ఐడెంటిటీకి మరింత బ్యూటీ | Transgender woman Surya Kutty from Coimbatore Miss Koovagam | Sakshi
Sakshi News home page

ఐడెంటిటీకి మరింత బ్యూటీ

Apr 30 2026 12:30 AM | Updated on Apr 30 2026 12:30 AM

Transgender woman Surya Kutty from Coimbatore Miss Koovagam

‘ట్రాన్స్‌’మిషన్‌

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూవాగం ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన అందాల పోటీలో కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి విజేతగా నిలిచారు. తమిళనాడులోని విళ్లుపురంలో అట్టహాసంగా జరిగిన ఈ ట్రాన్స్‌ వేడుకలో ఆమె ‘మిస్‌ కూవాగం 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లను ఏకం చేసే ఈ సాంస్కృతిక వేదికపై సూర్యకుట్టి సాధించిన విజయం, ఆ కమ్యూనిటీ ఐడెంటిటీకి, ఆత్మవిశ్వాసానికి, కళాత్మక ప్రతిభకు అద్దం పడుతోంది.

ట్రాన్స్ జెండర్ల ఆరాధ్య దైవమైన కూతాండవర్‌ వెలసిన కూవాగం గ్రామంలో ప్రతి ఏటా కూవాగం ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహాభారతంలోని అరవాన్‌ (కూతాండవర్‌) బలి ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 14న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలను సౌత్‌ ఇండియన్‌ ట్రాన్స్  జెండర్‌ అసోసియేషన్, తమిళనాడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ, తమిళనాడు ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. అందులో భాగంగా కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి మిస్‌ కూవాగం 2026 టైటిల్‌ను గెలుచుకుని అందరినీ ఆనందంలో ముంచెత్తారు.

ప్రథమ స్థానంలో సూర్య
తమిళనాడు విళ్లుపురం మున్సిపాలిటీ మైదానంలో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 25 మంది పోటీదారులు మూడు దశల్లో తమ ఆత్మవిశ్వాసం, ప్రతిభను ప్రదర్శించారు. ర్యాంప్‌ వాక్‌లో, జడ్జిల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో సూర్య కనబరచిన చాకచక్యం ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టింది. రెండో స్థానాన్ని మలేసియాకు చెందిన నిషా నిలబెట్టుకుంటే, పుదుచ్చేరికి చెందిన అనన్య మూడోస్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మరో ఏడుగురు ట్రాన్స్ జెండర్లకు ‘యంగ్‌ అచీవర్స్‌’ పురస్కారాలను కూడా అందజేశారు. అంతకుముందు జరిగిన ‘మిస్‌ తిరునంగై 2026’ పోటీలో చెన్నైకి చెందిన ఓమన మొదటి బహుమతి గెలుచుకోగా, సాయి శ్రీ, సుఖి తర్వాతి స్థానాల్లో నిలిచారు.

దేశ విదేశాల నుంచి 
తమిళనాడులోని కూవాగం గ్రామంలో ఉన్న కూతాండవర్‌ దేవాలయంలో జరిగే ఈ ఉత్సవం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా, ట్రాన్స్ జెండర్ల సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే కాకుండా సింగపూర్, హాంగ్‌ కాంగ్‌ వంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ట్రాన్స్‌జెండర్లు ఇక్కడికి చేరుకుని తమ ఆరాధ్య దైవాన్ని పూజిస్తారు.

ఉనికిని చాటే వేదిక 
కూతాండవర్‌ ఆలయ ఉత్సవాల్లో భాగమైన ఈ మిస్‌ కూవాగం పోటీ కేవలం అందానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ట్రాన్స్ జెండర్ల ఉనికిని చాటే ఒక గొప్ప వేదిక. ఈ వేదిక సూర్య కుట్టి సాధించిన విజయానికి, పట్టుదలకు కోయంబత్తూరు కీర్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రముఖ సినీ నటులు, గాయకుల సమక్షంలో ఆమెకు ఈ గౌరవం లభించడం విశేషం.
 
కుటుంబ మద్దతే మా బలం
ట్రాన్స్ జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలంటే ముందుగా కుటుంబం నుంచి మద్దతు లభించాలి. నా ఈ విజయం మరికొంత మంది ట్రాన్స్‌జెండర్‌లకు స్ఫూర్తిగా నిలుస్తుందని అనుకుంటున్నాను. ప్రభుత్వం ప్రతిపాదించే చట్టాలు మా హక్కులను కాపాడేలా ఉండాలి. ట్రాన్స్  జెండర్‌ సమాజం పట్ల ఉన్న వివక్షను తొలగించి, హక్కుల కోసం పోరాడుతూ.. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలవడమే లక్ష్యం.

Advertisement
 
Advertisement
Advertisement