
అరటి చెట్లకు నాలుగు వైపులా టేపులు కట్టి గాలుల నుంచి రక్షణ
కర్ణాటకలో వినూత్న పద్ధతిలో అరటి సాగు చేస్తున్న తెలుగు యువ రైతు సురేష్
ఎకరానికి టేపుల ఖర్చు రూ. 12 వేలు మాత్రమే!
అరటి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రైతులకు పెనుగాలులు తీవ్ర నషాన్ని కలిగిస్తూ ఉంటాయి. లక్షలు పెట్టుబడి పెట్టి పెంచిన అరటి తోటల్లో కొద్ది రోజుల్లో గెలలు కోతకు వచ్చే దశలో సుడిగాలులు, తుపాన్లకు విరిగి పడిపోతే రైతులకు నూటికి నూరు శాతం నష్టం జరుగుతుంది. వెదురు బొంగుల ఊతంతో అరటి చెట్లకు గాలుల నుంచి రక్షించుకునేందుకు రైతులు విఫలయత్నం చేస్తూ వుంటారు. అయితే, కర్ణాటకలో అరటి తోటలు సాగు చేస్తున్న ఒక యువ రైతు సరికొత్త ఆలోచనతో, తక్కువ ఖర్చుతోనే అరటి తోటలను పెను గాలుల నుంచి చక్కగా రక్షించుకుంటున్నారు.
చెట్టుకు నాలుగు వైపులా గూటాలు వేసి, వాటికి ప్లాస్టిక్ టేప్‌లను కట్టటం ద్వారా పెను గాలుల నుంచి అరటి చెట్లను చాలా వరకు రక్షించుకోవచ్చని యువ రైతు సురేష్ సింహాద్రి చెబుతున్నారు.. సురేష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు. కర్ణాటకలోని మైసూరుప్రాంతానికి వలస వెళ్లి కొన్ని సంవత్సరాల నుంచి యాలక్కి రకం అరటి తోటలను కౌలు భూముల్లో సాగు చేస్తున్నారు. చామరాజానగర జిల్లా కొల్లేగాలా తాలూకా, సత్తేగాల గ్రామంలో సురేష్ అరటి తోటలను సాగు చేస్తున్నారు. ఆయన అనుభవాలు.. ఆయన మాటల్లోనే..
అరటి చెట్లకు నాలుగు వైపులా గూటాలు వేసి టేపులతో కట్టేస్తాం
గాలుల నుంచి అరటి చెట్లకు గల సమస్యను అధిగమించడానికి తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాధారణంగా వెదురు బొంగులను ఆసరాగా పెట్టి అరటి చెట్లకు రక్షణ కల్పిస్తుంటారు. ఇందుకోసం కర్రల కొనుగోలుకే ఎకరానికి రూ. లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే, మేము కర్రల అవసరం లేకుండా కేవలం టేపులతోనే అరటి చెట్టుకు నాలుగు వైపులా కట్టి గాలుల నుంచి విజయవంతంగా రక్షించుకుంటున్నాం. చెట్టుకు నాలుగు వైపులా నేలలోకి కట్టె గూటాలు దిగవేసి, వాటికి టేపులతో అరటి చెట్టు పై భాగాన్ని కడుతున్నాం.
చెట్టుకు గట్టిగా బిగుతుగా కట్టకుండా కొంచెం వదులుగా ఉండేలా చెట్టు చుట్టూతా టేపులను రక్షణ చక్రం మాదిరిగా కడతాం. గాలులు వీచి చెట్టు అటూ ఇటూ ఊగినప్పుడు చెట్టు కాండం విరిగి పడిపోకుండా రక్షించుకుంటున్నాం. చెట్టుకు 6 నెలల వయసులో పువ్వు దశలో టేపు కట్టాలి. గత ఏడాది ఎప్పుడూ ఎరుగని రీతిలో మాప్రాంతంలో గాలి వాన వచ్చి అరటి తోటలే కాదు, కరెంటు స్థంభాలు కూడా కూలిపోయాయి. అయినా, మా తోటలో కొన్ని చెట్లు మాత్రమే ఒరిగాయి. మిగతా చెట్లు అదృష్టం కొద్దీ గాలులను చాలా వరకు తట్టుకున్నాయి. టేపులతో కట్టటం వల్లనే ఇది సాధ్యమైంది.
ఎకరానికి రూ. 12 వేల ఖర్చు
ఎకరం అరటి తోటకు రూ. 12 వేల ఖర్చుతోనే టేపులతో రక్షణ కల్పించుకుంటున్నాం. ఎకరానికి 25 కిలోల టేపు అవసరం అవుతుంది. కిలో ధర రూ. 130. టేపులు కట్టడానికి కట్టె గూటాలు కావాలి. యూకలిప్టస్ లేత కర్రలను కొనుగోలు చేసి, 2 అడుగుల గూటాలను తయారు చేసుకొని వాడుతున్నాం. అడుగున్నర లోతు వరకు నేలలోకి ఏటవాలుగా దిగగొట్టి, ఆ గూటాలకు టేపులు కడతాం. దీని వల్ల గాలులు వచ్చినప్పుడు అవి చెక్కుచెదర కుండా చెట్టును కాపాడుతున్నాయి. కూలీల ఖర్చుతో కలిపితే చెట్టుకు రూ. 10 లకు మించి ఖర్చు కాదు. 6“6 దూరంలో అరటి మొక్కలు నాటితే ఎకరానికి 1200 మొక్కలు పడతాయి. అంటే.. ఎకరానికి టేపులు కట్టడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 12,000 మాత్రమే! కట్టిన టేపు రెండో పంటకు వాడటానికి పనికిరాదు. ప్రతి పంటకు మళ్లీ కట్టుకోవాలి.
మేం యాలక్కి రకం నాటు రకం పిలకలను తెప్పించి నాటుతున్నాం. టిష్యూకల్చర్ మొక్కలు నాటితే అవి మరీ ఎత్తు పెరుగుతాయి. నాటు పిలకలు అయితే ఎత్తు తక్కువ పెరుగుతాయి, కాండం గట్టిగా కూడా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం, వినియకచవితి రోజుల్లో ఈ రకం అరటికాయలకు మంచి గిరాకీ ఉంటుంది. కిలో కాయలను రూ. వందకు కూడా అమ్ముతూ ఉంటాం.
రైతుగా నా అనుభవాలను, టేపులను అరటి చెట్లకు కట్టే విధానాన్ని చూపే వీడియోలను ‘మీ ఫార్మర్ సురేష్ (@MeFarmerSuresh)’ అనే నా యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాను. రైతులు ఈ వీడియోలు చూసి అవగాహన పెంచుకోవచ్చు. నా ఫోన్ నంబర్: 99004 42287.