ట్రాప్ స్టోరీకి టాప్ ప్రైజ్ భారతీయ మహిళా జర్నలిస్టు 2026 పులిట్జర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. గుర్‌గ్రామ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సుపర్ణా శర్మ తన గ్రాఫిక్ నవల ‘ట్రాప్డ్’తో ఈ ఘనత సాధించారు. భారత్‌లో చోటు చేసుకుంటున్న ‘డిజిటల్ అరెస్ట్’లపై ప్రఖ్యాత అమెరికన్ మీడియా బ్లూమ్‌బర్గ్ కోసం తయారు చేసిన ‘ట్రాప్డ్’ గ్రాఫిక్ స్టోరీ పులిట్జర్ కమిటీని మెప్పించడంతో సుపర్ణా శర్మ పేరు భారత జర్నలిజంలో మార్మోగుతోంది.
ఒక మహిళా డాక్టర్‌కు డిజిటల్ స్కామ్‌స్టర్స్ నుంచి ఫోన్ వస్తుంది. ‘మీ పేరు మీద అకౌంట్స్ చాలా ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్‌లో ఫ్రాడ్ జరుగుతోంది. మిమ్మల్ని
డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం’...
ఆమె భయభ్రాంతం అవుతుంది. సీట్‌లో నుంచి కదలడానికి కూడా వీల్లేదు. అధికారులు స్క్రీన్ మీద కనపడుతుంటారు. ఆమె ఫోన్ మోగితే ఎత్తాలో కూడదో చెప్తుంటారు. స్క్రీన్ మీదే కోర్టు వస్తుంది. ఆ తర్వాత సి.బి.ఐ. ఆఫీసర్లు మాట్లాడతారు. ఆమె శిక్ష నుంచి తప్పించుకోవడానికి డబ్బు డి΄ాజిట్ చేయాల్సి వస్తుంది. నిరంతరం ఫోన్లు. క్షోభ. భయం. భీతి. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు... పది రోజుల నరకం తర్వాత ఆమె ΄ోలీసుల దగ్గరకు వెళితే అది ఫ్రాడ్ కాల్ అని అర్థం అవుతుంది.
దేశంలో ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉదంతాన్ని కళ్లకు కట్టినట్టుగా మాటలతో బొమ్మలతో చూపిన గ్రాఫిక్ స్టోరీ ‘ట్రాప్డ్’కే ఇప్పుడు పులిట్జర్ ప్రైజ్ అవార్డ్ వచ్చింది. దీనికి పని చేసిన జర్నలిస్టు సుపర్ణా శర్మ, బొమ్మలు వేసిన చిత్రకారుడు ఆనంద్ ఆర్.కె. ఈ అవార్డును ఉమ్మడిగా పొందారు.
న్యూరాలజిస్ట్ ‘ట్రాప్’
మన దేశంలో జరుగుతున్న డిజిటల్ మోసాలపై సుపర్ణా శర్మ సిద్ధం చేసిన 'trAPPed' { గ్రాఫిక్ స్టోరీలో టైటిల్‌లో 'APP' అక్షరాలను హైలైట్ చేసి అనేక యాప్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయకులను ఎలా మోసం చేస్తున్నారో హెచ్చరించారు. ఒక మహిళా న్యూరాలజిస్ట్‌కు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశామని భయభ్రాంతం చేసి డబ్బు లాగేసిన వైనాన్ని అమెరికా మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ బిజినెస్ వీక్ కోసం సుపర్ణా శర్మ గ్రాఫిక్ స్టోరీగా మలిచారు. ఇందుకు బొమ్మలను జర్నలిస్టు–ఇలస్ట్రేటర్ అయిన ఆనంద్ ఆర్.కె. సమకూర్చారు.
కాబట్టి పులిట్జర్ ప్రైౖ జ్ సుపర్ణా శర్మ, ఆనంద్ ఆర్.కె.కి దక్కింది. ప్రైజ్‌లో భాగమైన 15,000 డాలర్లు ఇద్దరికీ సమంగా చెందుతాయి. బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ నటాలీ ఓబికో పియర్సన్ ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా పనిచేశారు. డిజిటల్ మోసాలతో పెరుగుతున్న ప్రపంచ సవాళ్లను బొమ్మలు, మాటల మేళవింపుతో ఈ గ్రాఫిక్ స్టోరీ హైలైట్ చేస్తుందని పులిట్జర్ కమిటీ పేర్కొంది. పులిట్జర్ విజేతల ఫొటోలను కొలింబియా యూనివర్సిటీలో పెట్టి గౌరవించడం ఆనవాయితీ.
ఎవరు సుపర్ణా శర్మ?
సుపర్ణా శర్మ గత రెండు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు. ‘ది ఏషియన్ ఏజ్’ ఢిల్లీ, కోల్‌కతా, లండన్ ఎడిషన్లకు ‘రెసిడెంట్ ఎడిటర్’గా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లలో సీనియర్ పొజిషన్లలో పని చేశారు. ప్రస్తుతం రోలింగ్ స్టోన్ ఇండియా, అల్ జజీరా, బ్లూమ్‌బర్గ్ బిజినెస్ వీక్‌లకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు.
బాలీవుడ్‌లో పెయిడ్ రివ్యూ మాఫియాపై, చైల్డ్ కిడ్నాపింగ్ రాకెట్లపై ఆమె చేసిన ఇన్వెస్టిగేషన్లు జర్నలిజం వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆర్ట్స్, కల్చర్ బీట్‌లో ఉంటూనే, వ్యవస్థలోని లో΄ాలను ఎత్తి చూపడంలో సుపర్ణాశర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోవిడ్ సమయంలో ప్రభుత్వ విధానాలపై, న్యూఢిల్లీలో రైతుల నిరసన ఉద్యమంపై ఆమె విమర్శనాత్మక కథనాలు రాశారు. ‘మీటూ’ ఉద్యమ సమయంలో తన వృత్తిలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా బయటపెట్టారు.
ఆనంద్ ‘గీత’...
గ్రాఫిక్ స్టోరీకి బొమ్మలే జీవం. సుపర్ణా శర్మ రూపొందించిన trAPPed' M కథనంలో పోలీసుల వేషంలో వచ్చి సామాన్యులను బెదిరించి డబ్బు లాగేసే ముఠాల మోసాలను కళ్లకు కట్టినట్టు చూపించడం లో ఇలస్ట్రేటర్ ఆనంద్ ఆర్.కె. కీలక పాత్ర పోషించారు. సుపర్ణా శర్మతోపాటు పులిట్జర్ గెలిచిన ఆనంద్ ఆర్.కె. ముంబైకి చెందినవారు. 2011 లో సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి పట్టభద్రుడైన ఆనంద్, 2021లో ‘బ్లూ ఇన్ గ్రీన్’ గ్రాఫిక్ నవలకు గాను కలరిస్ట్ జాన్ పియర్సన్‌తో కలిసి ప్రతిష్టాత్మక ‘ఐస్‌నర్ అవార్డు’ను బెస్ట్ పెయింటర్/మల్టీమీడియా ఆర్టిస్ట్ విభాగంలో గెలుచుకున్నారు. Grafity's Wall', 'Radio Apocalypse', 'Resurrection Man' వంటి ఇంటర్నేషనల్ గ్రాఫిక్ బుక్స్‌ను తన ఖాతాలో కలిగి ఉండటంతో పాటు హ్యుందాయ్, ఇండియన్ నేవీ వంటి సంస్థలకు కూడా ఆయన విజువల్స్ అందించారు. 'trAPPed' స్టోరీకి ఆనంద్ అందించిన విజువల్సే పులిట్జర్ కమిటీని ఆకట్టుకున్నాయి.


