చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!

Published Sun, Jan 14 2024 12:34 PM

Medical Attention Should Be Sought When Leg Wwelling Occurs - Sakshi

'చాలాసేపు కదలకుండా కూర్చున్నా, అలా కూర్చుని చాలాసేపు ప్రయాణాలు చేసినా కాళ్లవాపులు రావడం మామూలే. గర్భవతుల్లోనైతే ప్రసవానికి ముందు చివరి మూడు నెలల్లో (చివరి ట్రైమిస్టర్‌లో) కాళ్ల వాపు రావడం  ఇంకా సాధారణం. గర్భవతుల్లో కాళ్ల వాపు వచ్చే ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో ‘జెస్టెషనల్‌ అడిమా’ అంటారు. ఇలా కాళ్లవాపులు  రావడానికి కారణాలేమిటి, వాటితో వచ్చే సమస్యలూ – పరిష్కారాలపై అవగాహన కోసం ఈ కథనం.'

గర్భవతుల్లో ప్రసవం ముందరి నెలల్లో కాళ్ల వాపులు రావడం.. అందునా అవి ఉదయం పూట కొద్దిగా ఉండి, క్రమంగా సాయంత్రానికి వాపులు పెరుగుతుండటం చాలామందిలో జరుగుతుంటుంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల విశ్రాంతితో ఆ నొప్పులు వాటంతట అవే తగ్గిపోతాయి.

దేహనిర్మాణ పరమైన (అనటామికల్‌) కారణం..
గర్భవతుల్లో ప్రసవానికి ముందు రోజుల్లో గర్భసంచి కుడి వైపునకు కాస్తంత ఒరుగుతుంది. కాళ్ల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే పెద్ద రక్తనాళమైన ఇన్ఫీరియర్‌ వీన కేవా శరీరానికి కుడివైపునే ఉంటుంది. గర్భసంచి కుడి వైపునకు ఒరగడం వల్ల.. అది ఇన్ఫీరియర్‌ వీన కేవాపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో కాళ్ల నుంచి గుండె వైపునకు రక్తప్రవాహం సాఫీగా సాగక కాళ్లవాపులు వస్తుంటాయి. అందువల్ల గర్భవతులు విశ్రాంతిగా పక్కమీద ఒరిగినప్పుడు తమ ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది.

కాళ్లవాపులు వస్తుంటే దృష్టి పెట్టాల్సిన మెడికల్‌ సమస్యలు..

  • గర్భవతుల్లో కాళ్ల వాపు వస్తున్నప్పుడు ముందుగా హైబీపీ ఉందేమోనని పరీక్షించుకోవాలి.
  • మనదేశ మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. కాళ్ల వాపులు రావడానికి ఈ అంశం కూడా ఒక ప్రధాన కారణం. కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌/కౌంట్‌  (సీబీపీ/సీబీసీ) వంటి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు మహిళల్లో హిమోగ్లోబిన్‌ మోతాదు కనీసం 11 ఉండాలి. కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం సాధారణం.
  • మహిళల్లో గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు కూడా కాళ్లవాపులు రావచ్చు.

కాళ్లవాపు తగ్గడానికి చేయాల్సిందిదే..

  • మామూలుగానైతే ఈ కాళ్లవాపుల గురించి పెద్దగా ఆందోళన పడాల్సిందేమీ లేదు.
  • వాపు ఎక్కువగా ఉంటే పక్క మీద ఒరిగి పడుకున్న గర్భవతులు మడమల కింద తలగడను పెట్టుకుని, కాళ్లను కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి.
  • కంప్యూటర్‌ ముందుగాని, డెస్క్‌ ముందుగాని అదేపనిగా కూర్చుని పనిచేసే వారు తమ కాళ్ల కింద ఏదైనా పీటగానీ, స్టూల్‌గాని వేసుకుని, కాళ్లు కాస్తంత ఎత్తు మీద ఉండేలా చూసుకోవాలి.
  • ప్రతి రెండు మూడు గంటలకు ఒకమారు లేచి, కాస్తంత నడవాలి. దాంతో కాళ్ల వాపు తగ్గుతుంది. 

పైన పేర్కొన్న జాగ్రత్తలు ΄ాటించాక కూడా కాళ్ల వాపులు తగ్గని వారూ,.. అలాగే ఆ సమస్యతో పాటు చేతులు, ముఖంలో వాపు కనిపిస్తున్నవారూ, ఆరేడు గంటల విశ్రాంతి తర్వాత కూడా కాళ్ల వాపులు తగ్గని వారు.. తప్పనిసరిగా హైబీపీ, అనీమియాతో పాటు థైరాయిడ్‌ వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమోనని డాక్టర్ల చేత పరీక్ష చేయించుకోవాలి.


- డాక్టర్‌  రమ్యతేజ కడియాల, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ అండ్‌ ఆబ్‌స్టెట్రీషియన్‌

ఇవి కూడా చదవండి: చలిగాలిలో వాకింగ్‌: ఊపిరితిత్తులు జాగ్రత్త!

Advertisement
Advertisement