breaking news
child rearing
-
ఆఫీసులో అమ్మ... ఇంట్లో బిడ్డ
ఐఏఎస్ అధికారిణి, ఇద్దరు పిల్లల తల్లి అయిన దివ్య మిట్టల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ‘నేను ఒక ఐఏఎస్ అధికారిణి ని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎమ్) బెంగళూరులో చదివాను. వీటిని సాధించడానికి చాలా కష్టపడ్డాను. కానీ, నా ఇద్దరు చిన్నారి కూతుళ్లను పెంచే క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఏదీ నన్ను సిద్ధం చేయలేదు..’ అంటూ ఆ పోస్ట్లో పేర్కొంది. ఇటీవల కాలంలో ఉద్యోగం చేసే అమ్మల శాతం పెరుగుతోంది. అదే సమయంలో పిల్లల పెంపకం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా అనే ఆందోళనా పెరుగుతోంది. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను నేటి తల్లులు ఎలా సమతుల్యతను సాధించాలో నిపుణులు సూచిస్తున్నారు.వయస్సుతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ‘అమ్మా’ అని పిలుస్తాం. ఈ పిలుపు తల్లీ బిడ్డ జీవితాంతం పంచుకునే అనుబంధానికి స్పష్టమైన సూచన. ప్రాచీన కాలం నుండి సమాజంలో మహిళలు పిల్లల సంరక్షకులుగా పరిగణించబడ్డారు. వారి విధి ఇంటికి, ఇంట్లోని వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యింది. దీంతో తల్లులు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలనే ఈ భావన పిల్లలను వారి జీవితాల్లో, అభివృద్ధిలో సురక్షితంగా ఉంచింది. నేడు సమాజంలో తల్లులు ఇంటి పనుల నిర్వహణలోనూ, పిల్లల సంరక్షణలోనూ రెండు పాత్రలను పోషిస్తున్నారు. పిల్లల సంరక్షణలో తండ్రుల వాటా పెరిగినప్పటికీ మహిళలు ఇప్పటికీ వారి ఇంట్లో మొదటి సంర క్షకులుగా ఉంటున్నారు.విజయవంతమైన మార్పుప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ గురించి చేసిన అధ్యయనాల్లో దాదాపు 73 శాతం మంది మహిళలు 30 ఏళ్ల వయసులో తమ పిల్లలను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను విడిచిపెట్టారని, 27 శాతం మంది కొంతకాలం తర్వాత తిరిగి వచ్చారని గమనించారు. వారిలో దాదాపు 16 శాతం మంది తమ వృత్తిపరమైన పని జీవితంలో అధికారులుగా ఉన్నారు. కాబట్టి తల్లులుగా ఉన్న మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను విజయవంతంగా మార్చుకుంటున్నారని కూడా స్పష్టమైంది.‘ఉద్యోగినిగా డబ్బు సంపాదిస్తూ పిల్లలకు కావల్సినవి సమకూర్చగలుగుతున్నాను. కానీ, వారిని సక్రమంగా పెంచగలుగుతున్నానా..’ అనుకునే తల్లులకు సాంకేతికత వరంగా మారింది. సమయానుకూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ను ఎంచుకోవచ్చు.సానుకూల ప్రభావాలు → ఉద్యోగ తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రెండు పని చక్రాలతో తమ జీవితాలు సజావుగా నడుస్తున్నట్టు చూస్తారు. ఉన్నత విద్యను పొందగల సామర్థ్యం, భౌతిక, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగల సామర్థ్యం కారణంగా వారు మరింత సంతృప్తికరమైన జీవితాలను గడుపుతారు. ఇప్పుడు ఉద్యోగాల్లోకి వెళ్లే మహిళలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, కెరీర్ అవకాశాలను సరైన ప్యాకేజీలతో అందుకుంటున్నారు. → హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం పనిచేసే తల్లుల కుమార్తెలు వారి తల్లులకంటే 23శాతం ఎక్కువ సంపాదిస్తారని తెలిసింది. మరోవైపు పనిచేసే తల్లుల కుమారులు బాధ్యతాయుతమైన పెద్దలుగా ఎదుగుతారు. వారి ఆఫీసుల్లో లింగ సమానత్వాన్ని ఇష్టపడతారు. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను గౌరవిస్తారు. వారు భవిష్యత్తులో తమ కుమార్తెలకు అద్భుతమైన తండ్రులుగా కూడా పెరుగుతారు.→ తమ తల్లి జీవితంలోని దుఃఖకరమైన రోజులనూ చూసి ఉంటారు. అంతేకాదు తమ తల్లి పట్టుదల, దృఢ సంకల్పం వారు మానసికంగా, ఆర్థికంగా తమ సామర్థ్యాల మేరకు తమను తాము ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. అన్నింటికంటే వారు హీరోలలో తమ తల్లిని ఒక షీ–రో గా చూస్తారు.మెరుగైన సమయ నిర్వహణ → పనిచేసే తల్లులు ప్రతిరోజూ తమ పిల్లలతో కనీసం ఒకటి లేదా రెండు గంటలు గడపగలిగేలా సమయాన్ని ప్లాన్చేసుకోవాలి. ఇది ఒక దినచర్యగా అనుసరించాలి. వేర్వేరు పనులను షెడ్యూల్ చేయడం, వాటిని సమయానికి పూర్తి చేయడం అనే మీ అలవాటు మీ పిల్లలు అదే అడుగు జాడల్లో నడవడానికి ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. → పిల్లలు టైమ్టేబుల్కు కట్టుబడి ఉండటానికి కూడా ప్రోత్సహిస్తుంది. పిల్లలు మీ పనిని పూర్తి చేయడంలో సహకరిస్తున్నందుకు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. → కాలక్రమంలో పిల్లల సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది వారి మెరుగైన జీవితానికి సహాయపడుతుంది. అంతేకాదు, పిల్లలతో మరింత నాణ్యమైన సమయాన్ని గడపడానికి సహాయపడుతుంది. రోజువారీ జీవన విధానంలో ముఖ్యమైన వాటికి సమయం ఇస్తూ, తమ పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ, చేస్తున్న పని గురించి పిల్లలకు క్లారిటీ ఇవ్వడం వల్ల మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. హద్దులు అవసరంపని, కుటుంబంతో పాటు వ్యక్తిగత అవసరాలకూప్రాముఖ్యం ఇవ్వండి. శారీరక, భావోద్వేగ శ్రేయస్సు కోసం స్వీయ సంరక్షణ అవసరం అనేది గుర్తుంచుకోవాలి. రోజులో పిల్లలకోసమే అన్నట్టుగా కొంత సమయం గడపండి. ఆ సమయంలో ఏదైనా పని నైపుణ్యాలు నేర్పించాలా, చదువు పట్ల దృష్టి పెట్టాలా, ఆనందంగా ఉంచడానికిప్రాధాన్యత ఇవ్వాలా.. ఇలా దేనికది బేరీజు వేసుకోవాలి. సహాయకులుగా ఉండేవారి మద్దతు ఎలా అందుతుందో చెక్ చేసుకోండి. వృత్తిపరమైన వృద్ధికి, తల్లి పాత్రకు విలువనిచ్చేవారిని సహాయకులుగా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. ప్రతి ఒక్కరూ పనులు చేసేలా, బాధ్యత తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. –ప్రొ÷. పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ నిపుణులుఅమ్మా, నువ్వే నా హీరో..నా పెద్ద కూతురికి 8 ఏళ్లు. ప్రపంచం గురించి ఇప్పటికే భిన్నమైన ఆలోచనలను చేస్తుంటుంది. ఎదిగే క్రమంలో ఆమె ఆలోచనల కాంతిని మసకబారనివ్వం. కొన్నిసార్లు పని ఒత్తిడిలో చాలా అలసిపోయినట్టుగా ఉంటుంది. ఆ అలసటలో ఏడుపు వచ్చేస్తుంటుంది కూడా. అలాంటప్పుడు నా కూతురు నన్ను కౌగిలించుకుని, ‘నువ్వు నా హీరోవి‘ అని చెబుతుంది. అంటే, పిల్లలు మనల్ని గమనిస్తారు. వారు మన వైఫల్యాల నుండి దృఢంగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. పడిపోవడం సహజమే అని ఆమెకు చూపించండి, ఆపై లేవండి. నా ఉద్యోగం నాకు ఇది నేర్పింది. ఏది జరిగినా నువ్వు స్థిరంగా ఉంటావని చూపించండి. మాతృత్వంలో తమకు తాము వేసుకునే ప్రశ్నల్లో కొంత అపరాధ భావనతో నిండి ఉంటాయి. నేను పిల్లలకు సరైనదే ఇస్తున్నానా, ఏమైనా తప్పులు చేస్తే.. ఇలాంటివి తలెత్తుతుంటాయి. కానీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ సొంత మార్గంలో ప్రయాణిస్తూ ఆమె దేనినైనా వెంబడించగల ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని గుర్తించాలి. తనను తాను క్షమించుకుంటూ ముందుకు సాగడం కూడా చాలా ముఖ్యం. మీకు ఒకరి కంటే పిల్లలు ఎక్కువమంది ఉంటే ఆ బాధ్యత పది రెట్లు పెరుగుతూనే ఉంటుంది. అందుకని, పిల్లలను ప్రేమించడం కంటే కూడా న్యాయంగా ఉండడటం ముఖ్యం. – దివ్యా మిట్టల్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మగపిల్లల పెంపకం
సాధారణంగా పెంపకం విషయంలో ఆడపిల్లలకి ఎన్నో జాగ్రత్తలు చెప్పటం చూస్తాం. మగపిల్లలకి చెప్పవలసినది ఏమీ లేదని చాలా మంది అభిప్రాయం. ఈ కారణంగానే సమాజంలో ఎన్నో అయోమయ పరిస్థితులు, అలజడులు, అరాచకాలు. ముఖ్యంగా ఆడపిల్లలకి సమాజం మీద ఏవగింపు, కోపం, పురుషద్వేషం పెరిగి అవాంఛనీయ సంఘటనలకి దారి తీయటం జరుగుతోంది. అమ్మాయిలు విప్లవభావాల పట్ల ఆకర్షించబడటం, పెళ్లి చేసుకోవద్దు అనుకోటం, చేసుకున్నా విడాకులు తీసుకోవటం, కుటుంబాలు విచ్ఛిన్నం కావటం, లేదా అమ్మాయిలనే పెళ్లి చేసుకోవటమో, సహజీవనం చేయటమో జరుగుతోంది. ఇవన్నీ కొంతవరకైనా అదుపులో ఉండి సమాజంలో సమరసత ఉండటానికి మగపిల్లలని సరిగా పెంచటం ప్రధానం. మన తరువాతి తరం వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? అని కాస్త వివేచన చేస్తే ... అమ్మో! ఎంత భయం వేస్తుందో! మన ప్రవర్తన ద్వారా నేర్పే విషయాలే కాదు, మన మాటలు, ఆదేశాలు, ఉపదేశాలు, బోధలు మొదలైనవి కూడా తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఆడ, మగ వివక్ష ఇంట్లోనే మొదలవుతుంది. ఆడపిల్ల పుట్టిందనగానే ముందుగా ‘‘అయ్యో!’’ అనేది తల్లే. పెంపకంలోనూ తేడా చూపిస్తారు. ఉదాహరణకి ఇంట్లో అమ్మాయిని తల్లే అంటుంది ‘‘ఆడపిల్లవి నీకెందుకు?’’ అని. అంటే ఆడపిల్ల కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. అవసరం లేదు. కొడుకు కూడా కొన్ని పట్టించుకోకూడదు. కానీ అవి వేరు. అవి ఇంటి విషయాలు, వంటవిషయాలు మొదలైనవి. ఇంక కొన్ని కుటుంబాలలో ఆస్తిపాస్తులు పంచి ఇవ్వటం మాట అటుంచి కూతురిని ఇంటిపని చెయ్యమని, కొడుకుని చదువుకోమని చెప్పేవారు కనపడుతూనే ఉన్నారు. ఇద్దరినీ సమానంగా చూడటం ఎట్లా కుదురుతుంది? ఆడపిల్లలు కొంచెం నాజూకుగా ఉంటారు, మగపిల్లలు కాస్త మొరటుగా ఉంటారు కదా! అనిపించటం సహజం. సమానత్వం అంటే వారి పట్ల ప్రవర్తించే తీరు సమానంగా ఉండటం. వారికి ఇష్టమయినవి, వారి అభిరుచులకు తగినవి అందించటం. నిజానికి మగపిల్లలైనా ఏ ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు, లక్ష్యాలు ఉండవు కదా! ఒకరికి ఇంజనీరింగ్ ఇష్టమైతే మరొకరికి వైద్యవృత్తి ఇష్టం, వేరొకరికి వ్యవసాయం మీద మక్కువ ఉండవచ్చు. వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వటం తల్లితండ్రుల కర్తవ్యం. అదే ఆడపిల్లల విషయంలో కూడా పాటించాలి. ఇదిప్రోత్సాహం మాత్రమే. అసలు చేయవలసినది మగపిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆడపిల్లలని గౌరవించటం నేర్పాలి. ఇది తండ్రి ప్రవర్తన వల్ల కలుగుతుంది. తండ్రి తల్లిని గౌరవిస్తూ ఉంటే కొడుకు కూడా తల్లిని, స్త్రీలని గౌరవిస్తాడు. చీటికి మాటికి భార్యని భర్త చులకన చేస్తూ ఉంటే కొడుకుకి ఆడవారిని తక్కువగా చూడటం అలవాటు అవుతుంది. తరువాతి కాలంలో ఈ భావం సరి అవటం కష్టం. ఇటువంటి పెంపకంలో పెరిగిన వారే ఆడపిల్లలని ఏడిపించటం నుండి యాసిడ్ దాడులు, అత్యాచారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఏ ఇంట్లో తండ్రి తల్లిని అగౌరవపరచడో, ఆడపిల్లలని బరువుగా భావించ కుండా ఉంటారో ఆ ఇంట్లో పెరిగిన మగపిల్లలు తోటి ఆడపిల్లలతో మర్యాదగా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళు ఉన్న సమాజంలో మన ఆడపిల్లలు కూడా భద్రంగా ఉంటారు. ప్రతి క్షణం ఆడపిల్ల, మగపిల్లవాడు అనే మాటని అని వారికి ఆ సంగతి గుర్తు చేస్తూ ఉండకూడదు. ఇంటి పనులన్నీ ఇద్దరి చేత సమానంగా చేయిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో ఆడ, మగ అందరు ఉద్యోగం చేస్తున్నారు. మగవారి బాధ్యత అయిన సంపాదించటంలో ఆడవారు భాగస్వామ్యం వహిస్తున్నప్పుడు, ఇంటి పనిలో మగవారు కూడా భాగస్వామ్యం వహించాలి అని చిన్నప్పుడే బుర్రకి ఎక్కించాలి. ముందు తిన్నకంచం తీయటం, వంటపనిలో సహాయం చేయటం అలవాటు చేయాలి. లేక΄ోతే కోడలు అత్తగారి పెంపకాన్ని తప్పు పడుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
అధికారం చలాయించొద్దు అభిమానంతో మెలగండి!
‘‘అమ్మ మంచిది కాదు. కొడుతుంది’’ ఆఫీసు నుంచి వచ్చిన తండ్రికి ఫిర్యాదు చేశాడు చిన్నూ. ‘‘నేను అమ్మని కొడతాలే’’ అన్నాడు సుధీర్ కొడుకుని బుజ్జగిస్తూ. లతకి కోపం వచ్చింది. ‘‘అల్లరి చేస్తే అమ్మ కొట్టదా! అనడం మానేసి, నన్ను కొడతానంటారేంటి’’ అంటూ విరుచుకుపడింది. దాంతో మరీ భయపడ్డాడు చిన్నూ. బల్లిలా తండ్రికి అతుక్కుపోయాడు. అమ్మ ఎందుకు చెయ్యి ఎత్తుతుందో అర్థం కాదు. ఏం చేస్తే కొడుతుందో తెలీదు. అందుకే అబద్ధాలు చెబుతుంటాడు. దాంతో మరో రెండు తగిలిస్తుంది లత. అలా ప్రతిదానికీ చెయ్యెత్తడం వల్ల అమ్మ అన్నిటికీ కొడుతుందని వాడి మనసులో ముద్ర పడిపోయింది. పిల్లల పెంపకం తెలియని తల్లిదండ్రులు ఉండరు. కాకపోతే పెంచే విధానంలోనే తేడా. కొందరు తిట్టి పెంచితే, కొందరు ప్రేమతోనే వారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఈ రెండిటిలో ఏది కరెక్ట్ అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే. కొన్నిదేశాల్లో పిల్లలను కొట్టడం నేరం. అందుకుగాను శిక్షలు అనుభవించిన పేరెంట్స్ గురించి మనం విని ఉన్నాం. పిల్లల్ని కొట్టే హక్కు తల్లిదండ్రులకు లేదా అని అడగడం కంటే, అసలు కొట్టాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న వేసుకోవడం అవసరమేమో! పిల్లలు అల్లరి చేస్తారు, విసిగిస్తారు. అయినా దెబ్బ వేయకపోవడమే మంచిదంటారు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ స్టెఫానీ జేమ్స్. పిల్లలను తప్పుదోవ పట్టించే మొదటి కారణం... భయమేనంటారు ఆమె. దండిస్తే తప్పు చేయడం మానేస్తారనుకోవడం పొరపాటు, దానిమూలంగా పిల్లలు తాము చేసిన తప్పును దాచిపెట్టే ప్రయత్నం చేస్తారని అంటారు. అది నిజమే కావచ్చు. మార్కులు తక్కువ వచ్చాయని తెలిస్తే అమ్మ తంతుందని, తండ్రి తిడతాడని భయమేసి ప్రోగ్రెస్ కార్డును దాచేస్తారు. పిల్లలు కదా అని వారి మీద హక్కును, అధికారాన్ని చలాయించే బదులు... ఇది మంచి, ఇది చెడు అని విశ్లేషించి, ఇంకోసారి ఇలా చేయకూడదని చెబితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, ఆ పాజిటివ్ ఫీలింగ్ పిల్లలను పక్కదోవ పట్టకుండా కాపాడుతుందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే... పిల్లల మీద తల్లిదండ్రుల్లా పెత్తనం చేయకుండా, స్నేహితుడిలా అన్నిటినీ పంచుకోవాలి. ఏ తల్లిదండ్రులకైనా కావలసింది పిల్లల సంతోషం, క్షేమమే కదా!