
పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు.. తప్పెట్లు.. అంటూ వర్ణించారు మనసు కవి ఆత్రేయ. ఈ కాలపు పెళ్లిళ్లలో సందడి కంటే షో ఎక్కువగా కనబడుతోంది. సంప్రదాయాల కంటే హంగామా ఎక్కువవుతోంది. ఫలితంగా పెళ్లి ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఓ మాదిరి స్థాయిలో వివాహ వేడుక నిర్వహించాలంటే తక్కువులో తక్కువ 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతోంది. జీవితంలో ఒకేసారి జరిగే వేడుక అంటూ స్థాయిమించి లగ్గాలకు వెచ్చిస్తున్నారు. దీంతో పెళ్లి ఖర్చు అంటనే మిడిల్ క్లాస్ (Middle Class) పేరెంట్స్ పరేషాన్ అవుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ జంట సింపుల్‌గా పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచింది.
ఏడాది OTT సబ్‌స్క్రిప్షన్ కంటే తక్కువ ఖర్చుతో పెళ్లి జరిగిందంటే నమ్ముతారా? అవును ఇది నిజంగా నిజం. ఓ జంట కేవలం రూ. 1,592తో పెళ్లి చేసుకుంది. జోకులేయకండి సార్.. ఈ డబ్బుతో ఒక జత బట్టలు కూడా కొనలేం, ఏకంగా పెళ్లా? అంటూ నోరెళ్లబెట్టకండి. అయితే రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన కమల్ అగర్వాల్, అతని చిరకాల స్నేహితురాలు రుచి పెళ్లి గురించి మీరు తెలుసుకోవాల్సిందే. కళ్లు చెదిరే సంగీత్‌లు, ఆర్భాటపు గ్రాండ్ బఫేలు, ఊరంతా ఫంక్షన్ హాల్ లేకుండా వీరిద్దరూ సింపుల్ వెడ్డింగ్ చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసేశారు.
సింపుల్ వెడ్డింగ్
తన పెళ్లికథను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడిట్' (Reddit) లో పంచుకున్నాడు కమల్. తన అన్నయ్య పెళ్లి ఆర్భాటంగా చేయడం వల్ల డబ్బు, సమయంతో పాటు తమ కుటుంబం అనుభవించిన యాతనను కళ్లారా చూసి.. నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కమల్. మే 28న రిజిస్ట్రార్ కార్యాలయంలో కమల్, రుచి వివాహం చేసుకున్నారు. తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు ఏప్రిల్ 17న రిజిస్ట్రార్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వధూవరుల ఆధార్‌కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, కొన్ని స్టాంప్ పేపర్లతో పెళ్లి తంతు సింపుల్‌గా ముగిసింది. బారాత్ (Baraat) వంటి హంగామా లేకుండా పెళ్లికొడుకు, పెళ్లికూతురు.. మ్యారేజ్ సర్టిఫికెట్‌తో రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి చిరునవ్వుతో బయటకు వచ్చారు.
పెళ్లి ఖర్చులు ఇలా..
తన పెళ్లికి వెచ్చించిన డబ్బు వివరాలు కూడా కమల్ వివరించాడు. స్టాంప్ పేపర్లకు రూ. 320, పబ్లిక్ నోటరీకి రూ. 400, అత్యవసర ఫోటోలకు రూ. 260, డిక్లరేషన్ ఫారమ్ ప్రింటింగ్ కోసం రూ. 290, స్టేషనరీ, ప్రింటింగ్, ప్రభుత్వ రుసుములకు రూ. 322 వరకు ఖర్చచేసినట్టు వెల్లడించాడు. మీ దగ్గర ఇప్పటికే ఫోటోలు ఉండి ఉంటే, ఇంట్లో ప్రింట్ తీసుకునే వీలుంటే, నోటరీ చేయడానికి తెలిసినవారు ఎవరైనా ఏంటే.. పెళ్లి ఖర్చు రూ.వెయ్యిలోపే ఉంటుందని వివరించాడు.
నెటిజనులు ఏమన్నారంటే..
కమల్, రుచి సింపుల్ వెడ్డింగ్‌ను నెటిజనులు (Netizens) ప్రశంసిస్తున్నారు. తాము ఇలాగే నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు కొంతమంది మనలో మాట బయటపెట్టారు. ఎటువంటి ఆడంబరం లేకుండా పెళ్లి చేసుకోవడంతో కమల్, రుచి నెట్ వర్త్ వెంటనే రూ. 10 లక్షలు పెరిగిందని ఓ నెటిజన్ చమత్కరించారు. మరికొందరు నూతన వధూవరులను అభినందిస్తూనే.. క్యాటరింగ్, ఆభరణాల వంటి పరిశ్రమలను నిలబెట్టడానికి లావిష్ వెడ్డింగ్స్ సహాయపడతాయని పేర్కొన్నారు. విలాసవంతమైన వేడుకలు ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాయన్నారు.
చదవండి: అంతిమ క్షణాల్లో 'విల్' పవర్!
దీనికి కమల్ అగర్వాల్ స్పందిస్తూ.. తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. ఖర్చు విషయంలో రాజీ పడలేదని, తమది చైతన్యవంతమైన నిర్ణయమని అన్నాడు. హంగు, ఆర్భాటాలు లేకుండా సింపుల్ వెడ్డింగ్ (Simple Wedding) చేసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది నెటిజనులు వ్యక్తం చేయడం గమనార్హం. మరి మీరేమంటారు?