
దత్త బోధ
‘మేరోరపి సారతరా భక్తిః.’ అంటే భక్తి మేరు పర్వతం కంటే కూడా మిక్కిలి శక్తి కలదీ, ఉన్నతమైనదీ అని అర్థం. సర్వము భగవద్విలసితంగా భావించి, ఆ భావనతో ఆత్మార్పణ చేసుకొనే పరిశుద్ధ స్థితి భక్తికి పరాకాష్ఠ. ఇదే నిజమైన భక్తి! గురుభక్తి కూడా ఇంతే! గురువునే దైవ భావంతో ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ జీవితాన్ని కైంకర్యం చేసుకోవటం నిర్దుష్టమైన భక్తికి సరిహద్దు.
భగవదనుభూతికి అనేక మార్గాలు న్నాయి. కానీ అందరికీ అందుబాటులో అనుసరణీయమైన మార్గం మాత్రం భక్తి మార్గమే. విభిన్న రుచులు గల మానవుల మనస్సుకు నచ్చిన విధంగా స్వీకరించదగిన విధానాలు భక్తిమార్గంలో ఉన్నాయి. అవే నవవిధ భక్తి మార్గాలు: ‘శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనం అర్చనంవందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్’ అని శ్రవణ కీర్తనాదులు చెప్పబడినాయి. ఆ యా భక్తుల రుచులను అనుసరించి ఈ నవవిధాలు అనుసరింపబడతాయి. భక్తి అనేది శ్రవణంతో ప్రారంభమై బలపడుతూ, చివరిదైన ఆత్మనివేదనంతో పరిపూర్ణం అవుతుంది. అత్మనివేదనం గల భక్తులకూ భగవంతునికీ భేదమే కనబడదు. ఈ విషయంలో గోపికల భక్తి ఉదాహరణగా తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్.. రూ.7500కే వీసా : ఎవరికి? ఎలా? ఎక్కడ?
‘ఓ అర్జునా! నా సేవ కోసమే గోపికలు తమ శరీరాన్ని రక్షించు కొంటున్నారు. అందువల్లనే నిగూఢమైన నా ప్రేమకు వారు పాత్రు లయ్యారు’ అని కృష్ణ పరమాత్మ అర్జునునితో అంటాడు. అలాగే దాన ధర్మాలు చేసినా... భక్తి భావంతో ప్రతిగ్రహీతను విష్ణువుగా భావించి దానమిస్తే దానికి విలువ ఉంటుంది. ఒక రోజు ఓ రాజసభలో ఉన్న సాధువుతో ‘నేను తల్చుకుంటే మిమ్మల్ని గొప్ప సంపన్నుణ్ణి చేయగలను’ అన్నాడు రాజు. సాధువు ఆ మాటకే మాత్రం పొంగిపోకుండా: ‘రాజా! దయవుంచి ఒక కాటా తెప్పించండి. అందులో ఒక వైపు నాకీయదలచిన సంపద ఉంచండి’ అని అన్నాడు. దానికి రాజు సరే అని వెంటనే ఆ యేర్పాటు చేశాడు. నగలు, నాణాలు, బంగారం, వజ్రాలు వంటి వెన్నో ఒక వైపు ఉంచాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతో ఒక చిన్న ఆకును తెచ్చి ఆ రెండవ తక్కెటలో వేశాడు. అంతే కాటాలో వేసిన రాజుగారి సంపదకంతా ఈ ఆకు సమానంగా తూగింది. కాస్త మొగ్గు కూడా ఉంది. రాజుకు గర్వ భంగం అయింది. నిజమైన భక్తునికి ప్రతి జీవిలోనూ అంతర్యామిగా భగవంతుడే కనబడతాడు. నిజమైన భక్తుల్లో చివరికి ఆత్మజ్ఞానం సుసంపన్నమైన వాళ్లు మోక్షా ర్హులవుతారు అని స్వామీజీ అనుక్షణం ప్రబోధిస్తుంటారు.
జయ గురు దత్త!
-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి