పుణ్యకార్యం... పాపకార్యం | Virtue and Vice explanation of vyasabagavan | Sakshi
Sakshi News home page

పుణ్యకార్యం... పాపకార్యం

May 26 2025 5:49 AM | Updated on May 26 2025 5:49 AM

Virtue and Vice explanation of vyasabagavan

మంచిమాట

అర్థం తెలిసినా తెలియకపోయినా ఈమాటలని మాత్రం అందరూ తరచు వాడుతూనే ఉంటారు. ‘‘నీకు పుణ్యం ఉంటుంది బాబూ ఈ పని చేసి పెట్టు.’’ ‘‘పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు’’, ‘‘ఏ పూర్వ పుణ్యమో’’ ‘‘పాపం పుణ్యం దేవుడికే ఎరుక’’ ‘‘పాపం పండింది’’. ‘‘ఎవడి పాపాన వాడే పోతాడు.’’ ఇటువంటి సామెతలు, నానుడులు అందరి నోళ్లలోనూ నానుతూ ఉంటాయి. పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి? అన్నది ఎంతమందికి తెలుసు? ఏదో వ్రతం చేస్తే, పూజ చేస్తే, పుణ్యం వస్తుందిట! వ్రతం అవగానే ఇతరులని బాధ పెట్టినా కూడా పుణ్యం వస్తుందా? ఆలోచించాలి. పాప పుణ్యాలకు వ్యాసభగవానుడు చక్కని  నిర్వచనం ఇచ్చాడు.

‘‘అష్టాదశ పురాణసారం శ్లోకార్థేన ప్రవక్ష్యామి
పరోపకారాయ పుణ్యం, పాపాయ పరపీడనం’’      

ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం, అపకారం చేస్తే పాపం. పైగా ఇది పదునెనిమిది పురాణాల సారం అని కూడా చె΄్పాడు. ఏవేవో మహత్కార్యాలు చేయనవసరం లేదు. శక్తిమేరకు ఎవరికైనా సహాయం చేయటం,  వీలైనంత వరకు ఎవరినీ బాధ పెట్టకుండా ఉండటం చేస్తే చాలు. మొదటి దానివల్ల పుణ్యం వస్తుంది. రెండవ దాని వల్ల పాపం రాకుండా ఉంటుంది. ఇవి ఎంత తేలిక అంటే చేయాలి అనిపించదు. 

మనిషికి పుణ్యం కావాలి. కాని, పుణ్యకార్యాలు చేయడు. ‘‘సత్కర్మంబు లెవ్వియు చేయ జాలరు కలియుగంబున మానవుల్‌’’ అంటాడు వ్యాసభగవానుడు భాగవతంప్రారంభంలో. పాపం వద్దు అనుకుంటాడు. కాని చెడ్డ పనులు మానలేడు. ఈ ఒక్కసారికే అని తనకి తాను సద్ది చెప్పుకుంటాడు. దీనికి దుర్యోధనుడు ఉదాహరణ.

 ‘‘నాకు ధర్మం తెలుసు. కాని, నా మనసు దానిమీదకి పోదు. నాకు అధర్మమూ తెలుసు. కాని, నా మనసు దాని నుండి మళ్లించలేను.’’ అంటాడు. ఈ లక్షణం అందరిలోనూ ఇంతో అంతో ఉంటుంది. కాని, ఆ సంగతి పైకి ధైర్యంగా చెప్పలేరు. కొంతమంది ఈ గుణం తమలో ఉన్నట్టు గుర్తించరు కూడా. తాము చేసేది ధర్మమే అని నమ్మేవారు కొంతమంది. మరికొంతమంది  ధర్మం కాదని తెలిసినా సమర్థించుకుంటూ ఆత్మవంచన చేసుకునే వారు కూడా ఉన్నారు.  
  
వైద్యుడు దుష్టాంగాన్ని కత్తితో కోస్తాడు. అది పాపకార్యం అవుతుందా? యుద్ధంలో సైనికుడు శత్రువుని సంహరిస్తే, అది పుణ్యకార్యమే కాని, పాపం కాదు. చేసే పని ఉద్దేశం, దానివల్ల కలిగే ప్రయోజనం పాపమా? పుణ్యమా? అన్న దానిని నిర్ధారిస్తుంది. ఏ పనీ దాని అంతట అది మంచిది కాని, చెడ్డది కాని కాదు. ఫలితం మేలు కలిగిస్తుందా? హాని కలిగిస్తుందా అన్న దాని మీద ఆధార పడి ఉంటుంది. నవ్వి, పాటలు పాడి, బాధించే వారు లేరా? అది పాపమే కదా! భావనకేప్రాధాన్యం.     

కొన్నిసార్లు కఠినంగా మాట్లాడటం, ప్రవర్తించటం అవసరమే. దాని వల్ల పాపం చుట్టుకోదు. తమ్ముడు భ్రష్టుడై ఇల్లు గుల్ల చేసి వెళ్ళిపోయాడని తెలిసి పుట్టింటికి వచ్చిన నిగమశర్మ అక్క తల్లితండ్రులను ‘‘తీండ్ర గల వచన రచనా చమత్కారంబుల కొంత కొంత వంతకుం తొలంగించుచు ..’’ అంటాడు తెనాలి రామకృష్ణుడు. ఓదార్పు దుఃఖాన్ని, ఆత్మన్యూనతాభావాన్ని పెంచే అవకాశం ఉంది. తిక్కగా ఏడుస్తున్న పిల్లవాడిని తిక్క నుండి బయటకు తీసుకు రావటానికి చిన్న దెబ్బ వేయటం క్రూరకృత్యం అనలేము కదా! అప్పుడు స్పృహలోకి వచ్చి మామూలు ఏడుపు ఏడుస్తాడు. 

  – డా.ఎన్‌. అనంతలక్ష్మి

Advertisement
 
Advertisement
Advertisement