
‘వాతాపి గణపతిం భజే...’ అన్న కర్ణాటక సంగీత కీర్తనను విని ఉండనివారూ, ఎరగని వారూ ఆస్తిక సమాజంలో అరుదు. వాతాపి ఒక ఊరు. దీన్నే ‘బాదామి’ అని కూడా అంటారు. ప్రస్తుతం ఇది కర్ణాటక రాష్ట్రంలో ఒక చిన్న తాలూకా కేంద్రం. కానీ ఒకప్పుడు ఈ బాదామి, పశ్చిమ చాళుక్య రాజుల రాజధానిగా, కళలకు కాణాచిగా ఉండేది. క్రీ.శ. 642లో జరిగిన ‘బాదామి యుద్ధం’లో పల్లవ రాజులు, బాదామి చాళుక్యుల మీద విజయం సాధించారు. పరంజ్యోతి అనే పల్లవ సేనాధిపతి, తమ ఘన విజయానికి జ్ఞాపికగా కాబోలు, వాతాపి నుండి ఒక గణపతి విగ్రహాన్ని తమిళనాటకు తీసుకెళ్ళి, తన స్వస్థలమైన తిరుచెంగట్టన్ గూడిలో ఉన్న శివాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠ చేయించాడు. అది ఈనాటికీ ‘వాతాపి గణపతి’గా పూజలందుకొంటున్నది. వాతాపి రాక్షసుడిని వధించిన తరవాత అగస్త్య మహర్షి పూజించిన గణపతి, వాతాపి గణపతిగా ప్రసిద్ధుడయ్యాడని ఒక ఐతిహ్యం.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల (1775–1835) స్వగ్రామం తిరువారూరు. అది తిరుచెంగట్టన్ గూడి గ్రామానికి చాలా దగ్గర. వినాయకుడి మీద మొత్తం పదహారు కీర్తనలను రచించిన దీక్షితుల వారు, వాతాపి గణపతిని స్తుతిస్తూ చెప్పిన హంసధ్వని రాగకృతి, గణపతి తత్త్వాన్ని సమగ్రంగా ఆవిష్కరించే మణిపూస. ఇది వాతాపి గణపతికీ, దీక్షితుల వారికీ, హంసధ్వని రాగానికీ అఖండమైన ప్రఖ్యాతిని ఆర్జించిపెట్టింది. ఇన్నేళ్ళలో, ఇంతమంది ఇన్నిసార్లు పాడి, వినిపించిన కృతి, కర్ణాటక సంగీత ‘కచేరీ’ల చరిత్రలో మరొకటి లేదు.
ఇదీ చదవండి: Vinayaka Chavithi: వినాయక చవితి పూజ ప్రాముఖ్యత,అష్టోత్తర శతనామావళి
వారణాస్యుడైన గణపతిని వరప్రదాతగా, భూతాది సంసేవితుడిగా, భూత భౌతిక ప్రపంచ భర్తగా, వీతరాగుడిగా, విశ్వకారణుడిగా, విఘ్నవారణుడిగా ఈ కృతి నుతి చేస్తుంది. శ్రీ చక్ర త్రికోణ గతుడిగా, మూలాధార క్షేత్ర స్థితుడిగా, ఓంకార రూపమైన వక్రతుండ ధారిగా అభివర్ణిస్తుంది. వీనుల విందుగా వినాయకుడిని కొనియాడే ఈ కీర్తనను వినటానికీ, పాడుకోవటానికీ, మననం చేసుకోవటానికీ వినాయక చతుర్థి అనువైన సుదినం!
ఇదీ చదవండి: గణపతి బప్పా 'మోరియా' వెనుక కథలేంటో తెలుసా?
– ఎం. మారుతి శాస్త్రి