
తెలంగాణ ఉమ్మడిక కరీనంగర్ జిల్లాలోని ఓ మండలానికి చెందిన బాలిక రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయంతో బాలిక ఇంట్లో చెప్పకుండానే రాయలసీమకు పారిపోయింది. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఇంటికి తిరిగి వచ్చింది.
తొమ్మిదో తరగతి చదివే తన కూతురు మారాం చేస్తోందని తండ్రి స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. ఆ ఫోన్‌తో ఆమె తన స్నేహితులతో కాలక్షేపం చేయడం ప్రారంభించింది. ఇదేసమయంలో వివిధ వెబ్‌సైట్లు ఓపెన్‌చేసి సంబంధం లేని అనేక అంశాలకు ఆకర్షితురాలైంది. చివరకు చదవడం పక్కన పెట్టేసింది. ఫోన్ చేతిలో లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేసింది.
ఓ గ్రామంలో బాలిక(16), యువకుడు(20) ఏకాంతంగా ఉండడాన్ని గమనించిన యువకులు.. వారిని పట్టుకుని కొలువుదీరిన కుల సంఘం వద్దకు తీసుకెళ్లారు. కుల పెద్దలు పంచాయితీ పెట్టగా.. తాము ఏడాదిగా ప్రేమించుకుంటున్నామని బాలిక, యువకుడు చెప్పేశారు. మైనార్టీ తీరిన వెంటనే పెళ్లి చేయాలని పంచాయితీ పెద్దలు నిశ్చయించారు.
రామగుండానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. హాస్టల్‌లో వసతి పొందుతోంది. కార్యాలయం నుంచి తీసుకొచ్చే ర్యాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు వారించినా వినకుండా డ్రైవర్‌ను పెళ్లి చేసుకుంది. ఏమైందో ఏమోగానీ యువకుడు వేధించగా తాళలేక సఖి కేంద్రాన్ని ఆశ్రయించింది.
తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక, సోషల్‌మీడియా ప్రభావంతో టీనేజ్ యువత ఇలా దారితప్పుతోంది. ఎదిగీఎదగని వయసు.. తెలిసీ తెలియని మనసు.. ఆకర్షణ.. ఆపై తప్పటడుగులు.. వెరసి టీనేజ్‌ను ట్రాక్ తప్పేలా చేస్తోంది. మరోవైపు.. సామాజిక మాధ్యమాలు కౌమరంపై విషం చిమ్ముతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం, వాట్సప్, ఓటీటీలు, సీరియల్స్, రీల్స్ విషబీజాలు నాటుతున్నాయి. ప్రేమ పేరిట కొందరు, పరిచయం పేరిట మరికొందరు యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
స్మార్ట్‌గా వల విసిరి చాటింగ్‌తో మొదలుపెట్టి.. ముగ్గులోకి దింపుతున్నారు.. అవసరం తీరాక ముఖం చాటేస్తున్నారు. ఇలా చోటుచేసుకునే దారుణం గురించి తెలియక బాలికలు, యువతులు మోసపోతున్నారు. తల్లిదండ్రుల అతిగారాబమో, అతి నమ్మకమో, నిర్లక్ష్యమో తెలియదు గానీ.. యూత్ ట్రాక్ తప్పుతోంది. చివరకు ఠాణా మెట్లెక్కి బోరున విలపించడం తప్ప చేసేదేమీలేక చూస్తూ ఉంటోంది.
ఇలా ఒకటికాదు రెండు కాదు.. నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక పరువుపోతుందని మిన్నకుండిన వారు వేలల్లో ఉంటున్నారు. కొంతకాలంగా తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వస్తున్న ‘టీనేజ్ లవ్’లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక..
పిల్లలు అల్లరి చేస్తున్నారని, ఫోన్ ఇస్తే వారిపనివారు చేసుకుంటారని కొందరు, ఉపాధి కోసం భర్త లేదా భార్య విదేశాలకు వెళ్తూ పిల్లలను పెద్దల వద్ద ఉంచుతున్నారు. వృద్ధాప్యంలోని తమ తల్లిదండ్రులు పిల్లల కదలికలను ఏ మేరకు గమనిస్తున్నారోననే విషయం గమనించక ముందే ప్రమాదం జరిగిపోతోంది.
మితిమీరిన స్వేచ్ఛ, చేతిలో అవసరానికి సరిపడా సొమ్ము ఉండడంతో హైస్కూల్ వయసు నుంచే ప్రేమ అనే ఆకర్షణ వైపు టీనేజ్‌ను నడిపిస్తున్నది. ఉపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పదు. కానీ అదే సమయంలో పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనించకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి.
మరోపక్క.. సామాజిక మాధ్యమాల ద్వారానూ అనేక మోసాలు జరుగుతున్నాయి. కొందరు యువకులు యువతుల్లా నటిస్తూ అవతలి యువతుల ఫొటోలు సేకరిస్తారు. వాటిని ఆ యుతులకే పంపించి బెదిరిస్తున్నారు. ఇంకొందరైతే అమ్మాయిల పేరిట ఖాతాలు సృష్టించి ఫ్రెండ్స్ రిక్వెస్టులు పంపించి ఆకట్టుకునేందుకు యతి్నస్తారు. ఆ వల వల విసిరి నమ్మించి మోసం చేస్తారు.
ఒక్కోసారి ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో కొన్నిమార్పు వస్తుంటాయి. అందుకే.. స్మార్ట్‌ఫోన్‌పాటు సోషల్ మీడియా అకౌంట్లను తరచూ పరిశీలించాలి. ఎన్ని పనులు ఉన్నా వారి ప్రవర్తనను నిశితంగా గమయనించాలి. ట్రాక్‌తప్పిన వారు తమను సంప్రదిస్తే కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామని సీడబ్ల్యూసీ అధికారులు అంటున్నారు.
పర్యవేక్షణ తప్పనిసరి
తల్లితండ్రులు తమ పిల్లలపై అనేక ఆశలు పెట్టుకుంటారు. బాగా చదివిస్తుంటారు. కానీ, వారి పర్యవేక్షణ కూడా చాలాఅవసరం. ప్రస్తుతం మొబైల్‌ఫోన్ చాలాకీలకం. పిల్లలకు చదువులకు ఉపయోగపడుతోంది. కానీ... ఇందులోని సోషల్ మీడియా, సినిమాల ప్రభావం, ఆ దశలో వచ్చే మార్పు పిల్లలపై బాగా పడుతోంది. తల్లిదండ్రులిద్దరూ సంపాదనపై దృష్టిపెట్టి పిల్లలను పట్టించుకోకపోతే ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లే..
– డాక్టర్ రవివర్మ, సైకియాట్రిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్