
జర్మనీలోని బావరియాకు చెందిన లారెంట్ స్క్వార్జ్ మూడేళ్ల వయసులోనే బొమ్మలు వేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. లారెంట్ వేసే బొమ్మలు ఆన్‌లైన్ వేదికగా అమ్ముడవుతున్నాయి. ఒక్కోదాన్ని లక్షలు పెట్టి కొంటున్నారు.
లారెంట్ తల్లిదండ్రులు ఆ పిల్లాణ్ణి రెండేళ్ల క్రితం సెలవులకు ఇటలీకి తీసుకెళ్లారు. అప్పటికి లారెంట్ వయసు సంవత్సరం. ఆ సమయంలో హోటల్‌లోని యాక్టివిటీ రూమ్‌లో ఓ పెయింటింగ్ చూశాడా గడుగ్గాయి. దాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు. అతనికి చిత్రలేఖనం మీద ఆసక్తి కలిగిందని భావించిన తల్లిదండ్రులు ఇంటికొచ్చాక రంగులు, కాన్వాస్, బ్రెష్‌లు ఏర్పాటు చేశారు. సరదాగా మొదలైన చిత్రలేఖనం సీరియస్ పనిగా మారిపోయింది. ప్రస్తుతం ఇంట్లో తన సొంత స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాడు. లారెంట్ పెయింటింగ్‌లు సుమారు 7,000 డాలర్లు (రూ.6 లక్షల) వరకు అమ్ముడవుతున్నాయి. అతని తల్లి అతనికి ఇన్‌స్ట్రాగామ్ ఖాతాను ఏర్పాటు చేసి వాటిని విక్రయిస్తోంది. అతని అకౌంట్‌కి సుమారు 9.99 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్క్వార్జ్ తండ్రి, తాత ఇద్దరూ కూడా కళాకారులే. వారి నుంచే ఆ బాలుడికి ఈ కళ అబ్బిందని అందరూ అంటున్నారు.