
‘‘శిలలపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు మనసులో కోపాన్ని బయటికే తోసినారూ...!’’ అంటూ పాడుకుంటూ ప్రస్తుతం థాయిలాండ్ వాసులు తమలోని ఫ్రస్టేషన్‌ను బయటకు వెళ్లగక్కుతున్నారు.
‘‘అహో ఆఫీసు బాసూ... ఆ యముడంటి క్రూరిస్టు శాడిస్టు ఫేసూ... ఈ ఆఫీసు యజమానిగా మా పిడిగుద్దుల పాలబడ్డావయా...’’ అని ఆలాపన పాడిన తర్వాత... ‘‘ప్రతిమపై పిడిగుద్దు గుద్దినారూ... మనవాళ్లు కసితీర అక్కసును వెళ్లగక్కినారూ’’ అంటూ ఖూనీచేయాల్సినంత కసిని... కూనిరాగాలతో సరిపెట్టుకుని తమ కోపాల్నీ, ఫ్రస్టేషన్లనూ బయటకు తీసిపడేస్తున్నారు. దాంతో తమ ‘కోప్‌తాపాలూ డీప్ డిప్రెషన్ల’ నుంచి చప్పున బయటకు వచ్చేస్తున్న ఫీలింగ్ కలుగుతోందంటూ హ్యాపీగా చెబుతున్నారు.
ఇలా కోపం వెళ్లగక్కేది విధిగా మన బాసు పైనే కానక్కర్లేదు... అది యథేచ్ఛగా మన ఎక్స్ గాళ్‌ఫ్రెండూ కావచ్చూ లేదా మన బాయ్‌ఫ్రెండూ కావచ్చు. ఇలా వాళ్లెవరైనప్పటికీ... వాళ్ల మీద ఉన్న కసినీ, అక్కసును కూడా హాయిగా... ‘‘వారెవా ఏమి ఎక్సు... నన్ను వదిలేసి దౌడు తీసూ’’ అంటూ మాజీ ప్రేమిక (కుడి) మీద ఉన్న కోపాన్ని వెళ్లగక్కుకోవచ్చు. అలా మన మనసులోని కోపాగ్రహబాధల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇది మరెక్కడో కాదు... మన పొరుగున ఉన్న థాయిలాండ్‌లోనే. అక్కడి వీధుల్లో ప్రతిమలు తయారు చేసే ఓ స్కల్ప్‌చర్ షాప్ ఉంది. మనం చేయాల్సిందల్లా మన ఆగ్రహానికి గురికాబోయే సదరు అభాగ్యుల ఫొటో తీసుకెళ్లి... జస్ట్ వాళ్లకు హ్యాండోవర్ చేసేయడమే. వాళ్లు శ్రద్ధగా జీవం ఉట్టిపడేలా మనక్కావాల్సిన ప్రతిమను తయారు చేసి పెడతారు. అంతే... ఆ తర్వాత మనం దాంట్లోని జీవకళంతా వెళ్లి΄ోయేలా, మన మనసులోని కోపమంతా పారిపోయేలా, మన మదిలోని అక్కసంతా తీరి΄ోయేలా బాదేయవచ్చు.
ఇక మనలో కసి మరీ ఎక్కువగా ఉందనుకోండి... పుస్తకాల్లో సాదా ప్రతీ, మేలుప్రతిలాగానే... ఆ బంకమట్టిలోపలే కాస్తంత మెటల్‌ఫ్రేము గట్టిగా అమర్చి మరో పది దెబ్బలకు నిలిచేలా, ఇంకో నాలుగు దెబ్బలు కాసేలా మేలైన స్టాండర్డు మట్టిప్రతిమలు తయారు చేసిస్తారు. మనసాగలేక మనం అక్కడికక్కడే మనస్పూర్తిగా కొట్టేశాక కూడా మన కసి తీరలేదనుకోండి. పర్లేదు... మరో నాల్రోజులకోసం అద్దెకిస్తారు లేదా కాస్త డబ్బులెక్కువ పే చేస్తే మనక్కావల్సిన ప్రతిమను మనకే పర్మనెంటుగా అమ్మేస్తారు కూడా.
ఈ ప్రతిమలూ దెబ్బల వ్యవహారమంతా చూస్తూ... ‘‘అద్దిరా కసితీరా కొట్టే దెబ్బలోని పవరు. అరెరె... భలే టెక్నిక్కు కదా... బహుమంచి క్రియేటివిటీ కదా’’ అంటూ కొందరంటూ ఉంటే.. ‘‘ఆ... ఆ టెక్నిక్కుదేవుందీ... ఈ టైపు క్రియేటివిటీ మనకెప్పట్నుంచో తెలుసు. దెబ్బకు దెయ్యం దిగొస్తుందనే సామెత మన దగ్గర లేదా’’ అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.
‘‘మన హాస్య దర్శకుడు జంధ్యాల ఇలాంటి టెక్నిక్కులనెప్పుడో కనిపెట్టేశారంటూ ‘అహ నా పెళ్లంట’ సినిమాల్లో బ్రహ్మానందం... వాళ్ల బాసూ, పరమ పిసినారి పీసు కోట శ్రీనివాసరావును షాట్ ఫ్రీజు చేసి మరీ ‘‘పోతావురా ఒరేయ్... మట్టిగొట్టుకుపోతావు రా... నాశనమైపోతావురా’’ అంటూ తిట్టే షాట్లూ... ‘‘బాబాయ్ అబ్బాయ్ సినిమాలో సుత్తివేలు తనకు కోపం వచ్చినప్పుడల్లా చిందులు తొక్కుతూ... రోజుకు ‘మూడు పూటల కోటా’ చొప్పున తాను కసితీరా బాదేయడానికి ఓ బానపొట్ట పహిల్వాన్‌ను పనిలో పెట్టుకున్న సీన్లూ ఉదాహరిస్తున్నారు.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ‘‘మనం ఎవరిపట్ల కోపం కలిగి ఉన్నామో వారికి ఏమాత్రం హాని కలగని విధంగా... కసితీరా మన కినుకను వెళ్లగక్కి హాయిగా కునుకు తీయగలుగుతున్నప్పుడు ఏమార్గమైతేనేమీ... ఈ మార్గమైతేనేమీ’’ అంటూ కొందరిప్పుడు సన్నాయినొక్కులు నొక్కి మరికొందరు... ప్రతిమ మీద దెబ్బలాగా ఢంకా బజాయించి ఇంకొందరూ కసి తీర్చుకునే మార్గానికి సపోర్టు చేస్తున్నారు.
– యాసీన్
(చదవండి: చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు)