రూ.500 లంచం... 36 ఏళ్లు పోరాటం... ఏడాది జైలు | Rs 500 bribery case brought to closure after 36 years | Sakshi
Sakshi News home page

రూ.500 లంచం... 36 ఏళ్లు పోరాటం... ఏడాది జైలు

Apr 5 2026 12:03 AM | Updated on Apr 5 2026 12:03 AM

Rs 500 bribery case brought to closure after 36 years

అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తిమింగలాలతో పోలుస్తారు. తాజాగా అనకొండలను చేర్చారు. ఏ జంతువుతో పోల్చినా, కేసులు నమోదు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ శాఖల్లో ‘పైసా వసూల్‌’ కానిదే  ఫైలు కదలదు, పని జరగదు. లంచం తీసుకోవడం తమ ప్రాథమిక విధుల్లో భాగమని, ఇవ్వడం ప్రజల బాధ్యతని కొంతమంది ఉద్యోగులు భావిస్తుంటారు. అంటే, ‘డ్యూటీకి వచ్చినందుకు జీతం... పనిచేయాలంటే లంచం’ మెజార్టీ ఉద్యోగులు ఇలానే ఉన్నారు. అడిగింది ఇచ్చేదాకా వేధిస్తుంటారు. అడ్డంకులు సృష్టిస్తుంటారు. అయితే, అందరూ వీటిని భరించరు. హక్కుగా పొందాల్సిన సేవలకు లంచం ఇవ్వరు. అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తారు. లంచగొండులను పట్టిస్తారు. ఇలా ఓ ఉద్యోగి దొరికాడు. కేసులో ఇరుక్కున్నాడు. చిన్న మొత్తమే కదా బయట పడతాననుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగాయి, ఏళ్లు గడిచాయి. చివరికి న్యాయం గెలిచింది. అవినీతికి శిక్ష ఖరారైంది. కానీ చాలా ఆలస్యమైంది.

అది 1990... ఉత్తరాఖండ్‌లోని ఉద్ధమ్‌సింగ్‌ నగర్‌కి  చెందిన రాజ్‌బహుదూర్‌ సింగ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌. ఓ గ్రామంలో తనిఖీలకు వెళ్లాడు. అక్రమ మద్యం ఉందంటూ ఓ వ్యక్తితో బలవంతంగా కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. లంచంగా రూ. 500  డిమాండ్‌ చేశాడు. అడిగింది ఇవ్వకపోతే కేసు కోర్టుకు పంపుతానని బెదిరించాడు. వేధింపులు భరించలేక వ్యాపారి విజిలెన్స్‌ శాఖ ఎస్పీని కలిశాడు. జరిగింది చెప్పాడు. దీంతో వలపన్నారు. కానిస్టేబుల్‌ను రెస్టారెంట్‌కు రప్పించారు. డబ్బు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. 

మూడు కోర్టులు... ముప్పయ్యారేళ్లు
తొలుత ట్రయల్‌ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇద్దరు ప్రధాన సాక్షులను విచారించింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్‌ 7, సెక్షన్‌ 13(2) కింద మార్చి 2006లో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్లు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించింది.  ఈ కోర్టులో కేసు 16 ఏళ్లు నడిచింది. ఈ తీర్పుపై నిందితుడు ఉత్తరాఖండ్‌ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు కొట్టేయాలని అభ్యర్థించాడు. ఆరేళ్లు కేసు నడిచింది. ఏప్రిల్‌ 2012లో హైకోర్టు ఆ అప్పీల్‌ను తిరస్కరించింది. ట్రయల్‌ కోర్టు తీర్పును సమర్థించింది. 

‘సుప్రీం’కు చేరిన కేసు
హైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కేసు కొట్టేయాలని వేడుకున్నాడు. వాయిదాలతో 14 సంవత్సరాలు కేసు కొనసాగింది. 2012 ఆగస్టులో మొదటిసారి  విచారణ జరిగింది. 21 సార్లు వివిధ బెంచ్‌ల ముందు విచారణకు వచ్చింది. ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. ‘సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన ట్రయల్‌ కోర్టు, హైకోర్టులు నిందితుణ్ణి దోషిగా తేల్చడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

అందువల్ల ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పు, దాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తన తీర్పులో స్పష్టం చేసింది.  కింది కోర్టు తీర్పును సమర్థిస్తూనే ‘నిందితుడికి ప్రస్తుతం 75 ఏళ్లు. అతడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్షను కనీస స్థాయికి తగ్గించవచ్చని మేం భావిస్తున్నాం’ అని తన ఆదేశంలో పేర్కొంటూ శిక్షను  ఏడాదికి పరిమితం చేసింది.గతంలో కొంత కాలం జైలులో ఉండడంతో మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. 

ఈ కేసులో తీర్పు ఆలస్యం అయింది. కానీ, న్యాయం గెలిచింది. తప్పుకు శిక్ష తప్పదని వెల్లడైంది. అయితే నాణేనికి ఇది ఒక వైపే! మరోపైపు చూస్తే, 40 ఏళ్ల వయసులో చేసిన నేరానికి 75 ఏళ్ల వయసులో శిక్ష పడింది. రూ. 500 లంచం తీసుకున్నందుకు చట్ట ప్రకారం శిక్ష ఖరారైంది. అవినీతి పరులను శిక్షించాల్సిందే కానీ, 36 ఏళ్ల  కాలానికి  విలువ కట్టేదెవరు?

  • దిలీప్‌ మాదిరెడ్డి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement