
దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలకు సన్నద్ధమవుతోంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు ఊరంతా సంబరమే. తొమ్మిరోజుల పాటు గణేష్‌మంటపాల్లో ఊరా, వాడా ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు మారు మోగుతాయి. భజనలు కీర్తనల, భక్తిగీతాలతోగణనాయకుడ్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. విజయాలనీయవయ్యా విఘ్నరాజా అని వేడుకొంటారు.అయితే గణపతి బప్పా మోరియా అనే నినాదం ఎలా వచ్చిందో తెలుసా.
అయితే ఈ నినాదంలో మోరియా అనే పదం నినాదంలా ఎలా మారింది. అసలు దీనికి అర్ధం ఏంటి.. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్పా మోరియా.. మంగల్ మూర్తి మోరియా అనే నినాదాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారంటే..
15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడట. మహారాష్ట్రాలోని పుణెకు 21 కిలోమీటర్ల దూరంలో చించ్ వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన వినాయకుడికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్ వాడ్ నుంచి మోర్ గావ్ కు రోజూ కాలినడకన వెళ్లేవాడు.
మోరియా గోసావి 117 సంవత్సరాల వయస్సు వరకు క్రమం తప్పకుండా మయూరేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం కొనసాగించాడు. అయితే వయోభారం కారణంగా ఆయన ఆలయానికి వెళ్లలేకపోకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారట.
అయితే మోరియా నిద్రపోతున్న సమయంలో స్వయంగా ఈ విఘ్న నాయకుడు కలలో కనిపించి.. అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని..దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. అలా మోరియా నదికి వెళ్లగా. అక్కడొక వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయంలో గ్రామంలో అందరికీ తెలిసింది. దీంతో సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపించిన మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అంటే.. గోసావి మంగళమూర్తి అంటూ మొక్కారట. అలా ’గణపతి బప్పా మోరియా’ అనే నినాదం కొనసాగుతోందని చెబుతారు. తనివితీరా గణపతి బప్పా మోరియా అని మొక్కితే సర్వ విఘ్నాలు తొలగి విజయం చేకూరుతుందని భక్తుల విశ్వాసం.
పురాణ గాథ
మహారాష్ట్రలోని ఇప్పటి మోర్గాం ప్రాంతంలో జరిగిన కథ ఇది. పుణెకు 79 కిలోమీటర్ల దూరంలో బారమతీ తాలూకాలో ఉంది. పూర్వం ఇక్కడి గండిక రాజ్యాన్ని చక్రపాణి అనే రాక్షసరాజు పాలించేవాడు. అతని భార్య ఉగ్ర. పిల్లలు లేనందువల్ల శౌనక మహాముని సూచనమేరకు సూర్యోపాసన చేయగా సూర్యుడి అనుగ్రహం వల్ల రాణి గర్భవతి అయ్యింది. సూర్యుడిని మించిన వేడి పిల్లవాడు జన్మించడంతో అతడిని సముద్రంలో పడేస్తారు. సముద్రంలో దొరికిన కారణంగా అతడు సముద్ర లేదా సింధురాసురుడగా ప్రసిద్ధికెక్కాడు. సింధు పెద్దవాడై సూర్యోపాసకుడిగా సుదీర్ఘకాలం చేసిన తపస్సు ఫలితంగా సూర్యుడు అతనికి అమృతం ప్రసాదించాడనీ, దీంతో సింధుకు మృత్యుభయం ఉండదని చెబుతారు. ఈ ధైర్యంతో సింధు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడట. ఈ అహంకారంతో దేవతలపైనా, కైలాసం, వైకుంఠంపైనా దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం వద్ద తలదాచుకున్నారు. మహా విష్ణువును కూడా గండికా రాజ్యంలోనే ఉండాలని సింధురాసురుడు ప్రకటించాడు. దేవ గురువైన బృహస్పతి ఈ పరిస్థితిని పరిశీలించి వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని సలహా ఇచ్చాడు. వారి శరణు విన్న వినాయకుడు సాక్షాత్కారమై.. తాను పార్వతీ దేవికి కుమారుడిగా జన్మించి సింధురాసురుడిని అంతమొందిస్తానని వారితో చెప్పాడట. పన్నెండేండ్లు మేరు పర్వతంపై గణేశుడి మంత్రం జపించారట. అలా భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణపతి పార్వతికి కొడుకుగాపుట్టాడట. ఒకసారి సింధురాసురుడి మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్తాడు.
అప్పుడు గణపతి నెమలి వాహనధారియై కమలాసురునితో యుద్ధం చేశాడట. సింధురాసురునిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు సింధురాసురుడి ఉదరంలోని అమృతం బయటకొచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో గణపతిని పూజిస్తారు. అప్పటి నుంచి మోర్గాం గణపతి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది. ‘మోర్’ అంటే నెమలి. యుద్ధానికి నెమలి వాహనమేసుకొని వచ్చి సింధురాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్గాం అని.. అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో ‘గణపతి బప్పా మోరియా’ అని భక్తులు కొలుస్తుంటారు. అలా క్రమంగా ‘గణపతి బప్పా మోరియా’గా ప్రసిద్ధికెక్కింది. ఈ కథను చెప్పేవారికి, విన్నవారికి సమస్త కోరికలు ఫలిస్తాయనిధన సంపత్తి, యశస్సు ప్రాప్తిస్తుందని పండితుల ఉవాచ.
నోట్ : అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రం. ఇది భక్తుల విశ్వాసాలు, నమ్మకాలు మీద ఆధారపడి ఉంటాయనేది గమనించాలి.