నాలుగు కాళ్లు... ఆమె శరీరం ఓ మిస్టరీ..

Josephine Myrtle Carbon Story - Sakshi

‘మైర్‌ట్లే కార్బిన్‌ ’.. ఈ పేరు ప్రపంచానికే ఓ వింత. ఆమె జీవితంలోని కొన్ని పేజీలు చరిత్రకు కూడా చిక్కని మిస్టరీ. వైద్య శాస్త్రానికి ఓ మిరాకిల్‌. డాక్టర్ల భాషలో చెప్పాలంటే ఆమె ఒకరు కాదు ఇద్దరు. ఒకటిగా కనిపించే కవలలు.

ఆ కథే ఇది.. 
జన్యు లోపాల కారణంగా.. అసాధారణ రూపంతో వింతగా జన్మించిన శిశువు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 1868లో లింకన్‌  కౌంటీలో నాలుగు కాళ్లతో జన్మించిన కార్బిన్‌ మాత్రం 60 ఏళ్లు జీవించింది. పిండం సరిగా వృద్ధిచెందకపోవడం వల్ల కారణంగా కవలలుగా పుట్టాల్సిన శిశువులు ఒకరుగా పుట్టారని, ఇది అరుదైన డిపైగస్‌ అని అప్పట్లో డాక్టర్లు నిర్ధారించారు. రెండు జతల కాళ్లతో పాటు.. రెండు జననేంద్రియాలు, రెండు గర్భాశయాలతో ఉన్న ఈమె ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చి సంచలనంగా నిలిచింది.

మైర్‌ట్లే కార్బిన్‌ నడుము పైభాగం వరకు సాధారణంగానే ఉంటుంది. ఆమె శరీరం లోపల మాత్రం అవయవాలు వేర్వేరుగా ఉండేవి. ఉండటానికి నాలుగు కాళ్లు ఉన్నా ఒక కాలు మాత్రమే పని చేసేది. మిగిలినవి బలహీనంగా ఉండేవి. ఒక్కో కాలికి మూడేసి వేళ్లు మాత్రమే ఉండేవి. అయితే ఆమె రూపమే ఆమెకు వరమైంది. చనిపోతుందనుకున్న బిడ్డ ఆరోగ్యంగా పెరగడంతో పత్రికలు ఆమెని సెలబ్రిటీని చేశాయి. దాంతో ఒక సర్కస్‌ కంపెనీ ఆమెను తమ టీమ్‌లో చేర్చుకుంది. చిన్న వయసులోనే సెలబ్రిటీ అయిన కార్బిన్‌  ఆ రోజుల్లోనే వారానికి సుమారు 450 డాలర్లు (రూ.31,905) సంపాదించేది.

సహజంగానే అందగత్తె అయిన కార్బిన్‌  19 ఏళ్ల నిండేసరికి క్లింటన్‌  బిక్‌నెల్‌ అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె సర్కస్‌లో పనిచేయడం మానేసింది. ఓ రోజు ఉన్నట్టుండి ఎడమ వైపు కడుపులో నొప్పి రావడంతో.. ఆమెని పరీక్షించిన వైద్యులు గర్భవతి అని తేల్చారు. ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్నాయనే విషయాన్ని కూడా అప్పుడే కనిపెట్టారు. మొత్తానికీ కార్బిన్‌కు నలుగురు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ జన్మించారు.

కార్బిన్‌  60వ పుట్టిన రోజుకు రెండువారాల ముందు.. అంటే 1928లో ఆమె కుడికాలికి స్ట్రెప్టోకోక్సల్‌ ఇన్ఫెక్షన్‌  సోకింది. అప్పట్లో దానికి చికిత్స లేదు. దాంతో ఆ వ్యాధి సోకిన వారం రోజులకే కార్బిన్‌  మరణించింది. ఆమె భౌతిక కాయాన్ని పరిశోధనల నిమిత్తం తమకు అప్పగిస్తే భారీగా నగదు ఇస్తామని పలు వైద్యబృందాలు కోరినా ఆమె కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. పైగా ఆమె సమాధిని కాంక్రీట్‌తో నిర్మించి అది గట్టిపడేవరకు సమాధికి కాపలా ఉన్నారట.

ఆ కాలంలో వైద్య పరికరాలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో పరిశోధకులు కార్బిన్‌  శరీరం పనితీరును పూర్తిగా అంచనా వేయలేకపోయారు. అప్పట్లో ఆమెకు పుట్టిన ఐదుగురు పిల్లలు కూడా ఒకే కడుపున పుట్టినవారు కాదని, ఆమెకున్న రెండు వేర్వేరు గర్భశయాల్లో పుట్టారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉండేవి. అయితే ఆ విషయాన్ని కూడా కార్బిన్, ఆమె వైద్యులు రహస్యంగానే ఉంచారు. దాంతో నాలుగు కాళ్ల సుందరిగా పేరుతెచ్చుకున్న కార్బిన్‌  జన్మ రహస్యం అంతుచిక్కని మిస్టరీగానే ముగిసింది. 
సంహిత నిమ్మన

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top