Childrens Day Special: బాలోత్సవ్‌..  | Sakshi
Sakshi News home page

Childrens Day Special: బాలోత్సవ్‌.. 

Published Sun, Nov 13 2022 10:39 AM

Sakshi Funday Special Story On Occasion Of Childrens Day

ఊహల్లోకి కూడా ప్లే గ్రౌండ్‌ను రానివ్వకుండా చేసిన వీడియో గేమ్స్‌.. 
కల్చరల్‌ యాక్టివిటీ అర్థాన్నే మార్చేసిన రీల్స్‌.. 
విచిత్ర వేషధారణకు ఇంపోర్టెడ్‌ వెర్షన్‌గా పాపులర్‌ అయిన హాలోవీన్‌..
పిల్లల ఉత్సాహానికి.. ఉత్సవానికి కేరాఫ్‌ అనుకుంటున్నాం!
స్థానిక ఆటలు, పాటలు.. సృజనను పెంచే సరదాలను మరుగున పడేసుకున్నాం!
అలాంటి వాటిని వెలికి తీసి వేదిక కల్పించే ఉత్సాహం ఒకటి ఉంది.. అదే బాలోత్సవ్‌!
పిల్లల దినోత్సవమే దానికి సందర్భం! ఆ వేడుక గురించే ఈ కథనం.. 

బోనమెత్తిన పెద్దమ్మ తల్లి ఆడిపాడే జానపదం మొదలు సంప్రదాయ కూచిపూడి వరకు పిల్లల ఆటపాటలు చూపే వేదిక బాలోత్సవ్‌. రుద్రమదేవి మొదలు అల్లూరి వరకు చారిత్రక ప్రముఖులను నేటి తరానికి మరొక్కసారి గుర్తు చేసే సందర్భాన్ని కల్పిస్తుంది.  పిల్లలలో నైపుణ్యం వెలికితీసేందుకు, విద్యార్థి దశ నుంచే సమానత్వ స్ఫూర్తిని చాటేందుకు ఓ మహా యజ్ఞంలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా బాలోత్సవ్‌ జరుగుతూ వస్తోంది. ముప్పై ఏళ్ల కిందట కొత్తగూడెంలో మొదలైన ఈ పిల్లల పండుగ  తెలుగు నేలపై నలుదిశలా విస్తరించింది.. విస్తరిస్తోంది. వేదికలు మారుతున్నా, కొత్త నిర్వాహకులు వస్తున్నా  బాలోత్సవ్‌∙స్ఫూర్తి మారలేదు.. జోష్‌ తగ్గలేదు. 

కొత్తగూడెంలో మొదలు
బొగ్గుగని, థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఇతర పరిశ్రమలకు చెందిన అధికారులు, ఉద్యోగులు కలసి 1960లో రిక్రియేషన్‌ కోసం కొత్తగూడెం క్లబ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా క్లబ్‌ అంటే ఇండోర్‌ గేమ్స్, పేకాట అని పేరు పడిపోయింది. 1991లో ఈ క్లబ్‌ కార్యదర్శిగా డాక్టర్‌ వాసిరెడ్డి రమేశ్‌బాబు ఎన్నికయ్యారు. క్లబ్‌ అంటే ఉన్న ఓ రకమైన అభిప్రాయాన్ని చెరిపేసి కొత్తగా ఏదైనా చేయాలనే తలంపుతో 1991లో పట్టణ అంతర్‌ పాఠశాల సాంస్కృతికోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

పుస్తకాలతో కుస్తీ పడుతున్న పిల్లల్లో సృజనను వెలికి తీసేందుకు దీన్ని చేపట్టారు. కేవలం ఒక రోజు జరిగిన ఈ కార్యక్రమానికి  నాలుగు అంశాల్లో పోటీలు నిర్వహించగా.. కొత్తగూడెం టౌన్‌ నుంచి దాదాపు రెండు వందల మంది దాకా విద్యార్థులు పాల్గొన్నారు.గమ్మత్తేంటంటే అచ్చంగా పిల్లల కోసమే రూపొందిన ఈ  కార్యక్రమంలో చిన్నారుల ఆటపాటలు చూసి పెద్దలు సైతం రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను మరిచిపోవడం! 

పట్టణం నుంచి జాతీయ స్థాయికి
చిన్నారుల ఆటపాటలకు ఎంత శక్తి ఉందో ఆ ఒక్కరోజు కార్యక్రమంతో నిర్వాహకులకు అర్థమైంది. అందుకే మరుసటి ఏడాది మండల స్థాయిలో బాలల ఉత్సవాలను నిర్వహించారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ 1994కల్లా జిల్లా స్థాయికి, నూతన సహస్రాబ్దిని పురస్కరించుకుని 2000 నుంచి రాష్ట్ర స్థాయికి ఈ పోటీలు విస్తరించాయి. ఆ తర్వాత 2014 నుంచి అంతర్రాష్ట్ర స్థాయిలో ఈ వేడుకలు మొదలయ్యాయి.

ఆ బృహత్తర కార్యక్రమానికి చేయూతనివ్వడానికి సింగరేణి సంస్థతో పాటు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు ముందుకు వచ్చారు. స్థానికులు కూడా తమ వంతు సహకారం అందించారు.. ఆ ఉత్సవాల్లో పాల్గొనే పిల్లలు, తల్లిదండ్రులు, గురువులకు తమ ఇళ్లల్లో ఆశ్రయం ఇస్తూ!

పాతికేళ్ల ప్రస్థానం
1991లో నాలుగు అంశాల్లో 200 మందితో మొదలైన వేడుకలు 2016లో కొత్తగూడెం క్లబ్‌ వేదికగా చివరిసారి ఉత్సవాలు జరిగే నాటికి పద్నాలుగు వందల పాఠశాలల నుంచి ఇరవై రెండువేల మంది ఈ వేడుకల్లో భాగమయ్యే వరకు చేరుకుంది. స్థానికులే కాదు వివిధ రాష్ట్రాల్లోని పిల్లలు సైతం ఎప్పుడెప్పుడు ఈ పోటీల్లో పాలు పంచుకుందామా అన్నట్టుగా ఎదురు చూసే విధంగా బాలోత్సవ్‌ పేరు తెచ్చుకుంది.

మొబైల్, ఇంటర్నెట్‌ జమానాలోనూ తన ప్రభను కోల్పోలేదు. 2016 తర్వాత వివిధ కారణాలు, కరోనా సంక్షోభం వల్ల కొత్తగూడెం క్లబ్‌ ఈ బాలోత్సవ్‌ వేడుకలకు విరామం ఇచ్చింది. అయినప్పటికీ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే అద్భుతమైన ఈవెంట్‌గా అనేక మందికి ఈ బాలోత్సవ్‌ స్ఫూర్తిగా నిలిచింది. 

సమతా భావన
బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి చెందిన తాళ్లూరి పంచాక్షరయ్య 1950వ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నిజాం పాలన, స్వాతంత్య్రానంతర అభివృద్ధిని చూశారు.. చూస్తున్నారు. ఎన్ని మార్పులు జరిగినా మనుషుల మధ్య కుల,మత, పేద,ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు ఎంతకీ తగ్గకపోవడం ఆయన్ని  కలచి వేసింది. అందుకే  విద్యార్థి దశలోనే సమానత్వ భావనను పిల్లల్లో పెంపొందించాలని ఆరాటపడ్డారు.

ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలోని  విద్యార్థులనే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలను సైతం ఆకర్షిస్తోన్న కొత్తగూడెం బాలోత్సవ్‌ ఆయన దృష్టిలో పడింది. దీంతో భద్రాద్రి బాలోత్సవ్‌కు 2009లో శ్రీకారం చుట్టారు.  పట్టణ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించాలని భావించినా జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాల నుంచి ఎంట్రీలు రావడంతో జిల్లా స్థాయి వేడుకలుగానే మారాయి ఇవి.

తొలిసారే ఏకంగా  2500 మంది విద్యార్థులు వ్యాస రచన, వక్తృత్వం, కథా రచన, చిత్రలేఖనం, విచిత్ర వేషధారణ, శాస్త్రీయ, లలిత కళలు వంటి వివిధ అంశాల్లో పోటీ పడ్డారు. మరుసటి ఏడాదికే భద్రాద్రి బాలోత్సవ్‌ కూడా రాష్ట్ర స్థాయి వేడుకల సరసన చేరిపోయింది. నవంబర్‌ 14 వచ్చిందంటే చాలు ఇటు కొత్తగూడెం అటు భద్రాచలంలో జరిగే బాలోత్సవ్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు ఉవ్విళ్లూరేవారు. అలా 2009 నుంచి 2016 వరకు కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లో భద్రాద్రి బాలోత్సవ్‌ వేడుకలు ఘనంగా జరుగుతూ వచ్చాయి.

ప్రైవేటుకు దీటుగా..
భద్రాద్రి బాలోత్సవ్‌లో వేడుకలకు విద్యార్థులు స్పందిస్తున్న తీరు అనేక మందిని ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్‌ యుగంలోనూ జానపద పాటలకు విద్యార్థులు ఆడిపాడటం, శాస్త్రీయ నృత్యరీతులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపించడం ప్రేక్షకులను ముచ్చటగొలిపేది. అంతేకాదు చిత్రలేఖనం, సైన్స్‌ఫేర్, క్విజ్‌ ఇలా అనేక విభాగాల్లో ఏ మాత్రం పరిచయం లేని పిల్లలు, వారి తల్లిదండ్రులు, గురువులు ఒకే చోట కలసిపోయే తీరు వేడుకలకు కొత్త వన్నెలు అద్దాయి.

ఈ ఉత్సాహంతో భద్రాద్రి బాలోత్సవ్‌ వేడుకల్లో కీలక భూమిక పోషించిన బెక్కంటి శ్రీనివాసరావు మరో అడుగు ముందుకు వేశారు.  ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులను బాలోత్సవ్‌ వేదిక మీదకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం అవార్డ్‌ విన్నింగ్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఆటా)ను ఏర్పాటు చేశారు. అలా ఉమ్మడి ఏపీలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డులు పొందిన టీచర్లు తమ పాఠశాల పరిధిలోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని భద్రాద్రి బాలోత్సవ్‌కు తీసుకురాసాగారు. 

ఈ క్రమంలో 2018లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా బెక్కంటి శ్రీనివాస్‌ చారిటబుల్‌ ట్రస్ట్, అవార్డ్‌ విన్నింగ్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఆటా) ఆధ్వర్యంలో బాలోత్సవ్‌ను నిర్వహించారు. కరోనా సంక్షోభం వచ్చిన 2020 మినహాయిస్తే ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. 2021లో ఈ వేడుకలను ఆన్‌లైన్‌లో జరిపారు. ఈసారి ఆటా బాలోత్సవాలు భద్రాచలంలో నవంబరు 12,13,14 తేదీల్లో జరుగుతున్నాయి.

మొత్తం 24 అంశాల్లో 44 విభాగాల్లో పోటీలుంటాయి. 6 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. సబ్‌ కేటగిరీలో 4 నుంచి 6 ఏళ్లు, జూనియర్‌ కేటగిరీలో 7 నుంచి 10 ఏళ్లు, సీనియర్స్‌ కేటగిరీలో 11 నుంచి 16 ఏళ్ల పిల్లలు పోటీ పడతారు. ముగింపు రోజైన నవంబరు 14న విజేతలకు బహుమతులు అందిస్తారు. అన్ని కేటగిరీల్లో ప్రవేశం ఉచితం. దేవస్థానం డార్మెటరీల్లో వసతి కల్పిస్తారు. మధ్యాహ్న భోజనం అందిస్తారు. ప్రత్యేకంగా గదులు కావాలి అనుకునేవారు దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న గదులను తక్కువ ధరకే పొందవచ్చు. 

రామదాసు కీర్తనలపై
ఈసారి బాలోత్సవ్‌లో పిల్లల చేత  రామదాసు కీర్తనలను ఆడిపాడించనున్నారు. నవంబరు 12వ తేదిన ప్రారంభ వేడుకలకు ముందు కూచిపూడి, భరతనాట్యం, గిరిజన సంప్రదాయ, జానపద కళలను అభినయించే విద్యార్థులంతా బృందంగా భక్తరామదాసు కీర్తనలను ఆలాపించనున్నారు. నర్తించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అంతర్జాతీయ స్థాయి కళాకారులైన డాక్టర్‌ మోహన్, డాక్టర్‌ రాధామోహన్‌ల చేత నవంబరు 13,14 తేదీల్లో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

గుంటూరు వేదికగా ప్రపంచ స్థాయిలో
పిల్లల వేడుకలకు సంబంధించి కొత్తగూడెం బాలోత్సవ్‌ ఓ బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. ఇలాంటి కార్యక్రమం తమ ప్రాంతంలోనూ చేపట్టాలనే ఆలోచనను కలిగించింది ఎంతో మందికి. వారిలో వాసిరెడ్డి విద్యాసాగర్‌ ఒకరు.  2017 నుంచి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – (నంబూరు గ్రామం, పెదకాకాని మండలం) గుంటూరు వేదికగా బాలల పండుగకు శ్రీకారం చుట్టారు.

ఉభయ రాష్ట్రాల్లోని విద్యార్థులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా బయటి దేశాల్లో ఉన్న తెలుగు చిన్నారులనూ భాగం చేస్తూ  ‘ప్రపంచ తెలుగు బాలల పండుగ – వీవీఐటీ బాలోత్సవ్‌ పేరు’తో ఈ వేడుకలను మొదలుపెట్టారు. కరోనాకు ముందు 2019 జరిగిన ఉత్సవంలో ఏకంగా 9,900ల మంది బాలలు భాగస్వాములు అయ్యారు. ఇందులో సగానికి పైగా పిల్లలు తెలంగాణ వారు కావడం మరో విశేషం. కరోనా కారణంగా 2020, 2021లలో వేడుకలను నిర్వహించలేదు.

ఈ ఏడాదికి నవంబర్‌ 12 నుంచి 14 వరకు వీవీఐటీ – గుంటూరు వేదికగా వేడుకలు జరగనున్నాయి. 29 అంశాల్లో 54 విభాగాల్లో పోటీలుంటాయి. గుంటూరు, విజయవాడ బస్‌ స్టేషన్ల నుంచి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. అదే విధంగా ఈ ఉత్సవంలో పాల్గొనే విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులకు వసతి, భోజన సదుపాయాలనూ అందిస్తున్నారు. ఎన్నారైల పిల్లల పాటలు, నృత్య రూపకాలను ఈ బాలోత్సవ్‌లో భాగం చేస్తున్నారు. అలా పల్లె స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు.. విదేశాల్లో ఉన్న విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్రయత్నం బాలోత్సవ్‌లో మాత్రమే జరుగుతోంది.

కాకినాడలో క్రియా చిల్డ్రన్‌ ఫెస్టివల్‌
కాకినాడకు చెందిన ‘క్రియా సొసైటీ’ ఆధ్వర్యంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో 2002 నుంచి ప్రతిఏడూ పిల్లల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే 2011లో కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు స్కూలు విద్యార్థులకు కొత్తగూడెం బాలోత్సవ్‌ నుంచి ఆహ్వానం అందింది. విద్యార్థులతో పాటు క్రియా సొసైటీ సభ్యులు సైతం కొత్తగూడెం బాలోత్సవ్‌కు వచ్చారు.

ఒకే  చోట వందలాది పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, వారి టీచర్లు, తల్లిదండ్రులు ఒకే వేదిక మీద కలవడం.. పిల్లలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం..  పగలు, రాత్రి తేడా లేకుండా ప్రదర్శనలు జరగడం చూసి సంబరపడ్డారు క్రియా సభ్యులు. దీంతో మరు ఏడాది కూడా బాలోత్సవ్‌ నిర్వాహణ తీరు తెన్నులను పరిశీలించారు.

ఆ తర్వాత ఏడాది నుంచి ‘క్రియా చిల్డ్రన్‌ ఫెస్టివల్‌’ పేరుతో జేఎన్‌టీయూ – కాకినాడ క్యాంపస్‌లో పిల్లల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్‌ వంటి పోటీలు మొదలుపెట్టారు.  త్రొలిసారిగా 2013లో మూడు వందల పాఠశాలల నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు హాజరవగా గతేడాది ఐదు వందల పాఠశాలల నుంచి పదివేల మంది వరకు వచ్చారు. ఈ ఏడాది నవంబరు 19, 20 తేదీల్లో జేఎన్‌టీయూ కాకినాడ క్యాంపస్‌లో క్రియా చిల్డ్రన్‌ ఫెస్టివల్‌ జరగనుంది.

విశాఖలో
కొత్తగూడెం బాలోత్సవ్‌ ప్రేరణతోనే వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా 2013లో విశాఖ బాలోత్సవ్‌ను నిర్వహించారు. ఆ తర్వాత 2019లో అచ్చంగా కొత్తగూడెం తరహాలోనే భారీ ఎత్తున ఇటు స్టీల్‌ ప్లాంట్, ఆంధ్రా యూనివర్సిటీ..  ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల ఆవరణలో విశాఖ బాలోత్సవ్‌ను నిర్వహించారు. రెండు వేదికలకు సంబంధించి సుమారు ఏడు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది గిరిబాలోత్సవ్‌ పేరుతో అరకులోనూ వేడుకలు నిర్వహించారు. ఈ ఏడాదికి డిసెంబరులో విశాఖ బాలోత్సవ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి.  

తెలుగు నేలపై
2016లో.. కొత్తగూడెం బాలోత్సవ్‌ రజతోత్సవాలు జరిగాయి. వీటికి విజయవాడ కేంద్రంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే విజ్ఞాన కేంద్రం సభ్యులు హాజరయ్యారు. అదే ఏడాది విజయవాడలో విద్యావేత్తలు, మేధావులు, లాయర్లు, డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. చివరకు 2017న అమరావతి బాలోత్సవ్‌ పేరుతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. కరోనా సంక్షోభం సంవత్సరం  2020 మినహాయిస్తే ప్రతి ఏడాదీ అమరావతి బాలోత్సవాలు జరుగుతున్నాయి.

ఈ ఏడాది ఉత్సవాలు డిసెంబరు 16,17,18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇతర జిల్లాల్లోని విజ్ఞాన కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ 2018 నుంచి మచిలీపట్నంలో కృష్ణా బాలోత్సవాలు, ఏలూరులో హేలాపురి బాలోత్సవాలు మొదలయ్యాయి. ఇదే తరహాలో నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతిలలో కూడా బాలోత్సవాలకు బీజం పడింది. మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్‌లో డిసెంబరు 6,7 తేదీల్లో బాలోత్సవాలు జరగబోతున్నాయి. -టి. కృష్ణగోవింద్‌, సాక్షి ప్రతినిధి, కొత్తగూడెం

సరిహద్దులు చెరిపేస్తూ
కొత్తగూడెం క్లబ్‌ మొదలుపెట్టిన బాలోత్సవ్‌ ఆ తర్వాత పట్టణస్థాయి పండగగా మారిపోయింది. ఇలాంటి సంబురం ప్రతిజిల్లాలో జరిగితే బాగుండనిపించేది. ఇప్పుడు ఆ కల నెరవేరింది. సరిహద్దులు చెరిపేస్తూ తెలుగువారున్న ప్రాంతాలాకు చేరిపోతోంది. పదుల సంఖ్యలో బాలోత్సవాలు జరుగుతున్నాయి.
– వాసిరెడ్డి రమేశ్‌బాబు, (బాలోత్సవ్‌ కన్వీనర్‌)

ఒత్తిడి నుంచి లాగి.. 
ఈ పోటీ ప్రపంచంలో పిల్లలను చదువుల  ఒత్తిడి నుంచి కొంతైనా బయటకు లాగి వారిలో దాగిన సృజనను వెలికి తీసేందుకే కొత్తగూడెం బాలోత్సవ్‌ మొదలైంది. అలాంటి మహాత్తర కార్యక్రమానికి కొత్తగూడెం క్లబ్‌ విరామం ఇవ్వడంతో గుంటూరులో వీవీఐటీ చేపట్టింది.
– వాసిరెడ్డి విద్యాసాగర్‌

ప్రతిభను ప్రోత్సహించాలి
పాఠాలు చెప్పినందుకు మాకు జీతం ఇస్తున్నారు. సిలబస్‌కు మించి విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చిందనేది నా అభిప్రాయం. నాలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయలంతా ఒక వేదిక మీదకు వచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఆటా బాలోత్సవ్‌ను చేపట్టాం. 
బెక్కంటి శ్రీనివాస్‌

ఆ లోటు తీర్చేందుకే 
 బహుమతులు లేకపోయినా పర్వాలేదు కానీ ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహిస్తే పిల్లలు చాలా సంతోషిస్తారు. అందుకే 2002 నుంచి పిల్లలకు వివిధ అంశాల్లో పోటీలు పెడుతూ వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ వస్తున్నాం. కొత్తగూడెం బాలోత్సవ్‌ లోటును తీర్చేందుకే  క్రియా చిల్డ్రన్‌ ఫెస్టివల్‌ను జరుపుతున్నాం. 
– జగన్నాథరావు (క్రియా సొసైటీ, కాకినాడ)

నేను, మా అన్న 2020లో కాకినాడ క్రియా చిల్డ్రన్‌ ఫెస్టివల్‌కి వెళ్లాం. చాలా మంది ఫ్రెండ్స్‌ అయ్యారు. అక్కడ ఒక అన్న చేసిన ‘ఓరగేమీ’ క్రాఫ్ట్‌ హంస చాలా నచ్చింది. కొంతమంది మట్టితో ఎడ్ల బండి, ట్రాక్టర్‌లాంటి బొమ్మలు చేశారు. నాకు బాగా నచ్చాయి. స్కూల్లో లేనివెన్నో అక్కడ కనిపించాయి. అవన్నీ స్కూల్లో ఉంటే బాగుండు అనుకున్నాను. మన టాలెంట్‌ని అక్కడ చూపించుకోవచ్చు అనిపించింది. ఈసారి కూడా వెళ్తున్నాం. రన్నింగ్‌ రేస్, ఓరగేమీ క్రాఫ్ట్‌లో పార్టిసిపేట్‌ చేస్తా. 
– పి. రాజ దుహిత్‌, (ఆరవ తరగతి), హైదరాబాద్‌

వసతి కల్పించాను
కొత్తగూడెంలో బాలోత్సవ్‌ జరిగేటప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు అనేక సార్లు వసతి కల్పించాను. రజతోత్సవం తర్వాత బాలోత్సవ్‌ వేదిక కొత్తగూడెం నుంచి గుంటూరుకు మారింది. మా పాప సాహిత్య.. 2018లో సబ్‌ జూనియర్‌ కేటగిరీలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది.
– పవన్‌, (కొత్తగూడెం)

అప్పుడు విద్యార్థిగా.. ఇప్పుడు గురువుగా
2018లో భద్రాద్రి బాలోత్సవ్‌ వేడుకల్లో సీనియర్‌ కేటరిగిలో కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నా శిష్యులు పది మంది సబ్‌ జూనియర్, జూనియర్‌ కేటగిరీలో ప్రదర్శనలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
– సాయిలక్ష్మీ (భద్రాచలం)

ఎన్నటికీ మరువలేను  
నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు 2011లో బాలోత్సవ్‌ వేడుకల గురించి పేపర్‌లో చూసి హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్లి కూచిపూడి ప్రదర్శన ఇచ్చాను. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అందులో నాకు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, దుబాయ్, రష్యాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాను. బాలోత్సవ్‌ను ఎన్నటికీ మరువలేను.
– పీవీకే కుందనిక (హైదరాబాద్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement