ఇళ్లు అందంగా ఉండాలంటే.. నాలుగు రాళ్లు ఉన్నా చాలు!

Trending: People Like Most Stone Decoration - Sakshi

ఇంట్లోకి ప్రకృతిని ఆహ్వానించాలంటే సహజత్వం ఉట్టిపడే అలంకరణ ఉండాలి. అందుకు రాతి కళ గొప్ప వేదిక అవుతుంది. పెద్ద రాతి నమూనాను గోడగా అమర్చినా, చిన్న చిన్న రాళ్లను ఫ్రేములుగా కట్టినా.. ఆ కళ వెంటనే చూపరులను ఆకట్టుకుంటుంది. 
సొంతింటి కల కోసం సంపాదనను సూచిస్తూ ‘నాలుగు రాళ్లు సంపాదించండి ’ అని హితులు సలహాలు ఇస్తుంటారు. అద్దెల్లు అయినా, సొంతిల్లు అయినా అలంకారంలో రాళ్లను రతనాలుగా మార్చేలా  నవతరం వినూత్న ఆలోచనలు చేస్తోంది.

గోడంత రాయి: లగ్జరీకి ప్రతిరూపం.. చూపు తిప్పుకోనివ్వని అందం వాల్‌ స్టోన్‌ది. పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాల్లో అతి పెద్ద రాయిని గోడకు బదులుగా నిర్మించడంలో వారి అభిరుచి తెలిసిపోతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన వాల్‌ డిజైన్లలో కొన్నేళ్లుగా వాల్‌స్టోన్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒకవేళ అంత పెద్ద స్టోన్‌ని అమర్చలేం అనుకున్నవారు కాంక్రీట్‌తో గోడ మొత్తం స్టోన్‌ లుక్‌తో మెరిపిస్తున్నారు. సహజత్వాన్ని ఇంటి అలంకరణలో భాగం చేయడానికి ఖరీదు అనేది పెద్ద పట్టింపుగా  ఉండటం లేదు. 
గోరంత దీపం: గొడుగులా ఉండే టేబుల్‌ ల్యాంప్‌.. ఇంటికెంత అవసరమో మనకు తెలిసిందే. ఈ టేబుల్‌ ల్యాంప్‌ సహజత్వంతో వెలుగులు రువ్వాలంటే రాళ్లతో ఇలా సృష్టించుకోవచ్చు. 
ఆకర్షణ రాళ్లు: రాళ్లపై అక్షరాలు గార్డెన్‌లోనే కాదు లివింగ్‌ రూమ్‌లోనూ ఆకర్షణగా నిలుస్తాయి. రోజులో మనకు కావల్సిన సందేశాన్ని మనమే సృష్టించుకోవచ్చు. కుటుంబ సభ్యుల పేర్లనూ రాసి అలంకరించుకోవచ్చు.  
టేబుల్‌ టాప్‌: నదీ తీరాలను సందర్శించే వారు కొందరు తమకు నచ్చిన రాళ్లను జ్ఞాపకంగా వెంట తెచ్చుకుంటారు. సెంట్రల్‌ టేబుల్‌ టాప్‌ను గ్లాస్‌ అమరికతో డిజైన్‌ చేయించుకోవాలనుకునేవారు ఇలా జ్ఞాపకాల రాళ్లను కూడా పొందిగ్గా వాడుకోవచ్చు. 
ప్లేట్‌ మ్యాట్స్‌: ఇప్పటి వరకు క్లాత్, జ్యూట్, ఫైబర్‌ వంటి ప్లేట్‌ మ్యాట్స్‌ను డైనింగ్‌ టేబుల్‌పైన అలంకరించి ఉంటారు. ఇప్పుడు ఈ స్టోన్‌ మ్యాట్స్‌ను ప్రయత్నించండి. మీ సృజనాత్మకతకు అతిథుల ప్రశంసలు  తప్పక అందుతాయి. 
ఫొటో ఫ్రేమ్స్, స్టోన్‌ పెయింటింగ్, వాల్‌ డెకార్‌ హ్యాంగింగ్స్, ఫ్లవర్‌ పాట్స్‌.. ఇలా చిన్న చిన్న రాళ్లతో అందమైన కళాకృతులను ఆకర్షణీయంగా ఎవరికి వారు రూపొందించు కోవచ్చు. ఇందుకు కావల్సినవి కొన్ని రాళ్లు, మరికొంత గమ్‌. ఇంకొన్ని రంగులు. ఆర్ట్‌ మీ చేతిలో ఉంటే చక్కటి రాళ్లు మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. 
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top