చిత్రాంక్‌ని రెండు రోజుల నుంచి ఓ సమస్య బాధిస్తోంది. అతనికి ఎదురు చూడని డబ్బు వచ్చింది. అదీ పెద్ద మొత్తంలో. అతను పనిచేసే కంపెనీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేస్తూండగా, ఆఖరి దశలో ఓ గడ్డు సమస్య వచ్చి ఆ ప్రాజెక్ట్ ముందుకి కదలడం లేదు. ఆ కంపెనీ సీఈవో ఆందోళనగా ఉన్నాడు. చిత్రాంక్ దాన్ని ఆవిష్కరించటంతో సీఈవో అతనికి పదిలక్షల రూపాయల నగదు బహుమతిని ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ కారుని అమ్మేసి ఆ పదిలక్షలతో కొత్త కారుని కొనాలని అనుకున్నాడు. కాని అందుకు అతనికి మరో ఆలోచన అడ్డం వస్తోంది.
చిత్రాంక్‌కి చిన్నప్పటి నుంచి తన తండ్రివైపు బంధువులని ఆదుకోవాలని కోరిక. వారంతా పేదవారు. తన బీద అత్తయ్యకి అప్పుడప్పుడు చిన్న మొత్తాలు సహాయం చేస్తుండేవాడు. ఈ మధ్య చిత్రాంక్‌ని అతని అత్తయ్య తన ఇద్దరు పిల్లల కోసం పెద్ద మొత్తం అడిగింది. డబ్బు లేక ఆ కోరిక తీర్చలేకపోయాడు. తనకి ఆ పదిలక్షలు లేకపోయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేదు. అన్ని అవసరాలకి ఇప్పుడున్న కారు చాలు. కాబట్టి ఆ పదిలక్షలని తన అత్తయ్య పిల్లలకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. కొద్దిరోజుల క్రితమే అత్తయ్య రెండో కొడుకు తనకి నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్ పెట్టుకోవాలని ఉందని మాటల్లో చెప్పాడు. అతనికి నాలుగు లక్షలు, మిగిలింది వాడి అక్క పెళ్ళికి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన వచ్చినంత త్వరగా దాన్ని ఆచరించడానికి అతనికి మనసు రాలేదు. తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు దాన్ని తేలిగ్గా దానం చేయగలుగుతారని, ఎక్కువ మొత్తం డబ్బున్న వాళ్ళు చేయలేరన్న నిజం అతనికి అనుభవపూర్వకంగా తెలిసింది. అతనికి ఆ సొమ్ముని అత్తయ్య కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని ఉంది. అదే సమయంలో చూస్తూ చూస్తూ అంత మొత్తం ఇవ్వడానికి మనస్కరించడం లేదు. గత రెండు రోజులుగా చిత్రాంక్ మనసులో ఈ విషయం మీద తర్జనభర్జనలు, తర్కవితర్కాలు సాగుతున్నాయి. చిత్రాంక్ బ్రహ్మచారి. కాబట్టి సలహా తీసుకోడానికి భార్య కాని, తల్లితండ్రులు కాని లేరు.
అతను ఆ ఆదివారం సాయంత్రం తను చాలాకాలంగా వెళ్ళాలనుకునే చెరువుకి చేరుకున్నాడు. చుట్టూ కొబ్బరి చెట్లు. దూరంగా కొండల వరుస. అతనికి అక్కడి ప్రశాంతత నచ్చుతుంది. కారుని పార్క్ చేసి నడిచి, చెరువు ఒడ్డున ఉన్న సిమెంట్ బెంచ్ దగ్గరికి చేరుకుని జేబురుమాలుతో దాని మీద దులిపి కూర్చున్నాడు. ఎదురుగా దాదాపు వంద ఎకరాలకి పైగా విస్తీర్ణం ఉన్న ఆ చెరువు మీంచి చల్లటి గాలి వీస్తోంది. అవతల ఓ చిన్న గ్రామం ఉంది. నీళ్ళ వంకే చూస్తూంటే అందులో కొన్ని బాతులు కనిపించాయి.
కొద్దిసేపటికి ఒకాయన చెరువు దగ్గరికి వచ్చాడు. ఆయన ఒంటి మీద మాసిన ఖాకీ రంగు నిక్కర్, బనీన్ ఉన్నాయి. ఆయనకి అరవై ఏళ్ళ దాకా ఉండచ్చని తెల్ల జుట్టుని, మొహాన్నిబట్టి అంచనా వేశాడు. ఆయన బెంచ్ మీద కాక ఒడ్డున కూర్చున్నాడు. కొద్దిసేపాగి తనతో తెచ్చిన మూట తీసి అందులోంచి ఏదో తీసి నీళ్ళలోకి చల్లాడు. తర్వాత ఆయన వెల్లకిలా పడుకుని కూనిరాగం తీస్తూ ఆకాశంలోకి చూడసాగాడు. ఆయన లోకంలో ఎలాంటి దుఃఖం లేనివాడుగా చిత్రాంక్‌కి తోచింది. బాతులు దూరం నుంచి బిలబిలా ఆయనవైపు ఈదుకుంటూ వచ్చాయి. ఆయన నీళ్ళల్లో చల్లిన, నీటి మీద తేలే మరమరాలని అవి తినసాగాయి. చిత్రాంక్‌కి ఆశ్చర్యం వేసింది. ఆయన దరిద్రుడిలా ఉన్నాడు. ఆ బాతులు ఆయనవి కావు. అయినా ఆయన వాటికి మేత తెచ్చి వేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అడిగాడు.
‘‘ఏం చేస్తున్నావు?’’
‘‘ఆకాశంలోకి చూస్తున్నాను.’’
‘‘వాటికి ఏదో వేస్తున్నట్లున్నావు?’’
‘‘అవును. మరమరాలు.’’
‘‘అవి నీ పెంపుడు బాతులా?’’
‘‘కావు.’’
‘‘నువ్వు ఉండేది ఎక్కడ?’’
దూరంగా ఉన్న గ్రామం వంక చేత్తో చూపించాడు.
‘‘రోజూ వాటికి మరమరాలు తెచ్చి వేస్తుంటావా?’’
‘‘మూడు నాలుగు రోజులకోసారి.’’
తనకేమీ కాని బాతులని ఆయన ఆదుకుంటున్నాడు. తన తండ్రి మేనల్లుడిని, మేనకోడల్ని ఆదుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నా, అవకాశం వచ్చేసరికి తను వెనక్కి వెళ్ళడం సబబు కాదనే గట్టి నిర్ణయాన్ని ఆయన్ని చూసి చేసుకోగలిగాడు. ఆయన నిశ్శబ్దంగా మూటలోంచి గుప్పెడు మరమరాలు తీసి చిత్రాంక్ చేతిలో పోశాడు. చిత్రాంక్ వాటిని నీళ్ళలోకి చల్లగానే బాతులు వాటి మీదకి ఎగబడ్డాయి. తను మనిషి. స్వార్థం ఆవరించుకున్న మనిషి అనుకున్నాడు. తన సమస్యకి ఇంత తేలిగ్గా జవాబు దొరుకుతుందని ఎదురుచూడని చిత్రాంక్ ఆయనతో చెప్పాడు.
‘‘నువ్వు చాలా మంచివాడివి.’’ఆయన జవాబు చెప్పలేదు. చిత్రాంక్ తన కారు దగ్గరికి నడిచి తాళం తీసి, లోపలకి ఎక్కి కూర్చుని తేలికపడ్డ మనసుతో ఇంటి దారి పట్టాడు. కారు శబ్దం బాగా దూరం అయ్యేదాకా ఆగి ఆ వ్యక్తి లేచి ఓసారి చుట్టూ చూశాడు. తర్వాత సంచీలోంచి మరమరాలని తీసి ఒడ్డున పోసి సంచీని ఖాళీ చేశాడు. కొన్ని బాతులు నీళ్ళల్లోంచి నేల మీదకి వచ్చి వాటిని తినసాగాయి. ఆయన ఓ బాతుని అందుకుని దాని మెడ విరిచాడు. అది రెక్కలు కొట్టుకుంటూంటే దాన్ని ఆ సంచీలో వేసుకుని లేచాడు. కొద్దిసేపట్లో ఎర్రబడ్డ సంచీ నిశ్చలమైంది. ఆ వ్యక్తి చెరువు వెనక ఉన్న తన గ్రామానికి బయలుదేరాడు.
∙మల్లాది వెంకట కృష్ణమూర్తి


