
రెండు చేతులూ లేకపోయినా బాణం సంధించి విలువిద్యలో మెడల్స్ సాధించింది పారా ఆర్చర్ షీతల్. మహేంద్ర నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారును అందుకుంది బహుమతిగా. ఇప్పుడు ఆమె ఆ కారులో షికారు చేస్తోంది. కాళ్లతో నడుపుతూ ‘ఓటమిని ఓడగొట్టండి’ అని పిలుపునిస్తోంది. జీవితానికి ఈ ధోరణే కదా జవాబు.
ఓడిపోవడం అలవాటు చేయడానికి మించిన వ్యసనం మనసుకు లేదు. మనసు కూడా అడవి గుర్రమే. దానిని గడ్డి మేస్తూ తిరగనిస్తే అలాగే ఉంటుంది. దాని వీపున ఎక్కి స్వారీ చేస్తే మెరుపు వేగంతో గమ్యానికి చేరుస్తుంది. మనసు చాలా మాయ చేస్తుంది. డిప్రెస్డ్‌గా ఉన్నాను మద్యం తాగు... ఎటైనా పో... పని చేయకుండా పడుకో... ఇక నీ వల్ల ఏం కాదు ఉరి పోసుకో.... నువ్వు దేనికీ పనికి రావు గంగలో దూకి నాకు ప్రశాంతత ఇవ్వు... ఇలా ఏదో చెబుతూ ఉంటుంది. ఎందుకంటే మనసుకు చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించమని మనం కోరితే దానికి బద్దకం. కష్టపడాలి కదా. కాని మనం గట్టిగా అదిలిస్తే రెట్టింపు శక్తితో పని చేస్తుంది. అందుకే దాని మాయలో పడరాదు.
శీతల్ దాని మాయలో పడలేదు. పుట్టడమే ‘ఫొలొమెలియా’ అనే శారీరక స్థితి వల్ల రెండు చేతులు లేకుండా జన్మించింది. కాని బెదరలేదు. భయపడలేదు. లక్షణంగా ఉన్న కాళ్లను, భుజాలను, పంటి దవడలను ఉపయోగించి బాణం ప్రయోగించడం నేర్చుకుంది. 2024లో పారిస్ పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించేంత ఘనతతో ఎదిగింది. విలు విద్య అంటేనే చేతులతో ప్రదర్శించేది. అలాంటిది చేతులే లేకుండా బాణం వేసిందంటే మాటలా!
అందుకే మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ అధినేత మహేంద్ర ఆమెకు ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి స్కార్పియోను బహూకరించాడు. ఆమె స్ఫూర్తికి సలామ్ చేశాడు. కాని చాలామంది ఇలాంటి బహుమతిని మూల పెడతారు. లేదా మరొకరు నడుపుతుంటే ఎక్కి కూచుని తిరుగుతారు. కాని శీతల్ తానే ఆ బండిని నడపాలనుకుంది. కాళ్లతో స్టీరింగ్ తిప్పుతూ నడపడం నేర్చుకుంది. అంతేకాదు హైవే మీద బండిని పరుగులు పెట్టించింది. ఆ వీడియోను చూసి అందరూ మళ్లీ ‘ఆహా.. ఓహో’ అని కేరింతలు కొట్టారు. చేతులు లేకుండా కారు నడుపుతున్నప్పుడు అదేదో లేదని వేరేదో లేదని బాధ పడుతూ కూచోవడం ఎంత వరకు కరెక్ట్?
లేనిది మాత్రమే లేదు. ఉన్నది చాలా గొప్పగా మన వద్ద ఉన్నది. ఆ మనసును, బుర్రను, శక్తిని ఉపయోగించి జీవితాన ఎదురుపడే సవాళ్లను దాటడమే శీతల్‌ను చూసి మనం నేర్చుకోవాల్సింది.