కేరెంటింగ్
సుద్దాల అశోక్‌తేజ
‘పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల గుండెల్లో వారి స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే! భవిష్యత్తుకు భరోసాగా నిలిచే ఈ తరం పిల్లల పెంపకంలో ఎప్పుడూ అశ్రద్ధగా ఉండకూడదు.’ అంటారు సినీ గీతరచయిత సుద్దాల అశోక్‌తేజ. పిల్లల పెంపంకంలో ఎదురయ్యే సాధకబాధకాల గురించి ఆయన పంచుకున్న ముచ్చట్లు...
‘జోలాలి జోలాలి జోలాలి.. జోల పాడుతా బజ్జో నా తల్లి / నిదుర తల్లిని బతిమలాడని .. నీలి కళ్లలో నిదురపొమ్మని/ రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో..’
ఇది నేను రాసిన సినిమా పాట. నిజానికి రాత్రివేళల్లో పిల్లలను జోకొడుతూ నిద్రపుచ్చితే, పిల్లలు చెప్పే విషయాలు వింటే.. వారు ఎంతో భరోసాగా ఫీలవుతారు. ఎన్ని పనులున్నా తల్లిదండ్రులు చేయాల్సిన పని రోజులో కొంతసేపు పిల్లలతో గడపడం.
నాకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులు. వారు పుట్టే సమయానికి మేం కడు పేదరికంలో ఉన్నాం. నాకు ఉద్యోగం లేదు. నా భార్య నిర్మల మిషన్ కుట్టేది, బీడీలు చుట్టేది. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా మేడిపల్లిలో అతికష్టమ్మీద ప్రైవేట్‌స్కూల్ ప్రారంభించాను. అప్పుడు మా జీవనం కొంత మెరుగైంది. మా నాన్న హయాంలో కూడా ఆయనకు వచ్చేది కొద్దిపాటి ఆదాయమే. అయినా అంతా అందులోనే బతికాం. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా పిల్లల పెంపకంలో మా అమ్మనాన్నలు ఏం చేశారో, నేనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాను. మా అమ్మనాన్నలు మా దోసిట్లో పెట్టిన సాహిత్య దీపాన్ని మా పిల్లల చేతుల్లో పెట్టి, వెలిగించే ప్రయత్నం చేశాను. వాళ్లూ నా అంచనా మేరకు జీవితంలో చక్కగా స్థిరపడ్డారు.
చలం ‘బిడ్డల శిక్షణ’..
స్కూల్ నడుపుతున్న సమయంలో గవర్నమెంట్ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కణ్ణుంచి మా జీవనం మరికాస్త మెరుగైంది. ఇంటి పనులు, పిల్లల పనులు మా ఆవిడతో పాటు నేనూ కలిసి చేసేవాడిని. మా ఆవిడకు నేను చేసే పనులను చూసి, పిల్లలు కూడా ఇంటి పనుల్లో సాయం చేసేవారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చలం ‘బిడ్డల శిక్షణ’ పుస్తకం చదివింది. అది మా ఇంటి వాతావరణాన్నే మార్చేసింది.
పిల్లలు ఎంత అల్లరి చేసినా, ఎంత చిరాకు సృష్టించినా ఒక్కనాడు కూడా వారి మీద చిన్న దెబ్బ కూడా వేయకుండా పెంచింది. మా ఇంట్లో పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం అలవాటుండేది కాబట్టి, మా తమ్ముడు, చెల్లెలికి కథలు చెబుతుంటే మా పిల్లలు కూడా వినేవాళ్లు. ఇప్పుడు మా మనవలు, మనవరాళ్లకు మహాభారతం, భాగవతం చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. అప్పట్లో సెల్‌ఫోన్లు, టీవీలు లేకపోవడం వల్ల సామాజిక పరిస్థితులు కూడా నాకు సహకరించాయి. ఇప్పుడు నా పిల్లల పిల్లలు వచ్చేసరికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పిల్లలకు ‘చందమామ రావే.. ’ పాటలు, ‘చందమామ కథలు’ లేవు.
యాంత్రికంగా పరుగులు వద్దు
ఈ రోజుల్లో భార్యభర్తలు ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబం నడవని పరిస్థితులు వచ్చాయి. అందుకు ఇంట్లో అవసరానికి మించిన ఆడంబర వస్తువులూ వచ్చి చేరాయి. వాటి కోసం సంపాదన తప్పనిసరి అయ్యింది. కెరీర్ పరుగు పందెంలో జీవితాలు యాంత్రికం అయ్యాయి. స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు, గూగుల్‌కు పిల్లలను అప్పజెబుతున్నారు. డిజటల్‌లో ఏం చూసి నేర్చుకుంటున్నారో, అదే నేటి పిల్లలు.
పిల్లలతో ఆటలు మేలు
పిల్లల చిన్నప్పుడు వారితో ఆటలాడేవాడిని. ఉదయం వాకింగ్‌కు తీసుకెళ్లేవాడిని.. వారితో మాట్లాడే ఆ కాసేపు ‘నా తండ్రి నా వెనకాల ఉన్నాడు’ అనే ఫీలింగ్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా రోజూ కొంత సమయం గడిపితే పిల్లలు తప్పక మంచి స్థానంలో ఉంటారు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చు.
వంద పుస్తకాలు చదివినంత జ్ఞానం..
సెలవుల్లో మా అమ్మ దగ్గరకు పిల్లలను తీసుకొని వెళ్లేవాళ్లం. ఇంట్లో పెద్ద తినుబండారాలేమీ లేకపోయినా వేడి అన్నంలో చింతకాయ పచ్చడి కలిపి, పిల్లలందరికీ తనే గోరుముద్దలు పెట్టేది. ఆ సమయంలో సహస్ర శిరచ్ఛేద అపూర్వచింతామణి వంటి కథలన్నీ చెప్పేది. ఇప్పుడు చిన్నకుటుంబాలు పెరిగాయి. అలాగే, పెంపకంలో చింతనలు కూడా పెరిగాయి. ఇప్పటి పిల్లలు ‘బియ్యం చెట్లు ఎలా ఉంటాయి?’, ‘ప్యాకెట్ల నుంచే కదా పాలు వచ్చేవి’ అని అడుగుతుంటారు. వాస్తవానికి దూరంగా పిల్లలు పెరుగుతున్నారు.
పండుగల జీవన విధానం...
మన పండగలన్నీ మానవసంబంధాలను కాపాడే క్రమంలో ఏర్పాటు చేసినవే. పెసర గారెలు, బూరెలు, భక్ష్యాలు, నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు... ఇలా పండగలను బట్టి చేసే వంటలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇప్పుడు డబ్బు ఉంటుంది, అందుకు తగిన జంక్ ఫుడ్ సులభంగా లభిస్తుంది. ఫలితంగా పిల్లలకు సరిగ్గా విరేచనాలు కావు, రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. పిల్లల ఆరోగ్యం, లోకజ్ఞానం, పరిసరాల జ్ఞానం తప్పనిసరి. వీటిని ఈ రోజుల్లో సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
నిర్మలారెడ్డి


