పరుగు ఆపితే... మెరుగైన లైఫ్‌! | Review of Slow Living by Vandana Shiva, Shreya Jani | Sakshi
Sakshi News home page

పరుగు ఆపితే... మెరుగైన లైఫ్‌!

May 29 2026 5:32 AM | Updated on May 29 2026 5:32 AM

Review of Slow Living by Vandana Shiva, Shreya Jani

జీవన విధానం

స్లో లివింగ్‌

బ్రష్‌... ఫోన్‌... టిఫిన్‌.. ట్రాఫిక్‌... మీటింగ్‌... జొమాటో... నెట్‌ఫ్లిక్స్‌... నిద్ర...మధ్యలో మనిషి ఎక్కడ? ప్రఖ్యాత పర్యావరణవేత్త వందన శివ అదే అడుగుతున్నారు...‘ఈ స్పీడ్‌లో పడి బతకడాన్నిమర్చిపోతున్నారా?’ వందనా శివ తాజా పుస్తకం ‘స్లో లివింగ్‌’ నవీన జీవన సూత్రాన్ని బోధిస్తోంది.పరుగు తగ్గించమని, భూమికి మేలు చేయమని హితవు చెప్తోంది.

‘ఆగండి. ఊపిరి పీల్చుకోండి. మీరు మిషన్ కాదు, మనిషి’ అంటున్నారు వందనా శివ. పర్యావరణ యోధురాలుగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వందనా శివ తన స్నేహితురాలు, పీస్‌ ఎడ్యుకేటర్‌ శ్రేయ జానీతో కలిసి రాసిన పుస్తకం ‘స్లో లివింగ్‌: వాట్‌ యూ కెన్‌ డూ అబౌట్‌ క్లయిమేట్‌ ఛేంజ్‌’ తాజాగా విడుదలై ఆలోచనలు రేకెత్తిస్తోంది. ‘నేటి మనిషి నిరంతర పరుగులో జీవన ఆనందాన్ని కోల్పోతున్నాడు. భూమిని ప్రమాదంలో నెడుతున్నాడు. 

నేటి మనిషి అన్నీ తొందరగా జరిగిపోవాలనుకుంటున్నాడు. అందుకే ఫాస్ట్‌ఫుడ్‌ తిని పొట్ట పాడు చేసుకుంటున్నారు. ఫాస్ట్‌ లైఫ్‌తో మనసు పాడు చేసుకుంటున్నారు. నిద్ర లేదు, నవ్వులేదు, నాన్నతో మాట్లాడే టైమ్‌ లేదు, అమ్మ చేతి ముద్ద రుచి తెలియదు, చివరికి సంపాదించింది హాస్పిటల్‌ బిల్లులకి సరిపోతుంది. అందుకే నెమ్మదిగా బతకండి. దాని వల్ల భూమి కూడా ప్రాణం పోసుకుంటుంది’.... అనే సారం అందజేస్తోంది ‘స్లో లివింగ్‌’ పుస్తకం. 73 ఏళ్ల వందనా శివ మనిషినీ, భూమినీ కాపాడుకోవడానికి ‘స్లో లివింగ్‌’ను ప్రతిపాదిస్తున్నారు.

మనిషి స్పీడ్‌ వల్ల ఏమైంది?
ఐ.ఎం.డి.లెక్కల ప్రకారం 2026లో హీట్‌ వేవ్స్‌కి వందల మంది చనిపోయారు. వానలు రావడం లేదు. కారణం? మన ఫాస్ట్‌ లైఫ్‌. ఎక్కువ కొనడం, ఎక్కువ పడేయడం, ఎక్కువ కాలుష్యం సృష్టించడం. ఫ్యాక్టరీలు నీళ్లని పాడు చేస్తున్నాయి. పండించే తిండిలో ముప్పై శాతం వేస్ట్‌ చేస్తున్నాం. అది ఎనిమిది శాతం గ్లోబల్‌ ఎమిషన్స్ కి కారణమవుతోంది. ప్రతి దానికీ ప్లాస్టిక్‌ వాడటం వల్ల 2050 నాటికి సముద్రంలో చేపల కంటే ప్లాస్టిక్‌ ఎక్కువ ఉంటుంది.

 వన్యమృగాల ఆవాసాలను నాశనం చేయడం వల్ల గత యాభై ఏళ్లలో 300 కొత్త వ్యాధికారక క్రిములు వచ్చాయి. రెడీమేడ్‌ దుమారంలో ఉత్పత్తిదారులు బట్టలను వాడి పారేసేవిగా తయారు చేస్తూ రీసైక్లింగ్‌ వీలుగాని దిబ్బలను రాసి పోస్తున్నారు. అందుకే వందన శివ ‘ఆగు’ అంటున్నారు. ‘నెమ్మదించడం అంటే వెనక్కి వెళ్లడం కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవడం’ అంటున్నారు. ‘ఫాస్ట్‌ లివింగ్‌ ఎంత చేయగలవు అని నిలదీస్తుంది. స్లో లివింగ్‌ మరింతకాలం నిలబడేలా సాయం చేస్తుంది’ అంటారామె.

ఇది శ్రీమంతులకే పాఠమా?
మధ్యతరగతికి సవాలక్ష బాదరబందీలు. రోజుకి పన్నెండు గంటలు పనిచేస్తే తప్ప నాలుగువేళ్లు నోట్లోకెళ్లవు. ఇలాంటప్పుడు ‘స్లో లివింగ్‌’ సాధ్యమా? ఇది శ్రీమంతులకైతే సరేగాని అనుకోవచ్చు. కాని వందన శివ ‘స్లో లివింగ్‌’ అందరికీ అంటున్నారు. మధ్యతరగతికి స్లో లివింగ్‌ అంటే ఏమిటో చెప్తున్నారు.

→ ఇంట్లో కూరగాయల తొక్కు చెత్తలో వేయకుండా మొక్కకి వేయడం 
→ వారానికి ఒకసారి కారు కాకుండా సైకిల్‌ తొక్కడం 
→ ప్లాస్టిక్‌ కవర్‌ బదులు గుడ్డ సంచి పట్టుకెళ్లడం 
→ యాప్‌ తిండి మాని అమ్మ చేతి వంట తినడం 
→ పండగలకి, ఫంక్షన్లకి మాత్రమే కొత్త బట్టలు కొనడం. 

మిగతా టైం ఉన్నవి ఆల్టర్‌ చేయించుకోవడం... ‘మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌’ అంటే అమ్మచీరకి కొత్త బ్లౌజ్‌ కుట్టించుకోవడం. ఇవి చేయడానికి కోటీశ్వరుడు అవ్వక్కర్లేదు. కావాల్సింది ఒక్కటే – ఓపిక.

మాల్స్, మార్ట్‌ల నుంచి బయటపడండి
వీధి చివర పచారి కొట్టుకు వెళితే ‘పద్దు’ ఇచ్చి ‘ఇవి చాలు’ అంటాం. అదే మార్ట్‌కు వెళితే కనపడినవి అన్నీ బుట్టలో వేస్తాం. దీనిని ‘స్లో లివింగ్‌’ పుస్తకం కోరైటర్‌ శ్రేయ జానీ ‘కలోనియల్‌ జాయ్‌’ అంటారు. వలస పాలనలో మనం కొనడంలో ఆనందం వెతుక్కున్నాం. అదే అలవాటైంది. అది ‘కలోనియల్‌ జాయ్‌’. ఆ కృత్రిమ ఆనందం నుంచి అసలైన ఆనందంలోకి రావాలి. ‘డీకలోనియల్‌ జాయ్‌’ పొందాలి. స్థానిక ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, స్థానిక మనుషుల అనుబంధాలు... వీటిలోనే ఆనందం ఉందని తెలుసుకోవాలి. ఏసీ రూంలో కూర్చుని నెట్‌ఫ్లిక్స్‌ చూసినా రాని హాయి మొదటి వాన చినుకు అరచేతిలో పడితే వస్తుందని తెలుసుకోగలగాలి. అదే స్లో లివింగ్‌.
పెద్దలు చెప్పినా పుస్తకం చెప్పినా హెచ్చరిక ఒకటే... ‘అతి వేగం చంపుతుంది. నెమ్మది బతికిస్తుంది’.... మనల్నే కాదు. భూమిని కూడా.               

స్లో లివింగ్‌ అంటే?
స్లో లివింగ్‌ను వందనా శివ ఇలా నిర్వచిస్తున్నారు. 
→ తినే తిండి ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకోవాలి. ΄్యాకెట్‌ చూసి కొనడం కాదు, పొలం చూసి కొనాలి. రైతు దగ్గర కొనాలి. 
→ అనవసరంగా ఏదీ కావాలనుకోకూడదు. కొనే ప్రతి వస్తువు అవసరమా కాదా అని 10 సెకన్లు ఆలోచించాలి. 
→ ‘ఫాస్ట్‌ ఫ్యాషన్ ’ అంటే నాలుగుసార్లు వాడి పడేసే బట్టలు కొనకూడదు. 
‘స్లో ఫ్యాషన్ ’ ఫాలో కావాలి. అంటే అమ్మమ్మలా ఒక నాణ్యమైన చీరను 20 ఏళ్లు కట్టుకోవడం. 
→ భూమిని గౌరవించాలి. చెట్టు నరకడం కాదు, చెట్టు నాటాలి. నీళ్లని వృథా చేయడం కాదు, ఒడిసి పట్టాలి. 
→ మనతో మనం గడపాలి. ఫోన్  లేకుండా రోజైనా ఒక గంటైనా మనతో మనం గడపడం. కుటుంబంతో మాట్లాడాలి. ఆకాశం ఒకటుందని గుర్తు చేసుకుని దాని వైపు చూడాలి.

     – కె.

Advertisement
 
Advertisement
Advertisement