మంచి మాట
ఆధ్యాత్మిక పథంలో పయనించే ప్రతి సాధకుడికి ‘వైరాగ్యం’ అనేది ఒక బలమైన పునాది. సాధారణంగా లోకంలో వైరాగ్యం అంటే అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవడం అని పొరబడుతుంటారు. కానీ, నిజమైన వైరాగ్యం అంటే వస్తువులను వదలడం కాదు, వస్తువుల పట్ల ఉన్న ‘మమకారాన్ని’ లేదా ‘ఆసక్తిని’ వదలడం. ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటాడు, కానీ పెద్దయ్యాక వాటిని వదిలేస్తాడు. అది బొమ్మల మీద కోపంతో కాదు, వాటికంటే విలువైనది ఏదో తెలిసిందనే అవగాహనతో. ఆధ్యాత్మిక వైరాగ్యం కూడా అటువంటిదే.
వైరాగ్యం అంటే ‘రాగ రహిత స్థితి’. మనసు దేనినైనా చూసి ఆకర్షింపబడితే దానిని ‘రాగం’ అంటారు. ఆ ఆకర్షణ వల్ల కలిగే బంధం నుండి మనసును విముక్తం చేయడమే వైరాగ్యం. ఇది విరక్తి కాదు, ఒక రకమైన పరిణతి. ఇంద్రియ విషయాల నుండి మనసును మళ్ళించడానికి చేసే ప్రాథమిక ప్రయత్నం (యతమాన సంజ్ఞ ), కొన్ని విషయాల మీద నియంత్రణ సాధించి, కొన్నింటిపై ఇంకా పట్టు కోల్పోని స్థితి (వ్యతిరేక సంజ్ఞ), బాహ్యంగా కోరికలు లేకపోయినా, మనసులో మాత్రం సూక్ష్మంగా ఆ కోరికలు మిగిలి ఉండటం(ఏకేంద్రియ సంజ్ఞ). ఇక నాలుగోది ‘వశీకార సంజ్ఞ’ అత్యున్నత స్థితి. ఇక్కడ మనసు పూర్తి నియంత్రణలో ఉంటుంది. ఏ బాహ్య వస్తువూ మనసును చలింపజేయదు.
సంస్కృతంలో ‘రాగ’ అంటే రంగు లేదా ఆకర్షణ అని అర్థం. ‘వైరాగ్య’ అంటే ఆ ఆకర్షణ లేని స్థితి. నీటిలో ఉన్నా కూడా తామర ఆకుకు నీరు అంటనట్లుగా, సంసారంలో ఉంటూనే దేనికీ అతిగా బందీ కాకుండా ఉండటమే వైరాగ్యం. సాధారణంగా వైరాగ్యాన్ని రెండు స్థాయులలో చూడవచ్చు. ప్రాపంచిక విషయాల వల్ల కలిగే దుఃఖాన్ని చూసి లేదా భయం వల్ల కలిగే తాత్కాలిక వైరాగ్యం (ఉదాహరణ – శ్మశాన వైరాగ్యం). ఇది ఎక్కువ కాలం నిలవదు. పర వైరాగ్యం అత్యున్నతమైనది. ఆత్మజ్ఞానం వల్ల, సత్యాన్ని గ్రహించడం వల్ల కలిగే స్థిరమైన స్థితి. ప్రపంచంలోని ఏ వస్తువూ శాశ్వతం కాదని గ్రహించినప్పుడు ఇది కలుగుతుంది.
వైరాగ్యం సిద్ధించాలంటే రెండు ముఖ్యమైన పద్ధతులు అవసరమని భగవద్గీత చెబుతోంది. ‘అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే’. ఏది నిత్యం (శాశ్వతం), ఏది అనిత్యం (తాత్కాలికం) అని వేరు చేసి చూసే తెలివితేటలు. మనసుని పదే పదే ప్రాపంచిక కోరికల నుండి మళ్ళించి, అంతరాత్మ వైపు తిప్పుకోవడం. దేని మీద ఆశ లేనప్పుడు, అది దక్కలేదనే మానసిక ప్రశాంతత, కోల్పోతామనే భయం లేకపోవడం వైరాగ్యం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు.
వైరాగ్యం అనేది ఒక మందు వంటిది. అది సంసార వ్యాధిని నయం చేసి, మనిషిని తన నిజ స్వరూపమైన ఆనందం వైపు నడిపిస్తుంది. జీవితాన్ని త్యజించడం వైరాగ్యం కాదు, జీవితాన్ని సరైన దృక్పథంతో దర్శించడమే నిజమైన వైరాగ్యం. జీవితం పట్ల సరైన అవగాహన. ఒక పక్షి పండును తింటున్నప్పుడు ఆ రుచికి బానిస కావచ్చు. కానీ మరొక పక్షి అదే చెట్టు మీద ఉండి, పండును తినకుండా కేవలం చూస్తూ సాక్షిగా ఉంటుంది. ఈ ‘సాక్షి భూత’ స్థితిలో ఉండటమే వైరాగ్యానికి సంకేతం.
భగవద్గీత ప్రకారం వైరాగ్యం అంటే పనులను వదలడం కాదు, ఫలాపేక్షను వదలడం. వైరాగ్యం వల్ల మనిషికి నిర్భయత్వం కలుగుతుంది. ‘వైరాగ్యమేవ అభయం’ అని భర్తృహరి సుభాషితం చెబుతోంది. భోగంలో రోగ భయం ఉంటుంది, కులంలో పతనం ఉంటుందనే భయం ఉంటుంది, ధనంలో రాజుల భయం ఉంటుంది.. కానీ వైరాగ్యంలో మాత్రం ఎటువంటి భయం ఉండదు. ఇది మనిషికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది. వైరాగ్యం అంటే కేవలం బాహ్య ప్రపంచాన్ని లేదా బాధ్యతలను వదిలేసి అడవులకు వెళ్లడం కాదు. ఇది మనసుకి సంబంధించిన ఒక స్థితి. వస్తువుల మీద, వ్యక్తుల మీద లేదా ఫలితాల మీద ఉండే అతివ్యాప్తిని వదిలివేయడమే నిజమైన వైరాగ్యం.
– ఆనంద ‘మైత్రేయ’మ్


