ఈ రంగులను.. పరిగెత్తినా పట్టుకోలేం! | Strange And Amazing Facts About The Rainbow | Sakshi
Sakshi News home page

ఈ రంగులను.. పరిగెత్తినా పట్టుకోలేం!

May 29 2026 11:41 AM | Updated on May 29 2026 11:41 AM

Strange And Amazing Facts About The Rainbow

సమ్మర్‌ కిడ్స్‌..

నేస్తాలూ! ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనస్సు కనిపిస్తే మనందరికీ ఎంతో సరదాగా ఉంటుంది కదూ.. అయితే, ఈ అందమైన రంగుల విల్లుల వెనుక మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా...!

  • సాధారణంగా మనం చూసే ఇంద్రధనస్సులు ఒక గంట కంటే తక్కువ సమయం మాత్రమే ఆకాశంలో ఉంటాయి. కానీ, 2017లో తైవాన్‌ దేశంలోని ‘తైపీ’ అనే నగరంలో ఒక ఇంద్రధనస్సు ఏకంగా 9 గంటల పాటు ఆకాశంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది.

  • చలికాలంలో మనకు ఇంద్రధనస్సులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే, ఇంద్రధనస్సు ఏర్పడటానికి ఆకాశంలో చిన్న చిన్న నీటి చుక్కలు ఉండాలి. కానీ చలికాలంలో వర్షానికి బదులు మంచు ఎక్కువగా కురుస్తుంది. అందుకే ఈ కాలంలో రంగుల విల్లులు దాగుడుమూతలు ఆడతాయి. అదే మన భూమిపై ఉన్న ‘హవాయి’ దీవుల్లో మాత్రం ప్రపంచంలోనే అత్యధికంగా ఇంద్రధనస్సులు కనిపిస్తాయట!

  • మన సౌర కుటుంబంలో ఇంద్రధనస్సులు కనిపించే ఏకైక గ్రహం మన భూమి మాత్రమే! అయితే, శని గ్రహం ఉపగ్రహమైన ‘టైటాన్‌’ పై కూడా ఇంద్రధనస్సులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • మీకు తెలుసా? ఇంద్రధనుస్సు అనేది నిజానికి అక్కడ ఉండదు! అది కేవలం మన కళ్లకు కనిపించే ఒక దృష్టి భ్రాంతి మాత్రమే. సూర్యుని కాంతి నీటి చుక్కలపై పడి పరావర్తనం చెందినప్పుడు, చూసేవారికి కరెక్ట్‌గా 42 డిగ్రీల కోణంలో ఈ రంగులు కనిపిస్తాయి.

  • ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 3వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ‘నేషనల్‌ ఫైండ్‌ ఎ రెయిన్‌ బో డే’ గా జరుపుకుంటారు. ఈ సారి వర్షం పడినప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు కోసం వెతకడం మర్చిపోకండి!

  • ఇంద్రధనస్సు నిజంగా ఒక చోట అంటూ ఉండదు కాబట్టి, మనం ఎంత దూరం పరిగెత్తినా దాని అంచుని పట్టుకోలేం, అసలు దాన్ని తాకలేం కూడా!

Advertisement
 
Advertisement
Advertisement