పరిశుభ్రతే పర్యాటకాకర్షణ | Satya Stories: Cleanliness is a tourist attraction | Sakshi
Sakshi News home page

పరిశుభ్రతే పర్యాటకాకర్షణ

Apr 2 2026 10:32 PM | Updated on Apr 2 2026 10:32 PM

Satya Stories: Cleanliness is a tourist attraction

ఆ పల్లె కీర్తి...దేశానికే స్ఫూర్తి వేసవిలో హిల్‌ స్టేషన్స్‌కు , పండగలు, జాతరలు ఉన్న రోజుల్లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు.. ఇలా ఏడాది మొత్తం సీజన్‌ను బట్టి టూర్‌ ‘ఇష్టుల’ అభిరుచులు కూడా మారుతుంటాయి. అయితే అత్యంత పరిశుభ్రంగా ఉన్న పల్లెటూర్లకు, చక్కని జీవనశైలికి పట్టం కడుతున్న గ్రామాలకు కూడా ఇటీవల పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దుమ్మూ థూళి, అపరిశుభ్రవాతావరణం, కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవువున్న నగరాల నుంచి ఇలాంటి పల్లెలకు ప్రయాణాలు పెరుగుతున్నాయి. అదే క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని ఓ పల్లె సైతం పర్యాటక ఆకర్షణగా మారడం విశేషం. పరిశుభ్రత అనేది భూతద్ధంతో వెదకాల్సిన అంశంగా ఉన్న పరిస్థితుల్లో , ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు పరిశుభ్రతపై తన శ్రద్ధతో పౌర స్పృహకు కొత్త అర్థాన్ని ఇస్తోంది. బాబోజోలా అనే ఈ సాదాసీదా గ్రామం చెత్త, వ్యర్ధాల రహిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. బాబోజోలాలో నివసించే గ్రామస్తులకు, పరిశుభ్రత అనేది కేవలం ఒక నియమం కాదు, అది ఒక జీవన విధానం. ప్రతి ఇంటివారు ఎంతో శ్రద్ధగా పాటించే ఒక విధి.

పరిశుభ్రతే జన‘పధం’ నిషేధం ఓ ఆయుధం...
మహిళలు రోజుకు మూడుసార్లు గ్రామాన్ని ఊడ్చి శుభ్రం చేస్తారు. అంతేకాదు ఇంటింటి నుంచీ చెత్తను డబ్బాలలో సేకరిస్తారు. మరుసటి రోజు మగవారు ఆ చెత్తను తొలగిస్తారు. ఈ గ్రామంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని  పూర్తిగా «నియంత్రించారు. అంతేకాకుండా, ప్రజారోగ్యంపై అవగాహన పెంచడానికి  ప్రతి మూలలో ’ధూమపానం నిషేధం’ అనే బోర్డులను ఏర్పాటు చేశారు. ,  ఇంకా బహిరంగంగా ఉమ్మివేయడం లేదా పొగాకు నమలడం కూడా నిషిద్ధం. ఈ నిషేధాజ్ఞలను పక్కాగా అమలు చేస్తుండడంతో ఈ గ్రామంలో ఎవరూ గుట్కా సేవిస్తూ కనిపించరు ప్లాస్టిక్‌ జాడ కూడాఎక్కడా కనిపించదు.

ఉపాధ్యాయుడి...పాఠం...
బాబోజోలాను ఒక ఆదర్శ గ్రామంగా మార్చాలనే ఆకాంక్షతో, మధుసూదన్‌ మారండీ అనే స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు 15 సంవత్సరాల క్రితం ఈ పారిశుధ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన  బాటలో గ్రామస్తులు దీనిని ఒక నైతిక బాధ్యతగా స్వీకరించి, పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడానికి  సీసీటీవీలు, చెత్తబుట్టలు, సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు కోసం నిధులు సేకరించడానికి ఒక క్లబ్‌ను ఏర్పాటు చేశారు.

శుభ్రమైన ఇళ్లు...అందాల లోగిళ్లు...
ప్రస్తుతం, బాబోజోలాలో సుమారు 70 సంతల్‌ కుటుంబాలు నివసిస్తున్నాయి,  వారి గడ్డి ఇళ్లు సహజసిద్ధంగా, ప్రకృతి వనరులతో నిర్మితమయ్యాయి. ఆసక్తికరంగా, ప్రతి ఇంటి గోడలను మహిళలు రంగురంగుల పువ్వులు  ఆకుల నమూనాలతో పాటు, జంతువులు  సాంప్రదాయ థీమ్స్‌తో అందంగా అలంకరిస్తారు. స్థానిక భాషలో దీనిని ’భిత్‌ పోటావ్‌’ అని పిలుస్తారు. ఈ చిత్రణలలో ఉపయోగించే రంగులన్నీ నదీ తీరంలోని బంకమట్టి, రాళ్ళు, చెట్ల బెరడు  పువ్వుల నుంచి సహజంగా లభించేవే కావడం విశేషం.

ఫిబ్రవరిలో జరిగే పటపర్వ పండుగ సమయంలో, గ్రామస్తులు తమ ఇళ్లకు కొత్తగా రంగులు వేసి, పారిశుధ్య భావనను ప్రచారం చేసే సాంప్రదాయ పాటలు  నృత్య  కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ సమయంలో ఎక్కువగా ఉండే సందర్శకులు  పర్యాటకుల రద్దీని పురస్కరించుకుని నిబంధనలు పాటిస్తున్నారో లేదో  గమనించడానికి, ఈ గ్రామం అంతటా సీసీటీవీలను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు జరిమానా చెల్లించడాల్సి ఉంటుంది. లేదా ఆ ప్రదేశాన్ని స్వయంగా శుభ్రం చేయవలసి ఉంటుంది.

ఈ పల్లెను సందర్శించాలంటే...
విమాన మార్గంలోనైతే... భువనేశ్వర్‌ విమానాశ్రయానికి విమానంలో చేరుకుని, అక్కడి నుంచి మయూర్‌భంజ్‌కు క్యాబ్‌ లేదా బస్సులో ప్రయాణించి, ఆ తర్వాత బాబోజోలాకు స్థానిక రవాణాలో వెళ్లాలి. అదే విధంగా రైలు ద్వారా చేరుకోవాలంటే.. సమీపంలో ఉన్న బారిపద  బాలాసోర్‌ రైల్వే స్టేషన్లలో దిగాలి.  అక్కడి నుంచి  స్థానిక బస్సును లేదా షేర్డ్‌ క్యాబ్‌/జీప్‌ను ఎక్కవచ్చు. ఇక రోడ్డు మార్గం ద్వారా అయితే తొలుత బారిపదకు చేరుకుని, అక్కడి నుంచి స్థానిక బస్సు, ఆటో లేదా ఏదైనా షేర్డ్‌ వాహనాన్ని ఎంచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement