ఏళ్ల జీవితం జైల్లోనే గడిచింది. 

1964 నుంచి 1990 వరకూ బందీగానే ఉన్న ఆయన బయటకి వచ్చిన తర్వాత ప్రతీకారంతో రగిలిపోలేదు. క్షమాపణ, సయోధ్య అనే అసాధారణ మార్గాలను ఎంచుకున్నారు. ప్రజాస్వామ్యం మొదలై, అధ్యక్షుడు అయిన తర్వాత ఆ దార్శనికతతోనే ‘ట్రూత్‌ అండ్‌ రీకాన్సిలియేషన్‌ కమిషన్‌’ (టీఆర్‌సీ) ఏర్పాటు చేశారు. జాతి వివక్ష కాలంలో జరిగిన అన్యాయాలన్నీ అప్పుడే ప్రపంచానికి తెలిశాయి. ఈ కమిషన్‌ ముఖ్య ఉద్దేశం నల్లజాతీయులను బాధించిన నేరస్థులను శిక్షించడం కాదు, నాటి కాలంలో జరిగిన అమానుష చర్యలను వెలికి తీయడం. 

అందుకే బాధితులు, నేరస్థుల మధ్య క్షమాభిక్షతో సయోధ్యను తీసుకురావడం ప్రపంచాన్నే కదిలించింది. ఎంతోమంది శ్వేతజాతి అధికారులు నల్లజాతి బాధితుల ముందే తమ నేరాలను అంగీకరించారు. అయితే ఆ ఉదంతాల్లో హృదయం ద్రవించే యధార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని స్వయంగా.. టీఆర్‌సీ చైర్మన్‌ ఆర్చ్‌బిషప్‌ డెస్మండ్‌ టుటు తన ‘నో ఫ్యూచర్‌ వితౌట్‌ ఫర్‌గివ్‌నెస్‌’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన రాసిన ఓ గాథ ఎందరినో కంటతడిపెట్టించింది.

టీఆర్‌సీ చైర్మన్‌ టుటు చెప్పిన గాథ
ట్రూత్‌ అండ్‌ రీకాన్సిలియేషన్‌ కమిషన్‌ (టీఆర్‌సీ) చైర్మన్‌ ఆర్చ్‌బిషప్‌ డెస్మండ్‌ టుటు ముందు ‘వ్యాన్‌ డెర్‌ బ్రూక్‌’ అనే శ్వేతజాతి అధికారి తాను చేసిన నేరాలను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, చాలా నిర్లిప్తంగా అంగీకరించాడు. అప్పుడు, ‘బిట్రిస్‌ నాండ్రంగా’ అనే 70 ఏళ్ల నల్లజాతి వృద్ధురాలు అక్కడే కూర్చుని అతడి మాటలను స్పష్టంగా వింటోంది. బ్రూక్‌ చంపేసింది ఆమె కన్నకొడుకును, భర్తనే!బిట్రిస్‌ కొడుకును బ్రూక్‌ ఒక వాహనంలో బంధించి, అతని చేతులు, కాళ్లు కట్టి, ఒక నదిలోకి విసిరివేసి చంపేశాడు. కొన్ని నెలల తర్వాత బిట్రిస్‌ భర్తను లాక్కెళ్లి బంధించాడు. బిట్రిస్‌ తన భర్త కోసం ఎన్నో రోజులు వెతికింది. ఒకరోజు బ్రూక్‌ ‘నీ భర్తను చూపిస్తాన’ని బిట్రిస్‌ని తీసుకెళ్లి, ఆమె కళ్లముందే ఆమె భర్తకు నిప్పు అంటించి చంపేశాడు. 

కోర్టులో బ్రూక్‌ అహంభావాన్ని చూస్తున్న బిట్రిస్‌ కోపంతోనో, ద్వేషంతోనో ఊగిపోతుందని బ్రూక్స్‌ మాటలు విన్నవారంతా భావించారు. బ్రూక్‌ నేరాంగీకార ప్రకటన ముగిసిన తర్వాత బిట్రిస్‌ మాత్రం బ్రూక్‌నే కాదు, యావత్‌ ప్రపంచాన్నే కదిలించేలా స్పందించింది. ‘నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే! మిస్టర్‌ వ్యాన్‌ డెర్‌ బ్రూక్, నా కొడుకును ఎలా చంపాడో, నా భర్తను ఎలా హత్య చేశాడో చాలా వివరంగా చెప్పాడు. అతను వాళ్ళను చిత్రహింసలు పెట్టాడు. నా కొడుకు చనిపోవడానికి ముందు ఎంతగా బాధపడ్డాడో, ఎంత భయపడ్డాడో ఊహించుకోగలను.నా భర్త శరీరం తగలబడిపోవడం నేను కళ్లారా చూశాను. 

కాని, నాకు ఒక విషయం కావాలి. మిస్టర్‌ వ్యాన్‌ డెర్‌ బ్రూక్, దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయగలరా? నా కొడుకు శరీరాన్ని నదిలో విసిరేసినప్పుడు, నన్ను అమ్మా అని పిలిచాడా? అది చెప్పండి. అప్పుడు నేను వెళ్లి ఆ నదిలో ఆ అమ్మా అనే పిలుపును వెతుక్కుంటాను. నా భర్త కాలిపోతున్నప్పుడు అతి సమీపంలో ఉన్న మీకు నన్ను పిలవడం వినిపించిందా? పోనీ అది చెప్పండి. నేను వెళ్లి ఆ ప్రదేశంలో ఆ చివరి మాటను వెతుక్కుంటాను. నాకిక మీ మీద కోపం లేదు. నాకు కావాల్సింది ఈ ఒక్క వివరమే! నేను మిమ్మల్ని క్షమిస్తాను. కాని, నేను మిమ్మల్ని క్షమించాలంటే, నేను క్షమించానన్న సంగతి మీకు అర్థం కావాలి కదా! దయచేసి వచ్చి నన్ను ఆలింగనం చేసుకోండి’ అందట ఆమె. ఆ మాటల తర్వాత కోర్టులో నిశ్శబ్దం ఆవరించింది. వ్యాన్‌ డెర్‌ బ్రూక్‌ ఈ మాటలకు చలించిపోయాడు. 

అతను ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె పాదాల వద్ద మోకరిల్లి, కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. బిట్రిస్, అతన్ని క్షమించి, తల్లిలా అక్కున చేర్చుకుంది. ఈ సంఘటన క్షమాగుణంలోని అపారమైన శక్తిని, నెల్సన్‌ మండేలా నమ్మిన సయోధ్య ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇది దక్షిణాఫ్రికా ట్రూత్‌ అండ్‌ రీకాన్సిలియేషన్‌ కమిషన్‌ విజయ గాథలలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే ఈ కథ ఒక్క బిట్రిస్‌ది మాత్రమే కాదు, ఇలా బాధితులైన ఎంతోమంది నల్లజాతీయులు– జాతివివక్ష నేరాలకు పాల్పడ్డ శ్వేతజాతీయులు ఎందరినో క్షమించారు.

దశాబ్దాల పాటు జైల్లో శిక్ష అనుభవించిన నెల్సన్‌ మండేలా– అధ్యక్షుడు అయిన తర్వాత కూడా క్షమాగుణమే ఆయుధం అన్నారు. ‘మనసులో ప్రతీకారముంటే, విషం తాగినట్లు ఉంటుంది. అది నీ శత్రువులను చంపుతుందని ఆశిస్తావు, కాని నిన్నే చంపుతుంది. ప్రతీకార చర్యల కంటే దయతో కూడిన పనులతోనే ఈ ప్రపంచంలో ఎక్కువగా సాధించగలం. క్షమ అనేది గతంలో జరిగిన వాటిని మరచిపోవడం కాదు, భవిష్యత్తును శాంతియుతంగా కొనసాగించగలగడం. అందుకే మనం గతంలోని ద్వేషాన్ని, ఘర్షణలను అధిగమించడానికి, ఉదారమైన స్ఫూర్తితో ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. క్షమాపణ ఆత్మకు స్వేచ్ఛనిస్తుంది, అది భయాన్ని తొలగిస్తుంది. అందుకే అది అంత శక్తిమంతమైన ఆయుధం’ అని చెప్పారు.

2006లో పెన్సిల్వేనియాలోని ప్రశాంతమైన అమిష్‌ కమ్యూనిటీ (క్రైస్తవ మత సమూహం)లో ఒక విషాదం జరిగింది. తమ పిల్లలు చదివే స్కూల్లోకి ఒక దుండగుడు తుపాకీతో చొరబడి ఐదుగురు పిల్లల ప్రాణాలను తీసేశాడు. ఆ వెంటనే అతడూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన ఎవరికైనా కోపాన్ని, ప్రతీకారాన్ని కలిగించేదే. కాని, బాధిత అమిష్‌ కుటుంబాలు, ఆ కమ్యునిటీ చాలా భిన్నంగా స్పందించాయి. వారి స్పందన కరుణ, క్షమాగుణం, అచంచలమైన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే, వారు దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి సానుభూతిని, మద్దతును అందించారు. వారి తమ విలువలకు కట్టుబడి, గాయాలను మాన్పడం ద్వేషం కంటే గొప్పదని నిరూపించారు. ఏసుక్రీస్తు బోధనలను అనుసరించి, కరుణలో ఉన్న శక్తిని తమ చర్యలతోనే ప్రపంచానికి చూపారు. నాటి అమిష్‌ కమ్యూనిటీ స్పందన చీకటిలో వెలుగులా, ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే హృదయాలకు శాంతి మార్గాన్ని చూపింది.

1963లో వియత్నాంలో బౌద్ధ సన్యాసి థిచ్‌ కాంగ్‌ డక్‌ ఆత్మార్పణ– అక్కడి అణచివేతకు వ్యతిరేకంగా జరిగింది. అసాధారణ పోరాటానికి, అద్భుత క్షమాగుణానికి అది సాక్ష్యమని చెబుతారు. వియత్నాం ప్రభుత్వ క్రూర విధానాలకు నిరసనగా, ఆయన తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నారు. ఇది కేవలం వ్యతిరేకత కాదు, శాంతి, క్షమ పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. థిచ్‌ కాంగ్‌ డక్‌ నాటి దారుణమైన అణచివేతను ఖండిస్తూ, తనను తాను అర్పించుకోవడంతో పాటు కరుణతో కూడిన బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఇతరులకు హాని చేయకుండానే, అణచివేతను ధిక్కరించారు.

థిచ్‌ కాంగ్‌ డక్‌ ఆత్మార్పణ చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. ఉన్నత ఆశయం కోసం అసాధారణ త్యాగానికి సిద్ధపడిన గొప్ప వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. మంటల్లోనూ ఆయన భంగిమలో ఉన్న ప్రశాంతత, క్షమాశక్తిని, శాంతి సందేశాన్ని మరింత బలంగా ప్రపంచానికి తెలియజేసింది.

1994లో రువాండాను వణికించిన మారణహోమం, కేవలం కొన్ని నెలల్లో 8 లక్షల మందిని బలిగొంది. జాతి విద్వేషంతో దేశం ముక్కలయ్యింది. కాని, ఈ భయంకర విషాదం మధ్య, క్షమాగుణం ఆశారేఖలా వెలిగింది. గాయాలను మాన్పి, సయోధ్యను సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ద్వేషాన్ని వీడి, అవగాహనతో ముందుకు సాగడం రువాండా కోలుకోవడానికి పునాదిగా నిలిచింది. ఊహించని నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ, బాధితులు, నేరస్థులు ప్రతీకారానికి బదులుగా క్షమించుకున్నారు. ఈ చర్య అక్కడి హింసాకాండకు శాంతియుతమైన ముగింపు పలికింది. ఇందుకు ‘ఇమ్మాకులీ ఇలిబగిజా’ కథ ఓ ఉదాహరణ. 91 రోజులు బాత్రూమ్‌లో దాక్కుని ప్రాణాలతో బయటపడిన ఆమె, తన కుటుంబ హంతకులను క్షమించింది. ఆమెతో పాటు ఎందరో, గతాన్ని మార్చలేకపోయినా, క్షమాపణతో భవిష్యత్తును సరిదిద్దవచ్చని నిరూపించారు.

2015లో చార్లెస్ట¯Œ లోని ఒక చారిత్రక చర్చిలో జరిగిన ఘోరం ప్రపంచాన్ని కదిలించింది. డిలాన్‌ రూఫ్‌ అనే శ్వేతజాతి దురహంకారి జరిపిన కాల్పుల్లో తొమ్మిదిమంది ఆఫ్రికన్‌–అమెరికన్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం మొదట తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే, ఆ తర్వాత కనిపించిన స్థైర్యం, కరుణ ద్వేషపు చీకటిని సవాలు చేశాయి. దుండగుడి కోర్టు విచారణ సమయంలో బాధితుల కుటుంబాలు నిందితుడిని బేషరతుగా క్షమించాయి. ఇలా ఒకటా రెండా ఎన్నో కథలు, మరెన్నో వ్య«థలు. గాయం నుంచి క్షమాపణ వరకు ఎందరో సాగించిన ప్రయాణం క్షమాశక్తిని కళ్లకు కడుతుంది. 

మొన్నటికి మొన్న పహల్గామ్‌ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన నేవీ అధికారి లెఫ్టినెంట్‌ వినయ్‌ నార్వాల్‌ భార్య హిమాంశీ నార్వాల్‌ వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె తన భర్తను కోల్పోయిన తీవ్ర దుఃఖంలో కూడా ‘ముస్లింలు, కాశ్మీరీల పట్ల ద్వేషాన్ని పెంచుకోవద్దు, శాంతిని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ఆమె స్పందనపై ఎన్నో భిన్న వాదనలు వినిపించినప్పటికీ శాంతి, కరుణ, విజ్ఞత కలిగిన మనుషుల స్పందన అలానే ఉంటుందేమో అనిపిస్తుంది.

ఏ మతం ఏం చెబుతోంది?
బంధాలను నిలిపేటప్పుడు, మంచివాళ్లకు నచ్చజెప్పేటప్పుడు ‘క్షమయా ధరిత్రి’ అని ఉదహరిస్తారు పెద్దలు. నిజానికి అన్ని మతాలు, ఆధ్యాత్మిక మార్గాలలో క్షమాగుణమే కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. ప్రతి మతమూ క్షమాపణకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. క్షమాపణ– ఈ ఒక్క పదం వెనుక అపారమైన మానసిక శక్తి, ఆధ్యాత్మిక ముక్తి దాగి ఉన్నాయి. ఇది కేవలం ఇతరులను క్షమించడం మాత్రమే కాదు, మనసును శుభ్రపరచుకోవడానికి, అంతర్గత శాంతిని పొందడానికీ ఒక ఉన్నతమైన మార్గం. ప్రతి మతమూ ఈ క్షమాగుణాన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం.

హిందూ మతం
హిందూ ధర్మంలో క్షమాగుణాన్ని గొప్ప సుగుణంగా పరిగణిస్తారు.
వేదాలు, ఉపనిషత్తులు:  ఇవి క్షమను కేవలం ఒక నైతిక నియమంగా కాకుండా, అహింస, సత్యం, అస్తేయం (దొంగిలించకపోవడం) వంటి మహత్తర ధర్మ సూత్రాలతో కలిపి ప్రస్తావిస్తాయి. అంటే ఇది ఒక జీవన విధానం అని చెబుతున్నాయి.
భగవద్గీత: క్షమించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, కర్మ బంధాలు తెగిపోతాయని భగవద్గీత చెబుతుంది. భగవద్గీతలోని 13వ అధ్యాయం, 7వ శ్లోకంలో ‘అమానిత్వం, అదంభత్వం, అహింస, క్షాంతిః’ (వినయం, నిగర్వం, అహింస, క్షమ) అంటూ శ్రీకృష్ణుడు జ్ఞానానికి అవసరమైన లక్షణాలను వివరిస్తాడు. ఈ లక్షణాలు మానవుడు ఆత్మజ్ఞానాన్ని, మోక్షాన్ని పొందడానికి అవసరం అని బోధిస్తాడు. ఇతరులు చేసిన తప్పులను, వారివల్ల వచ్చిన కష్టాలను, అన్యాయాలను సహించి, వారి పట్ల ద్వేషం లేకుండా ఉండటమే క్షమ. ఇది కేవలం బాహ్యంగా సహించడం కాదు, అంతర్గతంగా కూడా క్షమ విలువ తెలుసుకుని; ప్రశాంతంగా, స్థిరంగా ఉండటాన్ని సూచిస్తుంది.

పురాణాలు, ఇతిహాసాలు: రామాయణంలో శ్రీరాముడు చూపిన క్షమ, మహాభారతంలో యుధిష్ఠిరుడి ఓర్పు క్షమాగుణానికి గొప్ప ఉదాహరణలు. భూదేవికి ‘క్షమాదేవి’ అని పేరు. భూమి అన్నింటినీ భరిస్తున్నట్లుగా, మనం కూడా ఇతరుల తప్పులను సహించాలని దీని అర్థం.

 క్రైస్తవ మతం
క్రైస్తవ మతంలో  క్షమాపణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇది ఏసుక్రీస్తు బోధనలలోని ప్రధానాంశం.
బైబిల్‌: ఏసుక్రీస్తు తన అనుచరులకు ‘ఏడు మార్లు డెబ్భై మార్లు’ క్షమించమని బోధించాడు ఇది ఏదో లెక్క ప్రకారం కాదు, అపరిమితంగా, నిరంతరం క్షమించాలనే అర్థంలో వివరించారు.
ప్రభువు ప్రార్థన: క్రైస్తవుల ప్రసిద్ధ ప్రార్థనలో ‘మేము మమ్మును అపరాధపడిన వారిని క్షమించిన ప్రకారము మమ్మును క్షమించు’ అనేది ప్రతి క్రైస్తవుడి ప్రార్థన. ‘మనం దేవుని నుంచి కరుణను, క్షమాపణను ఆశించినట్లయితే, మనం కూడా అదే కరుణను ఇతరుల పట్ల చూపాలి’ అనేది క్రైస్తవ విశ్వాసంలో ప్రేమ, దయ, సహనానికి పునాది.
ఏసు సిలువే ఓ బోధన : తనను సిలువ వేస్తున్న వారిని చూసి ‘తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు; వీరిని క్షమించుము’ అని ప్రార్థించాడు జీసస్‌. అందుకే క్షమాగుణానికి, నిస్వార్థ ప్రేమకు మించిన ఉదాహరణ మరొకటి లేదంటారు క్రైస్తవులు.

ఇస్లాం మతం
ఇస్లాంలో క్షమాపణ అనేది అల్లాహ్‌ చెప్పిన ప్రధాన గుణాలలో ఒకటి. ముస్లింలంతా ఆ గుణాన్ని అలవరచుకోవాలని చెబుతుంది.
ఖురాన్‌:  ఖురా లో అల్లాను ‘అల్‌–గఫూర్‌‘ (సంపూర్ణంగా క్షమించేవాడు), ‘అల్‌–అఫువ్‌‘ (అత్యంత ఉపశమనం కలిగించేవాడు) అని వర్ణిస్తారు. ‘ఎవరైతే కోపాన్ని అణచుకుంటారో, ప్రజలను క్షమిస్తారో, అలాంటి సత్పురుషులను అల్లాహ్‌ ప్రేమిస్తాడు’ అని ఖురా¯Œ లో ఉంది.

హదీసులు: ‘క్షమించిన వ్యక్తికి అల్లాహ్‌ గౌరవాన్ని పెంచుతాడు’ అని ముహమ్మద్‌ ప్రవక్త తన బోధనల్లో పదే పదే నొక్కి చెప్పారు. క్షమాగుణం వల్ల అల్లాహ్‌ అనుగ్రహాన్ని పొందడమే కాకుండా, మనసులో శాంతి, ప్రవక్త పట్ల ప్రేమ, గౌరవాన్ని పెంపొందించుకోవచ్చని ముస్లింలు నమ్ముతారు.

రంజాన్‌ మాసం: క్షమాపణ కోరడానికి, ఇవ్వడానికి రంజాన్‌ మాసం ఒక ప్రత్యేకమైన, పుణ్యమైన సమయంగా పరిగణిస్తారు.

జైన మతం
ఆత్మశుద్ధికి  క్షమాపణే కీలకం అని చెబుతుంది జైన మతం.

అహింస: జైన మతం అహింసకు అత్యధిక ప్రాధాన్యమిస్తుంది. ఇది కేవలం ఇతరులకు శారీరకంగా హాని చేయకపోవడం మాత్రమే కాదు, వారి పట్ల చెడు ఆలోచనలు, భావనలు కలిగి ఉండకపోవడం కూడా ముఖ్యమే అంటుంది.

పర్యూషణ పర్వం: జైనులకు పర్యూషణ పర్వం అనేది క్షమాపణ కోరడానికి, ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎనిమిది రోజుల పండుగ. చివరి రోజును క్షమాపణ దినంగా జరుపుకుంటారు, ఒకరినొకరు క్షమించుకుంటారు.
కర్మ సిద్ధాంతం: క్షమించకపోవడంతో కర్మ బంధాలు పెరుగుతాయని, క్షమాపణ కర్మ నిర్మూలనకు సహాయపడుతుందని జైనం బోధిస్తుంది. అదే మోక్షానికి మార్గమంటోంది.

బౌద్ధమతం
బౌద్ధమతంలో క్షమాపణ అనేది కరుణ, స్నేహపూర్వక ప్రేమ, సహనం వంటి భావనలతో లోతుగా ముడిపడి ఉంది.
బుద్ధుని బోధనలు: బుద్ధుడు తన ధమ్మపదంలో ‘ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము, ప్రేమతోనే జయించగలం’ అని బోధించాడు. ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, వారి మంచి కోరడం అనేది క్షమకు ఆధారమని బౌద్ధమతం చెబుతోంది. ఇతరుల పట్ల ప్రేమను పెంపొందించుకుంటే క్షమ సహజంగా వస్తుందని బౌద్ధులు నమ్ముతారు.

త్రిపీఠకాలు: బౌద్ధ గ్రంథాలు క్షమను కేవలం ఒక నైతిక విధిగా కాకుండా, ఆంతరంగిక శాంతికి, ఆధ్యాత్మిక విముక్తికి అవసరమైన ఒక శక్తిమంతమైన సాధనగా వివరిస్తాయి. క్షమించడం అనేది ద్వేషాన్ని అంతం చేసే ఏకైక మార్గమని, దుఃఖం నుంచి స్వేచ్ఛను పొందే మార్గమని నొక్కి చెబుతాయి.

ప్రపంచంలోని ప్రధాన మతాలన్నీ క్షమాగుణాన్ని ఆధ్యాత్మిక ఉన్నతికి, అంతర్గత శాంతికి, సామాజిక సామరస్యానికి అత్యవసరం అని బలంగా నొక్కి చెబుతాయి. క్షమాపణ అనేది మనసులోని ద్వేషం, కోపం వంటి ప్రతికూల భావాలను తొలగించి, వాటి స్థానంలో ప్రేమ, కరుణ, ప్రశాంతతలను నింపుతుంది. ఇది కేవలం ఇతరులకు చేసే మేలు మాత్రమే కాదు. అన్నింటికంటే ముఖ్యంగా, మనసుకు, ఆత్మకు మనం చేసుకునే అత్యున్నతమైన మేలు!

ఏది ఏమైనా, విధి ఆడే వింతనాటకంలో కాలం చేసే గాయాలను కర్మసిద్ధాంతానికి, మనుషులు చేసిన గాయాలను ప్రతీకారేచ్ఛకు ముడిపెట్టుకోవడం మనిషికి అలవాటే! ఆ గాయం చిన్నదైనా, పెద్దదైనా మనసు లోతుల్లోంచి శాంతియుతమైన విశ్లేషణ చాలా అవసరం! అందుకే పిల్లలకు అన్నింటికంటే ముఖ్యంగా క్షమాగుణం గురించి, ఆత్మశుద్ధి గురించి బోధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే, తరం మారాలన్నా, గాయం మానాలన్నా, ప్రపంచం ప్రశాంతంగా ఉండాలన్నా, రేపటి తరంలో ద్వేషానికి బదులు ప్రేమ వికసించాలి! క్షమ అనే బీజం పడాలి!

చివరిగా ఒక్క మాట, ఎవరి మీదైనా కోపం, ద్వేషం లాంటివి ఏర్పడినప్పుడు.. ‘తను నన్ను బాధపెట్టి ఇన్ని ఏళ్లు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు అయ్యింది’– అనే లెక్కలు తగ్గించుకుంటే మన ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement