డోలీ | Old grandma and bank manager went to Sabarimala | Sakshi
Sakshi News home page

డోలీ

Apr 6 2026 2:39 AM | Updated on Apr 6 2026 2:39 AM

Old grandma and bank manager went to Sabarimala

ఆధ్యాత్మికథ

అదొక చిన్న మండల కేంద్రం. దానికి కూత వేటు దూరంలో ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊర్లో గులాబీ తోటలున్నాయి. ఆ తోటల యజమానుల నుంచి గులాబీలు తీసుకుని మండల కేంద్రానికి వెళ్ళి  పూలమ్ముతుంది ఓ ముసలవ్వ.

ఆ మండల కేంద్రంలో ఒక గ్రామీణ బ్యాంకు ఉంది. రిటైర్‌ మెంట్‌ కు దగ్గరున్న ఓ మహిళా మేనేజర్‌ ఆ బ్యాంకుకు బదిలీ మీద వచ్చింది. నెత్తి మీద గంప పెట్టుకుని ఇంటింటికీ వెళ్ళి పూలమ్మే అవ్వ ఆ రోజు బ్యాంకు మేనేజర్‌ ఇంటికి వెళ్ళింది. పూలు తీసుకొమ్మని అడిగింది. పూలు తీసుకునే సమయంలో అవ్వ, ‘కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్‌ ఆమే’ అని తెలుసుకుంది.

‘నాకు పదివేలు అప్పు కావాలి, నా దగ్గర కుదవ పెట్టడానికి ఏమీ లేదు. మీ బ్యాంకు నన్ను నమ్మి అప్పు ఇస్తుందా?’ అని అడిగింది. ‘అప్పు చేయాల్సిన అవసరం నీకేమి వచ్చింది?’ అని అడిగింది మేనేజర్‌. ‘నా వయసు డెబ్భై ఏళ్ళు. నాలుగేళ్ళుగా శబరిమలై వెళ్తున్నాను. కొండ ఎక్కడం ఇన్నాళ్ళూ సాధ్యమయ్యింది. ఈసారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొండ ఎక్కడం అసాధ్యమనిపిస్తోంది. 

ఎలాగైనా ఈసారి కూడా స్వామిని చూడాలని కోరికగా ఉంది. కాబట్టి పంబ నదినుంచి సన్నిధానం వరకు డోలీలో వెళ్ళాలనుకుంటున్నాను. నలుగురు మగ మనుషులు నన్ను మోయాలి కదా. దానికి కనీసం పదివేల రూపాయల అవసరం ఉంటుంది. నేను దాచిపెట్టుకున్న డబ్బు ప్రయాణానికి మాత్రమే సరిపోతుంది. మీరు మేనేజర్‌ కాబట్టి నాకెలాగైనా సహాయం చేయండి. మీ ఋణం పెట్టుకోను. నాకు రావాల్సిన డబ్బు రెండు నెలల్లో వస్తుంది. వెంటనే తీర్చేస్తాను’ అని వేడుకుంది.

ఆ అవ్వ భక్తి భావానికి మేనేజర్‌ ఆశ్చర్యపోయింది. చిన్నగా తేరుకుని ‘నాక్కూడా చాన్నాళ్ళుగా శబరిమలై వెళ్ళాలని ఉంది. స్వామి దర్శనం చేసుకోవాలని ఉంది. కొండపైకి నడిచి వెళ్ళే శక్తి నాకుంది. నువ్వు ఇప్పటికే నాలుగేళ్ళుగా శబరిమలై వెళ్తున్నావు కాబట్టి ఎలా వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో నీకు బాగా తెలుసు. ఆ దీక్షకు కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉంటాయి కదా.

 ఆ విషయంలో నాకు సహకరించు. ఒకరికొకరు తోడుగా వెళ్ళి వద్దాం. నీ డోలీ డబ్బులు నేను కడుతాను. అప్పు ఆలోచన పక్కన పెట్టేయ్‌’ అని బదులిచ్చింది. ఆ ముసలవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మేనేజర్‌కి ఇవ్వాల్సిన పూలకంటే మరి కొన్ని పూలు అదనంగా ఇచ్చి నమస్కరించి అక్కడినుంచి కదిలింది. నెల తర్వాత వచ్చిన కార్తీక మాసంలో ఇద్దరూ నల్ల వస్త్రాలు ధరించి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని పలుకుతూ కొట్టాయం రైలెక్కారు. 

– ఆర్‌సి. కృష్ణస్వామి రాజు
 

Advertisement
 
Advertisement
Advertisement