Sameeha Barwin: ప్రతిభ వినని పెద్దలు

Talented Adult World Deaf Athletics Championships Held Lublin Poland - Sakshi

ప్రతిభ వినని పెద్దలుపోలాండ్‌లోని లుబ్లిన్‌లో ఆగస్టు 23 – 28 తేదీల మధ్య ప్రపంచ బధిర అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్స్‌ జరగనున్నాయి. మన దేశం నుంచి ఐదు మంది ‘పురుష’ బధిర అథ్లెటిక్స్‌ వెళుతున్నారు. మన దేశం నుంచి ఒక ‘మహిళా’ బధిర అథ్లెట్‌ను డ్రాప్‌ చేశారు. ఎందుకంటే ‘నిధులు లేవట’. ఆమె స్త్రీ కనుక ఎస్కార్ట్‌ ఇవ్వలేరట. అలాగని ఒక్కదాన్నీ పంపలేరట. తమిళనాడుకు చెందిన సమీహా పర్వీన్‌ నిరాశలో కూరుకుపోయింది. ఒకవైపు ఒలింపిక్స్‌లో మహిళలు పతకాలు తెస్తే మరోవైపు ఈ ఉదంతం. సమీహా గత రికార్డులు  ఈ పెద్దలు ఎందుకు ‘వినరు?’.

కన్యాకుమారి నుంచి ఢిల్లీకి దాదాపు రెండున్నర రోజుల రైలు ప్రయాణం. సుమారు 3 వేల కిలోమీటర్ల దూరం. ఒక బధిర అథ్లెట్, 18 ఏళ్ల సమీహా ఒంటరిగా ప్రయాణించాలి. ఎందుకు? ఆగస్టు చివరి వారంలో పోలెండ్‌లో బధిర అథ్లెట్ల ప్రపంచ ఛాంపియన్‌ షిప్స్‌ జరుగుతున్నాయి. అందుకుగాను జూలై 22న జాతీయ సెలక్షన్‌కు ఢిల్లీకి హాజరు కమ్మని దేశ వ్యాప్తంగా ఉన్న 12 మంది బధిర అథ్లెట్లకు ఆహ్వానం అందింది. ఆహ్వానించింది ‘స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌.ఏ.ఐ) ఆధ్వర్యంలోని ‘ఆల్‌ ఇండియా స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఫర్‌ ది డెఫ్‌’ (ఏ.ఐ.ఎస్‌.సి.డి). కాని ఇందుకు చేసిన ఏర్పాట్లు?

ఒంటరి సమీహా
కన్యాకుమారి జిల్లాలోని కడయాల్‌ టౌన్‌కు చెందిన సమీహా పర్వీన్‌ 90 శాతం బధిరురాలు. వాళ్ల నాన్న చిన్న టీ అంగడి నడుపుతాడక్కడ. ఐదేళ్ల వయసులో తీవ్రమైన జ్వరం రాగా అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న సమీహా వినిడికి శక్తి కోల్పోయింది. అయినప్పటికీ ఆమెకు బాల్యం నుంచి ఆటలంటే ఇష్టం ఏర్పడింది. తల్లిదండ్రలు తమ స్తోమత చాలకపోయినా ప్రోత్సహించారు. సమీహా లాంగ్‌ జంప్‌లో, 100 మీటర్ల పరుగులో రాణించింది.

మూడు జాతీయ బధిర అథ్లెటిక్స్‌ లో (2017– జార్ఖండ్, 2018–చెన్నై, 2019–కోల్‌కటా) గోల్డ్‌ మెడల్స్‌ సాధించింది. ఇంకా అనేక పోటీల్లో ఆమె సాధించిన మెడల్స్‌ అనేకం ఉన్నాయి. అందుకనే సెలక్షన్స్‌ కోసం ఆమెకు పిలుపు వచ్చింది. కాని తేదీ హటాత్తుగా చెప్పడం వల్ల, కోవిడ్‌ రీత్యా ఆమెతో పాటు వచ్చే తల్లి ఆమెతో రాలేకపోయింది. రాష్ట్ర క్రీడా శాఖకు ఎన్ని వినతులు చేసినా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా ఎస్కార్ట్‌ను ఇవ్వలేదు. చివరకు సమీహా నలుగురు పురుష బధిర క్రీడాకారులతోనే ప్రయాణించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమెకు పోలాండ్‌లో జరిగే పోటీలలో పాల్గొనాలనే లక్ష్యం ఉంది. అందులో మెడల్‌ కొట్టగలననే విశ్వాసం ఉంది. కాని ఆమె ఒకటి తలిస్తే అధికారులు మరొకటి తలిచారు.

క్వాలిఫై అయినా
పోలాండ్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌కు సమీహా లాంగ్‌జంప్‌లో, పరుగులో పాల్గొనాలనుకుంది. లాంగ్‌ జంప్‌కు ప్రమాణం 5 మీటర్లుగా అధికారులు నిర్ధారిస్తే సమీహా 5 మీటర్లను దూకి క్వాలిఫై అయ్యింది. అయినప్పటికీ ఫైనల్‌ లిస్ట్‌లో 5 మంది బధిర పురుష అథ్లెట్లను ఎంపిక చేశారు. ప్రమాణాన్ని అందుకోలేకపోయిన మరో బధిర అథ్లెట్‌ వర్షా గులియా (ఢిల్లీ) ని నిరాకరించినా సమీహాను ఎందుకు సెలెక్ట్‌ చేయలేదో ఆమె కుటుంబానికి అర్థం కాలేదు.

వివక్ష ఉంది
‘బధిర క్రీడాకారుల్లో స్త్రీల పట్ల వివక్ష ఉంది. గతంలో జార్ఖండ్‌లో జాతీయ ఛాంపియన్‌ షిప్‌ జరిగినప్పుడు మాకు ఉండే చోటు ఇవ్వలేదు. తినడానికి తిండి పెట్టలేదు’ అని సమీహా తల్లి సలామత్‌ అంది. కూతురికి ప్రతిభ ఉన్నా పోలాండ్‌కు సెలక్ట్‌ చేయకపోవడంతో ఆమె హతాశురాలైంది. ‘మాకు చెప్పిందేమిటంటే మీ అమ్మాయి ఒక్కదాన్నే పంపాలంటే ఇబ్బందులున్నాయి. ఎస్కార్ట్‌ ఇవ్వలేము. అలాగని ఒంటరిగా పంపలేము. అలాగే మా దగ్గర ఫండ్స్‌ తక్కువ ఉన్నాయి అని. దీనికి మించిన అన్యాయం లేదు’ అంది సలామత్‌.

పోలాండ్‌కు వెళ్లే టీమ్‌ ఆగస్టు 14న దేశం నుంచి బయలుదేరుతోంది. కాని అందులో తాను లేకపోవడం సమీహాకు ఆవేదన కలిగిస్తోంది. కన్యాకుమారి ఎం.పి ఈ సంగతి తెలిసి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాశారు– ఆమె ఫండింగ్‌ మేము చూసుకుంటాం తీసుకెళ్లండి అని. దానికి కూడా సంబంధీకులు స్పందించలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళాతేజం అందరూ చూశారు. సమీహా వెళ్లి ఉంటే అక్కడా అలాంటి విజయమే వచ్చి ఉండేదేమో. ఆమె ఆటకూ, పతకానికి కూడా అధికారుల ‘వినికిడి లోపం’ అన్యాయం చేసిందని దేశంలో చాలామంది క్రీడా అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. విమర్శిస్తున్నారు. సారీ సమీహా.

‘బధిర క్రీడాకారుల్లో స్త్రీల పట్ల వివక్ష ఉంది. గతంలో జార్ఖండ్‌లో జాతీయ ఛాంపియన్‌ షిప్‌ జరిగినప్పుడు మాకు ఉండే చోటు ఇవ్వలేదు. తినడానికి తిండి పెట్టలేదు’ 

‘మాకు చెప్పిందేమిటంటే మీ అమ్మాయి ఒక్కదాన్నే పంపాలంటే ఇబ్బందులున్నాయి. ఎస్కార్ట్‌ ఇవ్వలేము. అలాగని ఒంటరిగా పంపలేము. అలాగే మా దగ్గర ఫండ్స్‌ తక్కువ ఉన్నాయి అని. దీనికి మించిన అన్యాయం లేదు’ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top