కళకళలాడే పదజాలం

 Professor Pulikonda Subbachari Essay On Telugu Language - Sakshi

వ్యాసం 

తూము అంటే రంధ్రం అని అర్థం. గొడ్డలికి కర్రపెట్టే రంధ్రాన్ని కూడా తూము అనే అంటారు. తూము అనే పదానికి «కొలత అని అర్థమూ ఉంది. ఫిరదౌసికి రాజు     తనపైన కావ్యం రాస్తే తూము బంగారు నాణాలు ఇస్తానని వాగ్దానం చేసి, గొడ్డలి తూములో పది నాణాలు పెట్టి ఇచ్చి మోసం చేశాడని జానపద కథ.

వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏఱ్లు పూచి పాఱుతున్నాయి. చెఱువులు తనకం తనకం లాడతన్నాయి. చెఱువులు మాట్లాడే కాలంలో వాటి భాష ఎలా ఉంటుంది. ఒక పదాన్ని పట్టుకుంటే ఒక్కోసారి ఎన్నో శబ్దాలు, పూలకొమ్మ పట్టుకొని గుంజితే పూలు జలజలా రాలినట్లు రాలతాయి. పొంగిపొర్లు, పాఱు, తనకంతనకంలాడు. ఈ మూడు క్రియాపదాలు. పొరలు, పాఱు అన్నా వేగంగా ముందుకు పోవు అనే అర్థాలున్నాయి. తనకంతనకం లాడు అనేది ధ్వన్యనుకరణ శబ్దం. చెఱువు పూర్తిగా నిండినప్పుడు అలలు చేసే శబ్దం. ఎన్నో వందల ఏండ్ల క్రితమే చెఱువులు తవ్వించినట్లు మనకు ఆధారాలు దొరుకుతాయి. రాజులు, సంపన్నులు నూతులు, చెఱువులు తవ్వించడం పుణ్యకార్యంగా భావించారు. ‘చెఱువు’ అచ్చతెలుగు పదం. చెరువు అని  రాస్తే దూర్చు, లోపలికి నెట్టు, చెక్కు అనే అర్థాలున్నాయి. చెఱువు పదానికి తిక్కన శాంతి పర్వంలోనే ప్రయోగం ఉంది. తర్వాతి చాలా కవుల ప్రయోగాలలో చెఱువు ఉంది. గుండె చెఱువు కావడం అనే పలుకుబడికి అర్థం మనస్సు కరుణతో నిండింది, దుఃఖం వచ్చింది అని. 

నీటి ఒరవడి ఉన్న దగ్గర ఎక్కడ పల్లపు నేలలో నీరు పాఱుతుందో చూచి అక్కడ కట్ట కడతారు. ఇలా కట్టాలంటే అక్కడ ఇంకా తవ్వి కట్ట కడతారు. చెఱువుతవ్వు అనేది క్రియాపదం, తవ్వు అనే క్రియా పదానికి విస్తృతమైన క్రియాపదంగా చూడాలి. చెఱువు తవ్వడానికి, కట్టకట్టడానికి ముందు బలి ఇవ్వాలి అనే సంప్రదాయం ఉంది. చెఱువు తవ్వడం, అదే మట్టితో కట్టకట్టడం ఒకేసారి జరిగే పనులు. ఇక చెఱువు కట్టకు రెండు కొసలు ఉంటాయి. ఒక కొసను కట్టతోక అంటారు. మరొక కొసలో రాతికట్టడం ఉంటుంది. చెఱువులో ఏ మట్టానికి నీరు నిల్వ ఉండాలి అని నిర్ణయించుకొని ఆ మట్టం ప్రకారం రాతి గోడను కడతారు. చెఱువు నిండింది అని అంటే ఈ రాతిగోడ ఎంత ఎత్తులో ఉందో అంత నీటిమట్టం వచ్చింది అని అర్థం. ఇలా నిండిన తర్వాత నీరు ఈ గోడ లేదా రాతికట్ట దూకి బయటికి పోతుంది. ఈ రాతి గోడనే ‘అలుగు’ అంటారు. దీనికి ఇంకా ‘మత్తడి’, ‘కత్తవ’ అనే పేర్లు ఉన్నాయి. చెఱువు నిండి ‘అలుగు పారింది’ అంటారు. తెలంగాణలో ‘అలుగెల్లింది’ అని కూడా అంటారు. అలుగు అనే పదానికి కోపగించు అనే అర్థం కూడా ఉంది. ఈ అర్థంలో నన్నయ ఆదిపర్వంలోనే ప్రయోగాలున్నాయి. కాని మధ్యయుగపు కావ్యాలలో అలుగు అనేమాటకు చెఱువుకట్ట, చివరి రాతికట్ట అనే అర్థంలో ప్రయోగం ఉంది. విక్రమార్క చరిత్రలో  ఈ ప్రయోగం కనిపిస్తుంది. అలుగు అంటే బాణం పదునైన కొస అనే అర్థం ఉంది. గడ్డపారలో వెడల్పుగా పదునుగా ఉండే భాగం అనే అర్థం ఉంది. ‘‘తనువున విరిగిన అలుగుల ననువున  పుచ్చంగ వచ్చు నతినిష్ఠురతన్‌ మనమున నాటిన మాటలు...’’ అనే తిక్కన ప్రయోగం ఉంది. ఇక తెలంగాణలో చెఱువు నిండి ‘మత్తడి దుంకింది’ అని అనడం పరివ్యాప్తంగా ఉంది. ‘మత్తడి దుంకు’ అనేది క్రియాపదం. దుముకు, దుంకు,  దూకు అనేవి ఒకే క్రియకు భిన్న రూపాలు. మత్తడి అనే మాట సర్కారు జిల్లాలలో ఎక్కడా లేదు.  రాయల సీమలో కూడా అలుగు అనే మాటే ఉంది. కాని మత్తడి లేదు. ఈ పదం సూర్యరాయాంధ్ర నిఘంటువులో కాని ఇతర నిఘంటువులలో కాని లేదు. ఒక్క శ్రీహరి నిఘంటువులోనే ఉంది. ఇక తెలంగాణలోని ఖమ్మం జిల్లా కృష్ణా జిల్లా గోదావరి జిల్లాలలో ‘కత్తవ’ అనే మాట ఉంది. కిందికి  నెల్లూరు జిల్లా వరకు ఈ పదం వినియోగంలో ఉంది.  అంటే చెఱువు నీరు పారే రాతికట్ట అనే అర్థం. ఈ పదం కూడా సూర్యారాయాంధ్ర నిఘంటువుకు ఎక్కలేదు.  నెల్లూరు జిల్లాలో ఇంకొక పదం కూడా వ్యవహారంలో ఉంది. కలుజు అని అంటారు. చెఱువు నిండి అలుగు పారేదాన్ని కలుజు పారతంది అంటారు.  చిత్తూరు జిల్లాలో మొరవ అంటారు. మొరవ పాఱింది అంటారు. ఈ పదం వ్యవసాయపదకోశంలో కూడా ఎక్కింది. మిగతా పైన చెప్పిన పదాలు కూడా వ్యవసాయ కోశంలో ఉన్నాయి. ఇక్కడ చెప్పిన కలుజు, మొరవ అనే పదాలు రెండూ బ్రౌన్‌ నిఘంటువులోనికి చేరాయి. మొరవ అనే పదానికి మొక్కబోయిన అనే అర్థం కూడా ఉంది. 

వ్యవసాయ సంస్కృతి పెరిగిన ఫలితంగా ఏర్పడిన మనిషి తొలినాటి ఆవిష్కరణలలో ఈ చెఱువు ఒకటి. నీటిని ఆపడానికి చిన్నకట్ట కట్టి దాన్ని ‘కుంట’ అని పిలిచే వారు. కుంట అంటే చాలా చిన్న చెఱువు అనే అర్థం. దీనికి సాధారణంగా అలుగు ఉండదు. ‘కుంట’ అంటే భూమి పరిమాణాన్ని కొలిచే ఒక కొలత అని కూడా అర్థం ఉంది. నాలుగు కుంటలు  అయితే ఒక ఎకరం అవుతుంది. కుంట గ్రామవాచక ప్రత్యయంగా కూడా ఉంది. కానుకుంట, దామకుంట, నాగమయ్యకుంట, అనేవి గ్రామనామాలు. ఇక చెఱువులు మరి పెద్దవి అయితే సముద్రం అని అనడం కూడా ఉంది. తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఉన్న ఉదయసముద్రం అలాంటి చాలా పెద్దచెఱువు, సముద్రం గ్రామవాచకంగా ఉన్న పేర్లు రాయలసీమలో తెలంగాణలో సర్కారాంధ్రలో కూడా చాలా ఉన్నాయి.  ఇక చెఱువు చాలా పెద్దది అయి చాలా కాలం అలుగు పారుతుంది. ఇది చాలా దూరం పోయిన పక్షంలో దీన్ని ‘అలుగువాగు’ అంటారు. అలా పారిన అలుగు వాగు కొంత దూరం పోయిన తర్వాత ఈ వాగు మీద ఇంకొక చెఱువు కడతారు. ఆ చెఱువు పారిన అలుగు వాగు మీద తర్వాత కొద్ది దూరంలో మరొక చెఱువు కడతారు. ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా నీటి ఒరవ ఉన్న ప్రాంతంలో కట్టిన చెఱువులనే ‘గొలుసు చెఱువులు’ అంటారు. ఖమ్మం జిల్లాలో మర్లపాడు చెఱువు నిండి అలుగువాగు సుమారు మూడు కి.మీ ప్రవహిస్తుంది. అక్కడ ఇనగాలి గ్రామంలో దీనికి కట్టకట్టి చెఱువు చేశారు. తర్వాత ఈ చెఱువు అలుగుపారి మొలుగుమాడు గ్రామం వద్ద చెఱువు కట్టారు. 

ఇక చెఱువుకు లోతట్టు వెలితట్టు అని రెండు భాగాలు ఉంటాయి. లోతట్టులోనే నీరు ఉంటుంది. వెలితట్టులో వరిపొలాలు ఉంటాయి. ఇక అలుగు పొంగి పారినప్పుడు ఆ నీరు ఈ వరిపొలాల మీదికి రాకుండా ఒడ్డుపొడుగునా కట్టకడతారు. ఈ కట్టని ‘ఉద్దికట్ట’ అంటారు. ఇక చెఱువుకట్ట, చెఱువు రెండూ ఒక దేవతతో సమానం.  అందుకే చెఱువుకట్ట తెగకుండా నరబలి ఇచ్చిన  ఘట్టాలు చరిత్రలో జరిగినాయి. మనకు ముసలమ్మ మరణం కథ అనేది రాయలసీమలోనే జరిగింది. ప్రతి చెఱువు కట్టమీద ఒక దేవత ఉంటుంది. ఆమెనే కట్టమైసమ్మ అంటారు. ఒక్కో చెఱువు పైన గంగమ్మదేవత ఉంటుంది. పేరు ఏదైనా చెఱువును దేవతగా భావించి తమకు అన్నం పెట్టే ప్రకృతి వనరును పూజించడమే ఇక్కడ మనం గమనించాలి. మనకు వరి పొలాలు రెండు రకాలుగా పండుతాయి. చెఱువు కింద పండే సాగుని ‘చెఱువాయి’ పంట అని, వర్షం మీద ఆధారపడే దాన్ని ‘ఆకాశవాయి’ పంట అని అంటారు. ఇక చెఱువు నీరు ‘తూము’ ద్వారా పొలాల లోనికి వదులుతారు. తూము అంటే రంధ్రం అని అర్థం. ఈ తూముకు కూడా కొబ్బరి కాయలు కొట్టి కోళ్ళను కోసి పూజచేయడం ఉంది. గొడ్డలికి కర్రపెట్టే రంధ్రాన్ని  కూడా తూము అనే అంటారు. తూము అనే పదానికి ధాన్యం కొలత అని అర్థం ఉంది. ఫిరదౌసికి రాజు తనపైన కావ్యం రాస్తే తూము బంగారు నాణాలు ఇస్తానని వాగ్దానం చేసి గొడ్డలి తూములో పది నాణాలు పెట్టి ఇచ్చి మోసం చేశాడని జానపద కథ ఉంది. తూము ఇంటి పేరుగా కలవారు చాలా మంది తెలంగాణ లో ఉన్నారు. తూము నరసింహదాసు గొప్ప వాగ్గేయకారుడు. తూములూరు అనే ఊరు కూడా ఉంది. చెఱువు లోతట్టున ఒండ్రుమట్టి చేరుతుంది. దీన్ని ‘చెఱువుమట్టి’ అంటారు. ఇది సారవంతమైనది అని రైతులు తమ పొలాలలో ఎరువుగా వేసుకుంటారు. కొన్ని మంచినీళ్ళ చెఱువులు ఉంటాయి. ఇలా చెఱువు చుట్టూతా చాలా భాష ఉంది. చెఱువును కదిలిస్తే అది మాట్లాడుతుంది. మన సంస్కృతిలో చెఱువు విడదీయరాని భాగం. ఇది మన పల్లె సొగసు.  

ప్రొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top