
పవిత్ర రమజాన్ చివరి దినాల్లో ఆచరించవలసిన ఆరాధనల్లో షబేఖద్ర్ బేసిరాత్రుల జాగరణ, ఏతెకాఫ్, ఫిత్రా ప్రధానమైనవి. చివరి బేసిరాత్రుల్లో విరివిగా ఆరాధనలు చేసి షబేఖద్ర్ ను పొందే ప్రయత్నం చేయాలి. ఈ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యి నెలలకన్నా శ్రేష్ఠమని పవిత్ర ఖురాన్ చెబుతోంది. అంటే షుమారు 83 సంవత్సరాల 4 నెలల ఆరాధన కన్నా అధికమన్నమాట. మానవుడి సగటు జీవితకాలంకన్నా ఎక్కువ. అలాగే ఏతెకాఫ్ కూడా చాలాగొప్ప ఆరాధనే. చివరి పదిరోజులు మసీదులోనే ఒక పక్కన చిన్న పరదా ఏర్పాటు చేసుకొని ఏకాంతంగా దైవారాధనలో గడపాలి.
నమాజులు, జిక్ర్, దైవనామ స్మరణ, పవిత్ర గ్రంథ పారాయణం, హదీసు గ్రధాలు తదితరధార్మిక ఆచరణలు తప్ప, ఏవిధమైన ప్రాపంచిక కార్యకలాపాలు చేయకూడదు. మానవ సహజ అవసరాలకు తప్ప మసీదునుండి బయటికి వెళ్ళకూడదు. ఏతెకాఫ్ ద్వారా దైవంతో బంధం పటిష్టమవుతుంది. దైవప్రేమ, దేవుని సామీప్యత ప్రాప్తమవుతుంది. అలాగే ఈరోజుల్లో ఫిత్రాలు కూడా చెల్లించాలి. ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ అన్నమాట.
‘సదఖయే ఫిత్ర్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధార్మిక పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ నెలలో విధిగా చెల్లించవలసిన దానం అన్నమాట. రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుండే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త (స) ఆదేశించారు.
ఫిత్రా దానంగా ఒక ‘సా’ అంటే పావుతక్కువ రెండు శేర్లు ఆహార దినుసులు పేదసాదలకు ఇవ్వాలి. మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఏ రూపంలో ఐనా ఇవ్వవచ్చు. ఫిత్రాలవల్ల రెండురకాల లాభాలున్నాయి. ఒకటి–రోజాలను ఎంత నిష్టగా పాటించినా, మానవ సహజ బలహీనత వల్ల ఏవో చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి పరిహారంగా ఈ ఫిత్రాలు ఉపయోగపడతాయి.
వీటివల్ల రోజాలు పవిత్రతను, పరిపూర్ణతను సంతరించుకొని స్వీకారభాగ్యానికి నోచుకుంటాయి.రెండు– ఫిత్రాలవల్ల సమాజంలోని పేద , బలహీనవర్గాలకు కాస్తంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారుకూడా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోగలుగుతారు. ఈకారణంగానే ప్రవక్తమహనీయులు ఫిత్రాదానాన్ని,‘నిరుపేదల భృతి ’ అన్నారు.
అందుకే ఫిత్రాను ఉపవాసులకే పరిమితం చేయకుండా, పరిధిని విస్తరించారు. ఉపవాసం ఉన్నా లేకపోయినా అందరూ ఫిత్రా చెల్లించాలని చెప్పారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే, అంతమంది తరఫున కుటుంబ యజమాని ఫిత్రా చెల్లించాలి. పండుగ కంటే ముందు జన్మించిన శిశువు తరఫున కూడా తల్లిదండ్రులు ఫిత్రా చెల్లించాలి.
పండుగ కంటే ముందే ఈ బాధ్యత నెరవేర్చుకోవాలి. ముందు చెల్లిస్తే లబ్ధిదారులు పండుగ సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. పండుగ సంతోషంలో అందరినీ భాగస్వాములను చేయడమే అసలు ఉద్దేశ్యం. అల్లాహ్ అందరికీ రమజాన్ చివరి దశకాన్ని సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్