లక్ష్యసిద్ధికి త్రికరణశుద్ధి

Trikaranasuddhi for goal attainment - Sakshi

మనం ఏ కార్యాన్ని ఆచరించినా త్రికరణశుద్ధితో ఆచరించాలి. మనస్సుకు, మాటకు, చేతకు తేడా లేకుండా ఉండటమనే నిజాయితీనే త్రికరణశుద్ధిగా వ్యవహరించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మనోవాక్కాయాల శుద్ధి. ఏదయినా పనిని మనసా, వాచా, కర్మణా అన్నిటా ఏకీభావ స్థితిలో మలచుకోవడమే త్రికరణశుద్ధి. మనసులో ఏ విధంగా కార్యాన్ని చేయాలని మనం సంకల్పిస్తామో, వచస్సులో, అంటే మన మాటల్లోనూ అదే ప్రతిఫలించాలి. కర్మణా అంటే కార్యాన్ని ఆచరించే విధానమూ మనం తలచిన విధంలో, చెప్పిన సంవిధానంలో పూర్తి చేయాలి. అప్పుడే ఆ కార్యం త్రికరణశుద్ధి కలిగినదై, లోకాన రాణింపునకు వస్తుంది.

మనం ఎన్నో గొప్ప కార్యాలను మదిలో సంకల్పిస్తాం. తీరా, ఆ పనులను గురించి నలుగురిలో విడమరచి చెప్పాలంటే ఎందుకో బిడియం, ఎవరు ఏమనుకుంటారో..? అనే సందేహం. మనం సాధించగలమో లేదో అని అనుమానం. ఒకవేళ, మరీ సాహసం చేసి కొంతవరకు చెప్పగలిగినా, మళ్ళీ ఆచరించే సమయంలో మనకున్న సందేహాలతో ముందుకు సాగకుండా ఆగిపోతాం, దానికితోడు అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలు..!! ఈ విధంగా చేసే కార్యాలు నిరర్ధకమైన రీతిలోనే సాగుతాయి.

 మన మనసు అత్యంత పవిత్రమైనదనీ, సమస్త పుణ్యాలు అగణ్యమైన రీతిలో ఈ ధరిత్రిలో జరిగింది కేవలం మనసు వల్లనేనని పెద్దల ఉవాచ. అందుకని తలచిన పనులు సఫలం అవాలంటే, మనం భావించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలగాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పనిలోనైనా కార్యసిద్ధి అనేది ఒక్కరి వల్ల జరగదు.

అది సమిష్టిగా, నలుగురితో కలిసి కృషి చేయడం వల్ల జరుగుతుంది లేదా కొంతమంది వ్యక్తుల సమన్వయంతో జరుగుతుంది. అధికశాతం పనులు రకరకాల వ్యక్తుల సమన్వయంతోనే జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యాధికులు, కొంతమంది ఎక్కువగా చదువుకోనివారు కూడా భాగం కావచ్చు. వీరందరి మధ్యా జరిగే సమన్వయమే త్రికరణాలతో కూడుకుని తలపెట్టిన పనిలో కార్యసిద్ధిని కలిగిస్తుంది.

వ్యక్తిగతంగా తాము చేసే పనులు కూడా శుద్ధమైన మనసుతో ఆచరిస్తే, విజయాలు సాధించవచ్చు. మధ్యయుగం కాలంలోని ఒక చిన్న కథ ద్వారా ఆ సందేశాన్ని తెలుసుకుందాం.

ఒక గురువు గారు నదికి అవతలి ఒడ్డున తన శిష్యులతో నిలిచి ఉన్నారు. నదిలో వారిని దాటించే పడవవాడు వెళ్ళిపోయాడు. కానీ గట్టుకు రెండోవేపు ఒక శిష్యుడు నిలిచిపోయాడు. గురువుగారు, వేగంగా రమ్మని ఆ శిష్యుని ఆజ్ఞాపించారు. వెంటనే, ఆ శిష్యుడు నీటిమీద వేగంగా నడుచుకుని అవతలి గట్టుకు వెళ్ళిపోయాడు. గురువుగారు, శిష్యునికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘నాయనా.. ఏ విద్యతో అంత వేగంగా నీటిమీద నడుచుకుంటూ రాగలిగావు’’ అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించగా, శిష్యుడు’’ భలేవారే.. గురువుగారు... మీకు తెలియని విద్యలేవి ఉన్నాయి నా దగ్గర..!! మీరు తొందరగా రమ్మని ఆజ్ఞాపించారు.

నేను మదిలో నది ఒడ్డుకు రావాలన్న తలపును త్రికరణశుద్ధిగా ఆచరించాను. విజయవంతంగా మీ దగ్గరకు చేరుకున్నాను’’ అంటూ వినయంగా సెలవిచ్చాడు. ఇందులో శిష్యుడు చూపిన అగణితమైన ప్రతిభకన్నా, అతని అంకితభావం, నదిని విజయవంతంగా దాటే సమయాన మనసా, వాచా, కర్మణా ఒకే పద్ధతిలో ముందుకు సాగడం పెద్ద పెద్ద లక్ష్యాలను తలపోసే అందరికీ అనుసరణీయం.

త్రికరణశుద్ధిగా చరించే మనిషి తనను తాను మూర్తిమంతంగా నడుపుకుంటూ, విజయాలను అవలీలగా సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎన్నో శాస్త్రాలను, విజ్ఞానాన్ని శిష్యులకు క్షుణ్ణంగా బోధించిన ఓ గురువుగారి జీవనప్రస్థానపు అంతిమఘడియల్లో అమృతతుల్యమైన ఈ సత్యం విశదం అయింది. మహా విజ్ఞాననిధియై జీవితాన్ని గడిపిన గురువుగారికి అంత్యకాలం చేరువ అయ్యింది. ఆయన శిష్యులందరిలో ఎడతెగని విచారం. ఆయన ఆశ్రమ ప్రాంతమంతా విషాద వీచికలు కమ్ముకుంటున్నాయి.

ముఖ్యశిష్యునిగా వ్యవహరిస్తూ, ఆశ్రమ యోగక్షేమాలు చూసే అతనిలో మరీ విచారం..!! ఈ వాతావరణాన్ని పరికిస్తున్న గురువుగారికి జీవన విషమస్థితిలోనూ ఏ మాత్రం మింగుడుపడడం లేదు. గురువు తన ముఖ్యశిష్యుణ్ణి దగ్గరకు పిలిచి ‘‘ఎందుకు మీరంతా అంతగా బాధపడిపోతున్నారు’’ అని ప్రశ్నించగా, అతను గద్గద స్వరంతో ‘‘గురువుగారూ.. మీరు మా నుంచి వెళ్ళిపోతున్నారు. మీవల్ల ఈ ఆశ్రమానికి వచ్చిన గొప్ప గుర్తింపు, ఎనలేని కాంతి మీ తదనంతరం మాయమవుతుంది. మాలో ఈ కారణం చేతనే రోజురోజుకూ అశాంతి పెరుగుతోంది’’ అన్నాడు.

దానికి గురువు నవ్వుతూ ‘‘పిచ్చివాడా.. ఎంత అవివేకంతో మాట్లాడుతున్నావు నాయనా..!! నువ్వు చెప్పిన విధంగా జరిగితే, నేను ఇన్ని రోజులూ మీ అందరికీ చేసిన విద్యాబోధన అంతా వృథానే సుమా.. నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే.. నేను నేర్పించిన విషయాలను అన్నిటా ఆచరణలో పెడుతూ, మిమ్మల్ని మీరే దివ్యమైన జ్యోతుల్లా వెలిగించుకోండి. అది కేవలం మీరు త్రికరణశుద్ధితో చేసే పనులవల్లనే సదా సాధ్యమవుతుంది’’ అన్నాడు. శిష్యునికి జ్ఞానోదయ మయింది. మిగిలిన వారికీ ఇదే సందేశాన్ని అందించి, గురువు బోధలను మనసా వాచా కర్మణా ఆచరించి విజేతగా నిలిచాడు.

త్రికరణశుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరందభరితమైన జీవనం అమితంగా లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరి గా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడం ప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి.

‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును.. లోకము మెచ్చును’’ అన్న సంకీర్తనాచార్యుని వాక్కులు అక్షరసత్యం. త్రికరణశుద్ధితోనే జీవనానికి నిజమైన సత్వం, పస కలిగిన పటుత్వం కలుగుతాయి.

బుద్ధిమంతుల ఆలోచనా సరళికి ఆధారమూలం జీవనగమనంలో వారు కలిగి ఉండే త్రికరణశుద్ధి..!!

ఈ లక్షణం కలిగినవారికి తప్పక ఒనగూడుతుంది అన్నిటా కార్యసిద్ధి..

త్రికరణ శుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరంద భరితమైన జీవనం లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరిగా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడంప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి.

– వ్యాఖ్యాన విశారద
వెంకట్‌ గరికపాటి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top