సాగుబడి: అల్లిపండు ప్రయోజనాలెన్నో...! | Sagubadi Nutritional Benefits of Alli Pandu | Sakshi
Sakshi News home page

సాగుబడి: అల్లిపండు ప్రయోజనాలెన్నో...!

May 29 2026 8:42 AM | Updated on May 29 2026 2:43 PM

Sagubadi Nutritional Benefits of Alli Pandu

అల్లి పండుకు ఔషధ చెట్టుగా గుర్తింపు ఉంది. సామాన్యంగా దీన్ని కాయం, డెలెక్‌ బంగాస్, డెలక్‌ ఏర్, నెమారు అని అంటారు. ఈ చెట్టు గుత్తులుగా పర్పుల్‌ రంగు పూలు పూస్తుంది. ఈ చెట్లు సామాన్యంగా ఫిబ్రవరి–మార్చి నెలల్లో పూత పూస్తాయి. ప్రాంతాన్ని బట్టి కొంత వ్యత్యాసం ఉండవచ్చు. ఈ చెట్టు ఎక్కువగా ఒక సంవత్సరం పూస్తే ఒక సంవత్సరం పూయదు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రతి సంవత్సరం పూస్తుంది. ఈ చెట్టు పూత మీద ఉన్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది.

వాడుక భాషలో అల్లి పండు పేరు:
ఇంగీష్‌ లో ఇరన్‌ వుడ్‌. ఒరియాలో నెమరు. కన్నడలో ఒళ్ళయకడి, అరచటే, అలమారు, ఉడి తల్లీ, కన్నవు. తమిళంలో కాయంపు, సిరుగస. తెలుగులో అల్లి చెట్లు. మరాఠీలో అంజనీ, ఆంజన్‌. మలయాళంలో కన్నావ్, కాయాబూ, కసవు. హిందీలో అంజన్‌. సంస్కృతంలో అంజన్‌ అని అనిపిలుస్తారు.

పూత:
ఫిబ్రవరి – మార్చి వరకు

పండ్లు:
అక్టోబర్‌ – నవంబర్‌ వరకు

15 మీటర్ల ఎత్తు: 
అల్లి చెట్లు మధ్యస్థంగా దాదాపు 15–22 మీటర్ల ఎత్తు పెరిగి సతతహరితంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో నేల స్వభావాన్ని బట్టి ఒక మోస్తరుగా పెరుగుతుంది. నల్లమలలో మాత్రం దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు అల్లి చెట్లు పెరిగాయి. అడవుల్లోని కాలువలు, వంకల దగ్గర ఈ చెట్లు ఉంటాయి. ఇవి సముద్ర మట్టానికి దాదాపు 1400 మీటర్ల ఎత్తుప్రాంతాల్లో కూడా పెరుగుతాయి.

స్వస్థలం: 
అల్లి చెట్ట నివాసం (స్వస్థలం) భారతదేశం. వీటి ఉనికి థాయిలాండ్, శ్రీలంక, మైన్మార్, కంబోడియా, లాఓస్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ తదితర దేశాల్లోనూ ఉంది. మన దేశంలో మాత్రం దక్కను పీఠభూమిప్రాంతంలో అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాల్లో ఉంది. నల్లమల అడవుల్లో అల్లి చెట్లు ఒకప్పుడు విస్తారంగా ఉండేవి. కానీ వాటి ఉనికి తగ్గుతుందనవచ్చు. ఈ చెట్టు ఎన్నో ఔషధగుణాలు కలిగినది.

ప్రయోజనాలెన్నో...

  • వీటి ఆకుల నుంచి పసుపు రంగు(డ్రై)ని తయారు చేసి అద్దకాలలో వాడుతారు (థాయిలాండ్‌).

  • నలుపు రంగుకి మారిన పండ్లు చాలా రుచిగా ఉంటాయి. గిరిజనులతో పాటు ఆప్రాంత ప్రజలు ఎక్కువ ఇష్టంగా తినే పండ్లలో ఇది ఒకటి.

  • కలప గట్టిగా ఉండటం వల్ల చిన్న చిన్న వ్యవసాయ పనిముట్ల తయారీకి వాడతారు.

  • మోడుబారిన చెట్లు వంట చెరకుగా బాగా ఉపయోగపడతాయి.

  • బొగ్గు తయారీలో కూడా కలపను వాడతారు.

  • ఈ చెట్ల భాగాలను ఆయుర్వేదం, సిద్ధవైద్యం, నాటు వైద్యంలో వాడతారు.

  • గనేరియా రోగాన్ని తగ్గించచటానికి వీటి ఆకులను ఇతర పదార్థాలలో కలిపి పైపూతకు వాడతారు.

  • దీని వేరు, మానులోని చేవను కలిపి చేసిన కషాయాలను చలి జ్వరం, చికెన్‌ ఫాక్స్, మీజిల్స్‌ జబ్బులను తగ్గించడానికి వాడతారు.

  • అల్లి చెట్లు జీవవైవిధ్యానికి పెట్టింది పేరు.

  • అల్లి చెట్టుపై అనేక ప్రయోగాలు జరిగాయి. ముఖ్యంగా ఆకులు, వేర్లు, కాండంపై పరిశోధనలు జరిగాయి. ఈ పండ్లలో ఉండే పోష విలువలను గూర్చి విశ్లేషణ అరుదు.

  • ఈ పండ్లలో విటమిన్లు, ్రపోటీన్లతో పాటు స్థూల, సూక్ష్మ మూలకాలు ఉంటాయి. వీటిపై అధ్యయనం ఎంతైనా అవసరం.

  • వీటి ఆకులలో మాత్రం కొవ్వు, పీచు పదార్ధం క్రూడ్‌ ప్రోటీన్లు, పిండి పదార్థాలు, సూక్ష్మ, స్థూల పోషకాలు ఉంటాయి. అందువల్ల వైద్య రంగంలో ఎంతో ఉపయోగకారిణి ఈ చెట్టు.

  • ఇంతటి వైవిధ్యమైన ప్రయోజనాలున్న ఈ చెట్టు జీనస్‌లో ఎన్నో జాతులు ఉన్నందున, పరిశోధనలు జరిపి చక్కటి రకాలను అభివృద్ధి చేయొచ్చు.

  • నల్లమల అడవుల్లో అన్ని చోట్లా ఈ పండ్ల చెట్లు లేవు. కాబట్టి, వీటి ఉనికిని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉన్నది.


- డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త,
ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌. మొబైల్‌: 94407 08924

- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement