అసమ్మతివాద రచయిత

Special Article On Aleksandr Isayevich Solzhenitsyn - Sakshi

వర్ధంతి

నిప్పుల నిజాల్ని వెలిగక్కినవాడు, విలువల నీతులు బోధించినవాడు, స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం అక్రోషించిన ఒకే ఒక్కడు– అలెగ్జాండర్‌ ఇసయెవిచ్‌ సోల్జినిత్సిన్‌(11 డిసెంబర్‌ 1918 – 3 ఆగస్ట్‌ 2008) ఒక గొప్ప సాహితీవేత్త, చరిత్రకారుడు, విమర్శకుడు, అన్నింటినీ మించి ఒక మహోన్నత దార్శనికుడు. సాహిత్య రంగంలోంచి, తాత్వికత, మతం, రాజకీయాలు, అంతర్జాతీయ సమస్యల్లోకి తన దూరదృష్టిని సారించాడు. తనకు ముందూ వెనుకలు ఎవరూ లేకపోయినా, తన దృక్పథంలో ఉన్న బలంతో, తన ఆలోచనా సరళితో ప్రభుత్వాల్నే ఎదిరించగలిగాడు. ఆయనకు నోబెల్‌ సాహిత్య పురస్కారం ప్రకటించినప్పుడు స్వీకరించడానికి స్టాక్‌హోమ్‌(స్వీడన్‌)కు వెళ్లనివ్వని ప్రభుత్వం, తర్వాతి కాలంలో దిగివచ్చింది. తన దేశపు అత్యున్నత పురస్కారం స్టేట్‌ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాల్సి వచ్చింది. నవలాకారుడిగా, జ్ఞాపకాలు నమోదు చేసుకున్న రచయితగా, తన జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పిన సోల్జినిత్సిన్‌ విరివిగా రాసినా, తన స్థాయినీ, రచనలో స్పష్టతనూ నాణ్యతనూ నిలుపుకున్నాడు. ముఖ్యంగా 1968–78 మధ్యకాలంలో ఆయన మేరునగధీరుడిగా నిలబడ్డాడు.

జోసెఫ్‌ స్టాలిన్‌ లేబర్‌ కేంప్‌లో ఎనిమిదేళ్లు, దేశం వదిలి ఇతర దేశాల్లో దేశదిమ్మరిగా మూడేళ్లు, అమెరికాలో మరో ఇరవై ఏళ్లు గడిపిన సోల్జినిత్సిన్‌– మిఖైల్‌ గోర్బచెవ్‌ పెరిస్ట్రోయికా ప్రవేశపెట్టిన తర్వాత, బోరిస్‌ యెలిత్సిన్‌ కమ్యూనిజాన్ని ముక్కలు చేశాక మే 1994లో మళ్లీ స్వదేశానికి తిరిగివచ్చాడు. మితవాది, దేశభక్తుడు అయికూడా నాటి పాలకులకు ఆయన మాటలు, రచనలు రుచించలేదు. రచనలు బహిష్కరించబడ్డాయి. పుస్తకాలు అతి కష్టంమీద ఇతర దేశాల్లో ముద్రించుకోవాల్సి వచ్చింది. తిండి లేకపోవడం వల్లా, విపరీతమైన పని ఒత్తిడి వల్లా లేబర్‌ కేంప్‌లో చనిపోయేవాడే. మెల్లగా ఒక చిన్న అవకాశం లభించింది. శరష్క అనే వైజ్ఞానిక సంస్థకు బదిలీ చేయబడ్డాడు. ఆ సంస్థ జైలు జీవితం గడుపుతున్న విద్యావంతుల మీద, మేధావుల మీద పరిశోధన జరిపేది. ముఖ్యంగా లేవ్‌ కొపిలెవ్, డిమిట్రి పానిస్‌ అనేవారు సోల్జినిత్సిన్‌ను సుదీర్ఘమైన చర్చల్లో పాలుపంచుకునేట్లు చేశారు. అవి రాజకీయపరంగా, తాత్వికంగా సాగుతుండేవి. అలాగే సెర్గె ఇవషోవ్‌ ముసతోవ్‌ ఆయన ఆలోచనా విధానంలో మార్పుకు కారణమయ్యాడు. వాస్తవికతావాదం, ప్రతీకవాదాల సమ్మేళనం సంభవమని సూచించాడు. అప్పుడే ‘ఇవాన్‌ డెనిసోవిచ్‌ జీవితంలో ఒకరోజు’(1962) శీర్షికతో సోల్జినిత్సిన్‌ తన జైలు జీవితపు తొలి అనుభవాల్ని నవలగా గ్రంథస్థం చేశాడు. 

రచయతల గుర్తింపునకూ, రాజకీయాలకూ నేరుగా సంబంధం ఉంటుందన్న విషయం ఆయన విషయంలో బాహాటంగానే తేలిపోయింది. 1964లో కృశ్చేవ్‌ అధికారం కోల్పోయాడు. సాహిత్యానికి లభించే లెనిన్‌ ప్రైజ్‌ అందినట్టే అంది మాయమైంది. తర్వాత బ్రెజ్‌నెవ్‌ అధికారంలోకి రాగానే మేధావులపై ఆంక్షలు విధించాడు. ఇంకా అప్పటికి సోల్జినిత్సిన్‌ కాన్సర్‌ వార్డు (1968) పూర్తి కాలేదు. కొంతభాగం అచ్చయి సంచలనం సృష్టించాక ఆపివేయబడింది. జకొస్లవాకియా ప్రమేయం కూడా ఉండటంతో సోవియెట్‌లో అసమ్మతివాదుల్ని అణగదొక్కడం నిరాఘాటంగా సాగిపోయింది. సోల్జినిత్సిన్‌ను రచయితల సమాఖ్య నుండి బహిష్కరించారు. కజకస్థాన్‌లో దేశబహిష్కృతుడిగా ఉన్నప్పుడు వేలవేల చరణాలతో దీర్ఘ కవితలెన్నో రాశాడు. లుబయాంక జైలులో జీవితం అతిభయంకరంగా ఉంటుందని పేరు. అలాంటి చోట ఆయన అత్యంత ప్రసిద్ధమైన ‘గులార్చి పెలాగో’ నవలలోని ముఖ్యమైన ఘట్టాలు రాశాడు. ఆగస్ట్‌ 1914 (1971), ద ఓక్‌ అండ్‌ ద కాఫ్‌(1975), ఇన్విసిబిల్‌ ఎల్లీస్‌(1995) ఆయన ఇతర ప్రసిద్ధ రచనలు. తన అసమ్మతిరాగం వినిపిస్తూ ఫలితంగా అనేక రకాల శిక్షలు అనుభవించినా ఆయనలోని దృఢ సంకల్పం బలపడుతూ వచ్చిందేగానీ బలహీనపడలేదు.

మంచికీ చెడుకూ మధ్య రేఖ– రెండు వర్గాల మధ్య, రెండు దేశాల మధ్య మాత్రమే ఉండదు. అది మనుషుల హృదయాల మధ్య కూడా ఉంటుంది, అంటాడు సోల్జినిత్సిన్‌. పురోగతి సాధిస్తున్న రష్యా అమెరికాతో విభేదించాలనీ, తన అస్తిత్వాన్ని తాను నిలుపుకోవాలనీ చెప్పాడు. వ్యక్తులైనా, జాతులైనా, సోవియెట్‌ దేశమైనా సరే, సంప్రదాయాల్ని గౌరవించుకుంటూ తమ ప్రత్యేకతల్ని కాపాడుకోవాలని కోరుకున్నాడు. సోవియెట్‌ మేధావులు చిన్న చిన్న వాటికి ఆశపడి వలస పోవడాన్ని నిరసించాడు. అమెరికాను మహోన్నతంగా ఊహించుకుని దానిపట్ల ఆశగా చూసే రష్యన్‌ ఉదారవాదులకు ఆయన ఆలోచనలు నచ్చలేదు. అందుకే ఎల్లవేళలా ఆంక్షలకు బలవుతూ వచ్చాడు.

1994లో రెండుసార్లు సోవియెట్‌ పార్లమెంటులో మాట్లాడాడు. రష్యా పునర్జీవనం గురించి కలలుగన్నాడు. రీబిల్డింగ్‌ రష్యా, హౌ షల్‌ వుయ్‌ ఆర్గనైజ్‌ రష్యా అనే రెండు పెద్ద వ్యాసాలు ప్రచురించి, రాజకీయ రంగాన్ని ఆలోచింపజేశాడు. ఫస్ట్‌ సర్కిల్‌ నవల 1996లో టెలివిజన్‌ షోగా మలచబడి ప్రసారమవుతూ ఉండగా మధ్యలో ఆపివేయబడింది. అయితే మరో ఐదేళ్ల తరువాత రాజకీయంగా వచ్చిన మార్పుల వల్ల, ప్రేక్షకుల అవగాహనాస్థాయిలో వచ్చిన మార్పుల వల్ల  అదే సీరియల్‌ 2006లో పునఃప్రసారమై అఖండ విజయం సాధించింది. దానితో ఆయన విజయాన్ని ఆయన తన చివరి రోజుల్లో చూసుకున్నట్లయింది. వీటన్నింటి ఫలితంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 2007లో స్వయంగా సోల్జినిత్సిన్‌ ఇంటికి వెళ్లి, తమ దేశపు అత్యున్నత పురస్కారం అందించి వచ్చాడు.

ఆయన వైవాహిక జీవితం విచిత్రంగా గడిచింది. డిగ్రీ పూర్తికాగానే తనతోపాటు చదువుకున్న స్నేహితురాలు నటాలియా రెస్టోవెస్కియాను 1940లో పెండ్లి చేసుకున్నాడు. ఆయన లేబర్‌ కేంప్‌లో నరకయాతన అనుభవిస్తున్న దశలో ఆమె పరిశోధక విద్యార్థిగా ఉండేది. సమాజంలో తన స్థాయి నిలబెట్టుకోవడానికి, గౌరవంగా బతకడానికి తను విడాకులు తీసుకుంటానని ఆయనకు పలుమార్లు చెబుతుండేది. పన్నెండేళ్లు గడిచిన తర్వాత విడాకులు తీసుకున్నారు. పరిస్థితులు మారి, అన్నీ కాస్త చక్కబడ్డాక, ఐదేళ్ల తర్వాత మళ్లీ పెండ్లి చేసుకున్నారు. పదిహేనేళ్లు కలిసి జీవించాక తిరిగి విడాకులు తీసుకున్నారు. యాభై ఐదేళ్ల వయసులో రెండో భార్య నటాలియా స్వెత్లోవాను పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు కొడుకులు పుట్టారు.

ఒక నిజాయితీ గల కమ్యూనిస్టుగా ఎదిగిన సోల్జినిత్సిన్‌ జీవితాంతం అలాగే నిలబడ్డాడు. ఎనభై తొమ్మిదేళ్ల వయసులో 2008 ఆగస్ట్‌ 3న కన్నుమూశాడు. అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడుపుతున్న వారిదే ఎప్పుడూ తుది నిర్ణయం కాదు. నిరసనలు తెలుపుతూ దిశా నిర్దేశం చేసే మేధావుల ఆలోచనలకు, సామాన్య ప్రజల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు కూడా ఎంతో విలువ ఉంటుంది. నిరసనల బలం ఎంతో మనం భారతదేశంలో ప్రత్యక్షంగా చూశాం. అధికార బలం ఎప్పుడూ ప్రజాబలం ముందు దిగదుడుపే!
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top