మన మామిడికి విదేశీ పేర్లు ఎందుకు..? | The Mango Story, Know Interesting Facts About Its History, Global Legacy And Names | Sakshi
Sakshi News home page

మన మామిడికి విదేశీ పేర్లు ఎందుకు..?

May 30 2026 10:13 AM | Updated on May 30 2026 11:12 AM

Names, History And Complete Details Of Mango Varieties

వేసవి ఎండలు ఎంత మండించినా, తియ్యటి మామిడి రసం గొంతులో పడేది వేసవిలోనే కాబట్టి హాట్‌ సమ్మర్‌ కూడా చాలామందికి స్వీట్‌ సమ్మర్‌ కిందే లెక్క. పండ్లలో రారాజుగా పేరు పొందిన మామిడి పుట్టింది మనదేశంలోనే. ఐదు వేల ఏళ్ల కిందటే భారతీయులు మామిడి పండు రుచి చూశారు. క్రీ.పూ. 4,5 శతాబ్దాల్లో బౌద్ధ సన్యాసులు, చరిత్రకారులు, పర్యాటకులు తమతోపాటు మామిడిని విదేశాలకు తీసుకువెళ్లడంతో మామిడి  దేశం ఎల్లలు దాటింది. పోర్చుగీసు వాళ్లు 1498లో మనదేశంలో అడుగుపెట్టిన తర్వాత చేసిన మొదటి పని మామిడి పండ్ల ఎగుమతి, గోవాలో మామిడికి అంటు కట్టి కొత్తజాతుల ఆవిష్కరణ. మామిడి లో ఒకజాతికి ఆల్ఫోన్సో అనే పేరు అలా వచ్చిందే!

మామిడి జాతులకు ఆ పేర్లు ఇలా వచ్చాయి!

  • అల్ఫోన్సో – పోర్చుగీస్‌ గవర్నర్‌ పేరు పెట్టారు.

  • జహంగీర్‌ – మొఘల్‌ పాలకుడు జహంగీర్‌కు ఇష్టమైన జాతి. అతడి పేరు మీదనే వాడుకలోకి వచ్చింది. వ్యవహారంలో జాంగ్రీ మామిడిగా మారింది.

  • కేసర్‌ – ఇది హిందీ పదం కుంకుమ పువ్వు నుంచి వచ్చింది.

  • లంగ్రా – వికలాంగుడైన తోటమాలి తెచ్చి నాటిన మొక్కకు అతడి పేరు పెట్టారు.

  • చౌసా– బీహార్‌లోని చౌసా దగ్గర జరిగిన యుద్ధంలో మొఘల్‌ పాలకుడు హుమయూన్‌ ను షేర్‌ షా సూరి ఓడించిన గుర్తుగా ఒక మామిడి జాతికి ఆ ప్రదేశం పేరు పెట్టారు.

  • దశేరి– ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం దశేరి అనే గ్రామంలో మొదట సాగుచేశారు.

  • గోవా – పోర్చుగీసు వాళ్లు గోవాలో అంటుకట్టిన ఒక జాతికి అదే పేరు పెట్టారు.

  • బంగినపల్లి– ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లాలో ఓ గ్రామం బనగాన పల్లి పేరుతో వాడుకలోకి వచ్చింది.

  • బాదామి– కర్నాటకలో బాదామిలో ఎక్కువగా పండే జాతి.

  • తోతాపురి– చిలుక ముక్కులాగ వంపు తిరిగి ఉండడంతో ఆ పేరు వచ్చింది.

  • హిమసాగర్‌– బెంగాల్‌లో ఎక్కువగా పండే రకం. మంచు సముద్రంతో పోలుస్తూ కవితాత్మకంగా వచ్చిన పేరు.

ఈ దేశాలకు వెళ్లాయి!

  • మామిడి మనదేశం నుంచి తొలి రోజుల్లో బర్మా, దక్షిణ చైనా, ఆగ్నేయ ఆసియా దేశాలకు విస్తరించింది.

  • క్రీ.శ 300 సంవత్సరంలో మామిడిగింజలు మధ్య ప్రాచ్య దేశాలకు, ఆఫ్రికాలోని తూర్పు దేశాలకు, సౌత్‌ అమెరికా, బ్రెజిల్, కరీబియన్‌  దీవులకు ప్రయాణించాయి. మనదేశం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా 150 దేశాలకు వెళ్లాయి.

  • సియాటిల్‌లో భారత్‌ కాన్సులేట్‌ సమక్షంలో జరిగిన మ్యాంగో ఫెస్టివల్‌ అంతర్జాతీయంగా మామిడికి ఉన్న ఆదరణకు 
    అద్దం పట్టింది. ఈ ఏడాది ఫెస్టివల్‌ జూన్‌  4న మొదలవుతుంది.

ఇది నిజం!

  • మామిడిలో దాదాపు 1,500 రకాలున్నాయి.

  • వందకు పైగా దేశాలు మామిడిని పండిస్తున్నాయి.

  • చెప్పుకోదగిన స్థాయిలో మామిడిని పండిస్తున్న దేశాలు బ్రెజిల్, ఈక్వెడార్, గ్వాటిమెలా, హైతీ, మెక్సికో, పెరూ, పాకిస్తాన్, చైనా, పోర్చుగీస్, జపాన్‌

  • ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మామిడిలో దాదాపు సగభాగం మనదేశంలోనే పండుతుంది. ఏడాదికి సరాసరిన రెండున్నర కోట్ల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది.

  • ఎక్కువ పండ్లు దేశంలోనే ఖర్చవుతాయి. ఎగుమతి అయ్యేది కొద్ది శాతమే.

  • యూఏఈ, సౌత్‌ అరేబియా, యూకే, యూఎస్‌ఏ దేశాలకు భారీ ఎగుమతులు

  • యూఎస్‌తోపాటు చాలా దేశాల వారికి మామిడి పండును నేరుగా తినడం చేతరాదు. కట్‌ చేయడమూ రాదు. రెస్టారెంట్‌కు వెళ్లి ఆర్డర్‌ చేసుకుని ముక్కలను తింటారు.

  • యూఏఈ తాజా మామిడి పండ్లతోపాటు మామిడి గుజ్జును కూడా దిగుమతి చేసుకుంటుంది.

  • లండన్‌  వాళ్లు గుజరాత్‌ కేసర్, మహారాష్ట్ర ఆల్ఫోన్సో మామిడి పండ్లను ఇష్టపడతారు.

  • ఇంటర్నేషనల్‌ షిప్పింగ్‌కి ముందు హాట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ తప్పనిసరి.

  • ఎగుమతి చేసే పండ్లను క్రిమిసంహారక మందుల ప్రభావాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు ఫ్యుమిగేషన్‌  చేయాలి. దిగుమతి దగ్గర కూడా చెక్‌ పాయింట్‌ ఉంటుంది. ఫ్యుమిగేషన్‌  సరిగ్గా జరగకపోతే దేశంలోకి అనుమతించరు.

మామిడి చరిత్రకు ఐదు వేల ఏళ్లు..

  • మనదేశం నుంచి 150 దేశాలకు విస్తరణ

  • పోర్చుగీసు వారి ప్రయోగాలతో కొత్తరకాలు

  • భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) పొందిన మామిడి జాతులు ఆల్ఫోన్సో, కేసర్, దశేరి

    విదేశాలకు ఇలా..
    ఇండియా నుంచి విదేశాలకు వెళ్లే వాళ్లు తమతోపాటు మామిడి పండ్లను తీసుకెళ్లాలంటే సదరు దేశాల నిబంధనలను పాటించాలి. తెగుళ్ల వ్యాప్తిని నివారించడం కోసం యూఎస్, యూకేతోపాటు అనేక యూరప్‌ దేశాలు కచ్చితమైన నియమాలు పాటిస్తాయి. ప్యాక్‌ చేసే ముందు ఆయా దేశాల కస్టమ్స్‌ నియమాలకు తగినట్లు శుద్ధి చేయాలి. – వాకా మంజులారెడ్డి, సాక్షి స్పెషల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement