డాక్టర్‌ పట్టా అందుకున్న గిరిపుత్రిక! | Lakshmi Prasanna: The Success Story Of Becoming A Doctor And Farmer | Sakshi
Sakshi News home page

Women Power: డాక్టర్‌.. ఫార్మర్‌! డాక్టర్‌ పట్టా అందుకున్న గిరిపుత్రిక!

May 29 2026 9:44 AM | Updated on May 29 2026 10:27 AM

Lakshmi Prasanna: The Success Story Of Becoming A Doctor And Farmer

స్ఫూర్తి

‘ఇద్దరూ కూతుళ్లే!’ అని ఎగతాళి చేసినవారికి సరైన బదులిదే..!

చిన్నప్పుడు అమ్మానాన్నలతో పాటు పొలంలో వ్యవసాయ పనులు చేసే లక్ష్మీ ప్రసన్న డాక్టరేట్‌ పట్టా అందుకుంది. పొలంలో చెమటలు చిందిస్తున్న ఆ చిన్నారిని చూసి భూదేవి... ‘చదువులో కూడా నువ్వు ఇలాగే కష్టపడాలి బిడ్డా’ అని ఆశీర్వదించిందేమో ఆదివాసి పల్లెలో పుట్టి పెరిగిన లక్ష్మీ ప్రసన్న ఎంతో కష్టపడి యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేసింది. ఎంతోమంది ఆదివాసీ బిడ్డలకు స్ఫూర్తిని ఇస్తోంది.

తెలంగాణ రాష్ట్రం... మహబూబాబాద్‌ జిల్లాలోని కొత్తగూడ మండలంలో గట్టిగా వంద కుటుంబాలు కూడా ఉండని మారుమూల గ్రామం తాటివారివేంపల్లి. చుంచా పద్మ, లక్ష్మయ్యలకు ఇద్దరు కుమార్తెలు... లక్ష్మీప్రసన్న, మాధురి. ‘ఇద్దరూ కూతుళ్లే!’ అని ఎగతాళి చేసేవారు కొందరు. అలా హేళన చేసిన వారికి సమాధానం చెప్పాలని అనుకున్నారు పద్మ, లక్ష్మయ్య దంపతులు.

లక్ష్మీప్రసన్న పదవ తరగతిలో 9.7 జీపీఏ సాధించింది. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు గిరిజన సంక్షేమశాఖ  ఏర్పాటు చేసిన ‘కాలేజీ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ’లో సీటు సాధించి ఇంటర్‌ చదివింది. 940 మార్కులు స్కోర్‌ చేసింది. అశ్వారావుపేట అగ్రికల్చర్‌ కళాశాలలో బీఎస్సీ చేసింది. అక్కడ 8.45 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించిన లక్ష్మీప్రసన్న బెంగళూరులోని గాంధీక్రిష్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ సీటు సాధించింది.

ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా... లక్ష్యం సాధించాలి...
'మారుమూల ఆదివాసీ గూడేలలో చదువుకున్నవారి సంఖ్య తక్కువ. పెద్ద చదువులు చదివిన వారు మరీ తక్కువ. చిన్ననాటి నుండి అమ్మానాన్నలు పెద్ద చదువులు చదవాలి అని చెప్పేవాళ్లు. వారిప్రోత్సాహమే నాకు బలాన్ని ఇచ్చింది. మా గ్రామం నుండి సమీప పట్టణాలకు వెళ్లాలంటే కాలినడకన కొంత దూరం నడిస్తే కానీ బస్సులు ఎక్కలేని పరిస్థితి. 

ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆడ బిడ్డలు చదవడం అంటే ఇబ్బందే. అయితే మనకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు మనకు అడ్డుగోడలు కావు. వ్యవసాయ శాస్త్రవేత్తగా చిన్న సన్నకారు రైతుల ఇబ్బందులను తొలగించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు మాలాంటి గిరిజన, ఆదివాసీ గూడేల్లో ఉన్న  ఆడపిల్లలు చదువులో రాణించడానికి, తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన సహకారం అందిస్తాను.' 
– చుంచ లక్ష్మీ ప్రసన్న

తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు
వ్యవసాయ పనులలో అమ్మానాన్నలకు తోడు ఉండేది లక్ష్మీప్రసన్న. దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, నాట్లు వేయడం, కలుపులు, కోతలు అన్ని పనులు చేసేది.  ‘సాయిల్‌ సైన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌’ అంశంపై సీనియర్‌ ఆచార్యులు డీవీ నవీన్‌ ఆధ్వర్యంలో పరిశోధన మొదలుపెట్టింది.

భూసారం తగ్గడం, సేంద్రీయ ఎరువుల వినియోగం లేకపోవడం, రసాయన ఎరువులతో భూమి విషతుల్యం కావడం మొదలైన అంశాలపై పరిశోధన మొదలు పెట్టింది లక్ష్మి. పరిశోధనలో తన చిన్ననాటి అనుభవాలు బాగా ఉపయోగపడ్డాయి. లక్ష్మీప్రసన్న ప్రజెంట్‌ చేసిన పరిశోధన వ్యాసం చూసి శభాష్‌ అన్న ఆచార్యుల బృందం డాక్టరేట్‌కు ఎంపిక చేసింది. కర్నాటక గవర్నర్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టా తీసుకుంది లక్ష్మీప్రసన్న.
– ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement