Akanksha Jagwani- Avni Agrawal: సమస్యకు పరిష్కారం చూపే సిక్స్‌ సెన్స్‌!

SixSense: An irreversible solution to an impending problem - Sakshi

సక్సెస్‌ స్టోరీ

రాబోయే సమస్యకు తిరుగులేని పరిష్కారం

అంతా అయిపోయాక ‘అయ్యో!’ అనుకుంటాయి కొన్ని సంస్థలు. ‘అయ్యో!’లకు ఆస్కారం ఇవ్వకుండా సమస్యకు పరిష్కారం చూపుతుంది సిక్స్‌ సెన్స్‌. ఇది ఏ.ఐ ఆధారిత డిఫెక్ట్‌ ఎనాలటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌. ఇద్దరు స్నేహితులు ఆకాంక్ష జగ్వానీ, అవ్నీ అగర్వాల్‌లు ప్రారంభించిన ఈ స్టార్టప్‌ విజయపథంలో దూసుకుపోతోంది. సాంకేతిక లోపాలను,
కారణాలను ముందుగానే తెలియజేయడం ద్వారా ఈ టెక్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలకు ఉపయోగపడుతుంది.

తమ ప్రాజెక్ట్‌పై నమ్మకం కలిగించేలా, పెట్టుబడి పెట్టేలా చేయడం స్టార్టప్‌ ఫౌండర్‌లకు సవాలు. ఇక పురుషాధిక్య రంగాలుగా ముద్రపడిన వాటిలో మహిళా స్టార్టప్‌ ఫౌండర్‌లకు ఇది మరింత పెద్ద సవాలు.
కానీ ఈ అతిపెద్ద సవాలును ఎలాంటి అవరోధాలు లేకుండానే అధిగమించారు ఆకాంక్ష జగ్వానీ, అవ్నీ అగర్వాల్‌. సింగపూర్‌ కేంద్రంగా వీరు శ్రీకారం చుట్టిన స్టార్టప్‌ ‘సిక్స్‌సెన్స్‌’ (ఎస్‌ఎస్‌)కు లీడింగ్‌ వెంచర్‌ క్యాపిటల్స్‌ నుంచి నైతిక,ఆర్థిక మద్దతు లభించింది. ఇద్దరు ఉద్యోగులతో మొదలైన ఈ స్టార్టప్‌ విజయపథంలో దూసుకుపోతుంది.

‘సిక్స్‌సెన్స్‌’ అనేది ఏ.ఐ ఆధారిత డిఫెక్ట్‌ ఎనాలటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌. సాంకేతికలోపాలను గుర్తించడంలో ఉపయోగపడే క్లాసిఫికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇది. ఏ.ఐ సాంకేతికతను ఉపయోగించి ‘ఎస్‌ ఎస్‌’ టెక్‌ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రాడక్ట్స్‌ను స్కాన్‌ చేస్తోంది. ఎక్కువ నష్టం జరగక ముందే మాన్యుఫాక్చరింగ్‌ ఎక్విప్‌మెంట్‌లో లోపాలను గుర్తిస్తోంది. ఆపరేషనల్‌ మిస్టేక్స్‌లో అధిక ఆర్థిక నష్టం జరగకుండా చూస్తోంది.

లోపాలను గుర్తించడం మాత్రమే కాదు, అవి ఎందుకు తలెత్తుతున్నాయో ఇంజనీర్‌లకు ఈ ప్లాట్‌ఫామ్‌ వివరిస్తుంది.
‘ఎస్‌ ఎస్‌’ కో–ఫౌండర్, సీటివో అవ్నీ అగర్వాల్‌ అలహాబాద్‌లోని ‘మోతిలాల్‌ నెహ్రు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుకుంది. డాటా సైన్స్‌లో మంచి పట్టు ఉంది. చదువు పూర్తయిన తరువాత ఒక ప్రముఖ సంస్థలో పనిచేసి ‘బ్రిలియెంట్‌’ అనిపించుకుంది అగర్వాల్‌. ఈ సంస్థలో పనిచేయడం ద్వారా లాంచింగ్‌ ప్రాడక్ట్స్‌ నుంచి మెనేజింగ్‌ కంపెనీ కల్చర్‌ వరకు ఎన్నో విషయాలను ప్రాక్టికల్‌గా తెలుసుకుంది. ఆ సమయంలో తాను ప్రధానంగా గమనించిన విషయం ఏమిటంటే, టెక్నాలజీ పరంగా సంస్థలు ఏ మేరకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయని.

డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన అనివార్యత ఉన్నప్పటికీ ఎన్నో పరిశ్రమలు దానికి దూరంగా ఉండడాన్ని అగర్వాల్‌ గమనించింది. పరిశ్రమలకు ఆధునిక సాంకేతికతను పరిచయం చేసే బాధ్యతను తానే తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. దీనికి ఎంతో అధ్యయనం అవసరం. కొత్త విషయాలు నేర్చుకోవడం అవసరం. తాను అందుకు రెడీ అయింది.

అయితే ఏ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాలనే విషయంలో అగర్వాల్‌లో స్పష్టత లోపించింది. దీంతో తన స్నేహితురాలు ఆకాంక్షను కలుసుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ...ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్న తరువాత తమ ప్రధాన టార్గెట్‌ ‘మాన్యుఫాక్చర్‌ ఇండస్ట్రీ’ అని తేల్చుకున్నారు. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌కు మాన్యుఫాక్చరింగ్‌ రంగం అన్ని రకాలుగా అనుకూలమైనది అనే అంచనాకు వచ్చారు. అది పరీక్ష సమయం. మానసికంగా ఎంత బలంగా ఉన్నాసరే, ఏమవుతుందో ఏమో! అనే సందేహం చెవిలో జోరీగలా డిస్టర్బ్‌ చేస్తున్న సమయం. ఆ జోరీగను దగ్గర రాకుండా చేసి ‘ఎస్‌. మేము తప్పకుండా విజయం సాధిస్తాం’ అని ఒకటికి రెండుసార్లు గట్టిగా అనుకున్నారు ఇద్దరు మిత్రులు.

ఒక ఫైన్‌మార్నింగ్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంటర్‌ప్రెన్యుర్‌ ఫస్ట్‌ టాలెంట్‌ ఇన్‌వెస్టర్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి సింగపూర్‌ విమానం ఎక్కింది అవ్నీ అగర్వాల్‌. అలా సింగపూర్‌ కేంద్రంగా ‘సిక్స్‌ సెన్స్‌’ స్టార్టప్‌ పట్టాలకెక్కింది. సింగపూర్‌ను కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం అక్కడ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉండడమే.
‘మ్యాథ్స్‌ ప్రాబ్లం నుంచి టెక్నికల్‌ ప్రాబ్లం వరకు రకరకాల సమస్యలను పరిష్కరించం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అందులో చెప్పలేనంత సంతోషం దొరుకుతుంది. ఆ సంతోషమే నన్ను ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేలా చేసింది’ అంటుంది అవ్నీ అగర్వాల్‌.

‘ఎస్‌ ఎస్‌’ కో–ఫౌండర్, సీయివో ఆకాంక్ష జగ్వానీ(ముంబై) మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుకుంది. ఆమెకి ప్రముఖ సంస్థలో పనిచేయడం కంటే ఒక సంస్థను ప్రారంభించి దాన్ని ప్రముఖ సంస్థల జాబితాలో కనిపించేలా చేయాలనేది కాలేజీ రోజుల నాటి కల.
‘ఎస్‌ ఎస్‌’ ద్వారా తన కోరిక నెరవేరింది. విజయపథంలో దూసుకుపోతున్న ‘సిక్స్‌ సెన్స్‌’ తాజాగా వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ‘టిన్‌మెన్‌’ నిధులతో మరింత విస్తరించే పనిలో ఉంది. ఆల్‌ ది బెస్ట్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top