
విమానాలు సహా విద్యుత్తుతో నడిచే వాహనాలన్నింటికీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు ఇటీవల సోడియం ఫ్యూయల్ బ్యాటరీలను రూపొందించారు. లిథియం చాలా అరుదుగా దొరికే మూలకం.
అందువల్ల దీని ఖరీదు ఎక్కువ. దీనికి ప్రత్యామ్నాయం కోసం రకరకాల ప్రయోగాలు సాగించిన శాస్త్రవేత్తలు, చివరకు విరివిగా దొరికే సోడియంతో బ్యాటరీని విజయవంతంగా రూపొందించారు. దీని తయారీ కోసం సోడియంను ద్రవరూపంలో ఉపయోగించారు.
ఇప్పుడు వాడుతున్న లిథియం బ్యాటరీల కంటే సోడియం బ్యాటరీల ఇంధనసాంద్రత మూడురెట్లు ఎక్కువగా ఉంటుందని, అందువల్ల వాటి మన్నిక ఎక్కువగా ఉంటుందని; పైగా ఈ బ్యాటరీలు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటాయని ఎంఐటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి అందుబాటులోకి వస్తే, విద్యుత్ వాహనాల బ్యాటరీలు మరింత చౌక కావడమే కాకుండా, వాతావరణ కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సోడియం బ్యాటరీలను చిన్న మోటారు వాహనాలతో పాటు భారీ విమానాలు, నౌకలలో కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
(చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..)