
నేటి నుంచి జోరుగా పెళ్లిళ్లు
నవంబర్ 26 వరకు శుభ ముహూర్తాలు
ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షలకుపైగా జరగనున్న వివాహాలు
ఫంక్షన్‌హాల్స్, టెంట్‌హౌస్‌లకు,బ్యాండ్ మేళాలకు డిమాండ్
మెదక్ జిల్లా, దుబ్బాక : సరిగ్గా 80 రోజుల విరామం తర్వాత మళ్లీ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు వచ్చాయి. దీంతో జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. శ్రావణమాసం శుభకార్యాలకు శ్రేష్టం కావడంతో నేటి నుంచి నవంబర్ 26 వరకు 35 మంచి ముహూర్తాలు ఉండటంతో జోరుగా లగ్గాలు జరగనున్నాయి. వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు జరగనున్నాయి. మే 25 నుంచి జులై 26 వరకు ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం శుభ ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా పెళ్లి శోభ సంతరించుకొంది.
నేటి నుంచి నవంబర్ 26 వరకు..
నేటి నుంచి నవంబర్ 26 వరకు 4 నెలల పాటు పెళ్లి బాజాలు మోగనున్నాయి. జులై 26, 27, 30, 31తోపాటు ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 20 తేదీల్లో, సెప్టెంబర్‌లో 24, 26, 27, 28వ తేదీల్లో, అక్టోబర్‌లో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31వ తేదీల్లో, నవంబర్‌లో 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. మొత్తం నాలుగు నెలల్లో 35 ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా లక్షా 10 వేలకు పైగా వివాహాలు జరగనున్నాయి. సిద్దిపేటలో 40 వేలు, సంగారెడ్డిలో 45 వేలు, మెదక్ జిల్లాల్లో 25 వేలకు పైగా పెళ్లీలు జరగనున్నాయని వేదపండితులు తెలిపారు.
చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!
బ్యాండ్, డెకరేషన్, ఫొటోగ్రాఫర్లకు డిమాండ్
వివాహాలు జరగుతుండటంతో పంతుళ్లు, బ్యాండ్ మేళాలు, టెంట్ హౌస్‌లు, డెకరేషన్, ఫొటో, వీడియో గ్రాఫర్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇతర చోట్ల నుంచి తగిన సామగ్రిని, మనుషులను అద్దెకు తెచ్చుకుంటున్నారు. పెళ్లి చేసేవారు వీటికి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చారు. ఇక పంతుళ్లు సైతం గ్రామాలు , పట్టణాల్లో ఎక్కువగా పెళ్లీ ముహూర్తాలు పెట్టడంతో ఇతర గ్రామాల్లోని వారి బంధువులను రప్పించుకుంటున్నారు.
ముహూర్తాలను దృష్టిలో పెట్టుకుని..
నాలుగు నెలల పాటు పెళ్లీలు జరగుతుండటంతో ఫంక్షన్‌హాల్స్‌కు డిమాండ్ నెలకొంది. ఇప్పటికే పెండ్లీ ముహూర్తాలు నిర్ణయించుకున్న పెళ్లి చేసే కుటుంబాలు 2 నెలల ముందరే ఫంక్షన్‌హాల్స్ బుక్ చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రైవేట్ ఫంక్షన్‌హాల్స్ 3500కు పైగా ఉండగా ప్రభుత్వ(టీటీడీ), కమ్యూనిటీ హాల్స్ మరో 5000 కు పైగా ఉన్నాయి. దీంతో చాలా మందికి ఫంక్షన్‌హాల్స్ దొరక్కపోవడంతో ఇండ్ల వద్ద, ఖాళీ స్థలాల్లో వివాహాలు చేయనున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
శ్రావణమాసం ప్రారంభం కావడంతో నేటి నుంచి నవంబర్ 26 వరకు వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా లక్షా 10 వేలకు పైగానే జంటలు ఒకటి కానున్నాయి. ఇప్పటికే 300 లకు పైగా పెళ్లీలకు ముహూర్తాలు పెట్టాను. 80 రోజుల విరామం తర్వాత 4 నెలలకు పైగా శుభ ముహూర్తాలు ఉండటంతో వేల కొత్త జంటలు వివాహంతో ఒక్కటవుతున్నాయి.- వేలేటి జయరామశర్మ, వేద పండితులు, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు
ఇదీ చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు
రెండు నెలల ముందే బుక్
పెళ్లిళ్లకు ఫంక్షన్‌హాల్స్ రెండు నెలల ముందే బుక్ అయ్యాయి. జులై, ఆగష్టు,సెపె్టంబర్‌లో జరిగే వివాహాలకు ముందు జాగ్రత్తగా చాలా మంది బుక్ చేసుకున్నారు. ఇంకా ఫంక్షన్‌హాల్స్ కావాలని వస్తున్నారు. కానీ, ఇప్పటికే బుక్ అయ్యాయని చెబుతుండటంతో ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. – కోమటిరెడ్డి రజనికాంత్‌రెడ్డి,ఫంక్షన్‌హాల్ యజమాని,దుబ్బాక
టెంట్‌హౌస్‌లకు ఫుల్ గిరాకీ
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందుగానే టెంట్‌హౌస్ సామగ్రిని బుక్ చేసుకుండ్రు. ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. సుమారు 80 రోజులు శుభకార్యాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాం. ప్రస్తుతం పెళ్లీ ముహూర్తాలు ఉండటంతో టెంట్‌హౌస్‌లకు గిరాకీ ఉంది. – దయాకర్‌రెడ్డి, టెంటుహౌస్ యజమాని