తొలి డెవలప్మెంటల్‌ బయాలజిస్ట్‌ | Meet Leela Ganesh Mulherkar first developmental biologist | Sakshi
Sakshi News home page

Leela Ganesh Mulherkar తొలి డెవలప్మెంటల్‌ బయాలజిస్ట్‌

Jul 16 2025 12:55 PM | Updated on Jul 16 2025 1:36 PM

 Meet Leela Ganesh Mulherkar  first developmental biologist

భారత స్వాతంత్య్ర సమరం జరుగుతున్న రోజుల్లో పూణెలోని పరశురామ్‌ బావ్‌ కాలేజీలో జువాలజీ లెక్చరర్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల లీలా గణేష్‌ ముల్హెర్కర్‌ (Leela Ganesh Mulherkar) 16 నెలల్లో గొప్ప పరిశోధన చేశారు. ఎడిన్‌బరో పరిశోధకులు చార్లెస్‌ వెడ్డింగ్‌టన్‌ ఆధ్వర్యంలో ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జెనిటిక్స్‌ అండ్‌ ఎంబ్రియాలజీ’లో పిండం పరిణామం, అభివృద్ధి మధ్య ఉన్న సంబంధం గురించి అధ్యయనం చేయడంతో ఆమె పేరు మారు మోగి పోయింది. పూనా విశ్వ విద్యాలయంలో ఈ డెవలప్మెంటల్‌ బయాలజీ కోర్సును ప్రవేశపెట్టడమే కాకుండా, ‘ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ డెవలప్మెంటల్‌ బయాలజిస్ట్స్‌’ (Indian Society of Developmental Biologists (InSDB)) అనే సంస్థను కూడా ప్రారంభించారామె. 

ముంబైకి ఉత్తరాన ఉన్న ‘బోర్డీ’ గ్రామంలో 1915లో లీల జన్మించారు. 1954లో భారత ప్రభుత్వమిచ్చే విదేశీ చదువుల స్కాలర్‌షిప్‌ రావడంతో ఇంగ్లాండ్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యా లయంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. తిరిగివచ్చి పుణె విశ్వవిద్యా లయం జువాలజీ శాఖలో అధ్యాపకులుగా చేరారు. గర్భవతుల నిద్రలేమి, వికారం, మబ్బుగా ఉండటం వంటి లక్షణాలకు ప్రపంచవ్యాప్తంగా వాడే ‘తలిడోమైడ్‌’ ఔషధం ఎన్నో సమస్యలకు దారి తీసిన కాలమది. దీనికి సంబంధించి లీలా ముల్హెర్కర్‌ దృష్టి పెట్టి పరిశోధనలు కొనసాగించారు. 

తన ఇంటినే పరిశోధనాశాలగా మార్చుకొని సాగిన పరిశోధనా ధీర లీల. తన విద్యార్థులను పరిశోధకులుగా మలుస్తూ స్థానికంగా లభ్యమయ్యే హైడ్రాలు, కప్పలు, బల్లులు, నత్తలు వంటి వాటి పిండోత్పత్తి, దాని ఎదుగుదల,ఆ ప్రక్రియలో సంభవించే పరిణామాల గురించి అధ్యయనంచేపట్టారు. పరిశోధనలో మునిగిపోయి లీల తన 52వ ఏట 1967లో వసంతరావు గోలేను వివాహం చేసుకున్నారు.

యూనివర్సిటీలో రెండు దశాబ్దాలు పనిచేసి 1977లో పదవీ విరమణ చెందినా మరో 15 ఏళ్లు అక్కడ పరిశోధనలు కొనసాగించారు. 65 ఏళ్ల వయసులో కూడా సున్ని తంగా ఉండే పలురకాల పిండాలను కోసి భాగాలను అధ్యయనం చేయడం ఆమెకుఎంతో సునాయాసంగా ఉండేది. కనుకనే 2005లో ఆమె మరణించేదాకా యూనివర్సిటీ క్యాంపస్‌లోనే చలాకీగా అందుబాటులో ఉండేవారు. ఆమె దగ్గర 18 మంది పరిశోధన పట్టాలు పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లారు. 

భారతీయ కళలు, కవిత్వం, నాటకాలు, ఫిలాసఫీ వంటి అంశాల పట్ల లీలా ముల్హెర్కర్‌కు చాలా మక్కువ. ఆమె నాటకానికి వెళితే తప్పనిసరిగా తొలి వరుసలోనే కూర్చునేవారు. బాలగంధర్వ ఆడిటోరియం ముందు వరుసలో వారికి రెండు సీట్లు ప్రత్యేకంగా కేటాయించబడేవి. వృక్ష శాస్త్రవేత్తలు, జంతుశాస్త్రవేత్తలు, వైద్యులు... ఈ మూడు విభాగాల జీవశాస్త్రజ్ఞులకు ఒక వేదికను కల్పిస్తూ 1977లో ’ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ డెవలప్మెంటల్‌ బయాలజిస్ట్స్‌’ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా నేటికీ శాస్త్రజ్ఞులు ప్రతి రెండేళ్లకు ఒకచోట పెద్ద ఎత్తున సమావేశమవుతూ డెవలప్మెంటల్‌ బయాలజీ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నారు.
- డా.నాగసూరి వేణుగోపాల్‌ 
ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement