డ్యాన్స్‌... అంతకు మించి... | International Dance Day on April 29: Classical Dancer Shovana Narayan | Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌... అంతకు మించి...

Apr 29 2026 1:56 AM | Updated on Apr 29 2026 1:56 AM

International Dance Day on April 29: Classical Dancer Shovana Narayan

నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం

డ్యాన్స్‌ అనేది కాస్త సరదా కోసం మాత్రమే కాదు. ఒత్తిడి నుంచి మనల్ని మనం విముక్తి చేసుకునే మార్గం. సామాజిక అంశాలపై జాగృత పరిచే సాధికార సందేశం. కథక్‌ ద్వారా స్త్రీ సాధికారత, లింగ సమానత్వంపై నృత్యరూపకాలు రూపొందిస్తున్నారు శోవన నారాయణ్‌. మానసిక సమస్యలకు చికిత్సగా డాన్స్‌ మూమెంట్‌ థెరపీ (డిఎంటీ)ని ఉపయోగిస్తున్నారు రెనెల్‌...

సామాజిక నృత్యరూపకాలు
తన కథక్‌ నృత్యానికి సామాజిక చైతన్యాన్ని జోడిస్తున్నారు పద్మశ్రీ అవార్డ్‌ గ్రహీత, ప్రముఖ నర్తకి శోవన నారాయణ్‌. మూడేళ్ల వయసులోనే నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది శోవన. ‘నాట్యం’ అనగానే ఆమె తోటి పిల్లలుపారిపోయేవారు. శోవన మాత్రం శ్రద్ధగా నేర్చుకునేది.

మహిళల సమస్యలు, దివ్యాంగుల సమస్యలు, రకరకాల సామాజిక అంశాలపై ఎన్నో నృత్యరూపకాలను రూపొందించారు శోవన. తీరిక లేని పనుల మధ్య కూడా రకరకాల స్వచ్ఛంద సంస్థల కోసం తగిన సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలతో కలిసి ర్యాంప్‌ వాక్‌ చేస్తారు. కార్గిల్‌ యుద్ధం వల్ల ప్రభావితమైన కుటుంబాలు, సునామీ బారిన పడిన అమాయక ప్రాణులు, వినాశకరమైన వరదల వల్ల చితికిన జీవితాలు, భ్రూణ హత్యలు... ఇలా ఎన్నో సమస్యలు, విషాదాలను తన నాట్యానికి ఇతివృత్తంగా చేసుకుంటున్నారు శోవన. నృత్యకారుల ప్రతిభను గుర్తించడానికి, వారిని తగిన రీతిలో గౌరవించడానికి రకరకాల ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆమె నిర్వహించే ‘రిథమ్‌ అండ్‌ జాయ్‌’వంటి కార్యక్రమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆసవరి నృత్య పాఠశాల
‘ఆసవరి’ పేరుతో గత మూడు దశాబ్దాలుగా నృత్య పాఠశాల నిర్వహిస్తున్నారు శోవన. కేవలం ఇద్దరు విద్యార్థులతో మొదలైన ‘ఆసవరి’ ఆ తరువాత కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. నృత్యంలో పెద్ద పేరు తెచ్చుకోవాలని కలలు కనే విద్యార్థులకు వేదికగా మారింది. ‘నా దృష్టిలోపాఠశాల అంటే ఇటుకలు, సిమెంట్‌ కాదు. విద్యార్థులు, వారు నేర్చుకునేపాఠాలు, వారి నిరంతర ఉత్సాహం’ అంటున్నారు శోవన. ‘ఆసవరి’ ఎంతో మందిని నృత్యకళాకారులుగా తీర్చిదిద్దింది. అన్నిటికంటే ముఖ్యంగా నృత్య విద్యార్థులలో మానవతా విలువలు, క్రమశిక్షణపాదుకొల్పింది. నృత్యాన్నే కాకుండా, సృజనాత్మక ఆలోచనలను, సహనంతో కూడిన విశాల దృక్పథాన్ని కూడా అలవరుస్తోంది ఆసవరి. కొన్నిసార్లు సంప్రదాయవాదులను ఆశ్చర్యపరిచే అసాధారణ అంశాలను నృత్యప్రదర్శనలుగా రూపొందిస్తుంది.

డ్యాన్స్‌ మూమెంట్‌ థెరపీ
శరీరానికి, మనస్సుకు మధ్య  సమతుల్యత సాధించేందుకు నృత్యం అనేది చికిత్సాపరమైన వ్యాయామంగా వివిధ పద్ధతులలో ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉంది. డ్యాన్స్‌ మూమెంట్‌ థెరపీ (డిఎంటీ) అనేది అటువంటి విధానాలలో ఒకటి. డిఎంటీ నృత్యప్రక్రియ ద్వారా మానసిక సమస్యలు, ఒత్తిడిని అధిగమించే మార్గాన్ని ప్రజలకు చూపించడంలో సహాయపడుతున్నారు పుణెకు చెందిన రెనెల్‌.

రెనెల్‌కు మొదట్లో డ్యాన్స్‌ మూమెంట్‌ థెరపీ(డిఎంటీ) గురించి ఏమీ తెలియదు. అనుకోకుండా ఒకరోజు ముంబైలో డిఎంటీ క్లాస్‌కు హాజరయ్యారు. అది ఆమె జీవితాన్నే మార్చేసింది. ‘డిఎంటీ క్లాస్‌లలోపాల్గొన్న తరువాత మానసిక సమస్యలను అధిగమించడంలో నృత్య ప్రభావాన్ని స్వయంగా తెలుసుకునే అవకాశం దొరికింది. అందుకే డ్యాన్స్‌ మూమెంట్‌ థెరపీని ఇతరులకు కూడా పరిచయం చేయాలనుకున్నాను. డిఎంటీ నృత్యప్రక్రియ అమెరికాలాంటి దేశాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. 1950లో అక్కడ మొదలైంది. మన దేశంలో మాత్రం కొత్త’ అంటున్నారు రెనెల్‌.

ప్రశాంత మార్గంలో....
లింగ ఆధారిత హింసకు గురైన వారు, మానవ అక్రమ రవాణా బాధితులు, ప్రమాదంలో ఉన్న పిల్లలు... మొదలైన వారిని స్వస్థపరచడానికి డిఎంటీ నమూనాను అభివృద్ధి చేసిన ‘కోల్‌కతా సంవేద్‌’ అనే స్వచ్ఛంద  సంస్థతో కలిసి పనిచేస్తున్నారు రెనెల్‌. ‘అంతర్గత సంఘర్షణ లోపల అణచివేయబడినప్పటికీ, వారు చేసే ప్రతి పనిలో కోపం, ఆత్మన్యూనతా భావం, ప్రతికూలతలు వ్యక్తం అవుతుంటాయి. ఈ నేపథ్యంలో డ్యాన్స్‌ మూమెంట్‌ థెరపీ అనేది స్వీయ–వ్యక్తీకరణ ద్వారా వారిని సరిౖయెన మార్గంలోకి తీసుకువచ్చి ప్రశాంతంగా ఉండేలా, ప్రతికూల ఆలోచల నుంచి బయటపడేలా చేస్తుంది’ అంటున్నారు రెనెల్‌.

ట్రాఫిక్‌ రూల్స్‌ డ్యాన్స్‌!
ఇండోర్‌కు చెందిన ఎంబీఎ స్టూడెంట్‌ శుభీ జైన్‌ ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి వినూత్న విధానంతో సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షించింది. ‘ట్రాఫిక్‌ రూల్స్‌పాటించండి’ అని ఆమె ఉపన్యాసాలు ఇవ్వదు. ఫన్నీ డ్యాన్స్‌ మూమెంట్స్‌ ద్వారా ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కలిగిస్తోంది. ‘ప్రజలకు ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కలిగించి, వాటినిపాటించేలా చేయడమే నా లక్ష్యం’ అంటున్న శుభీ జైన్‌ ట్రాఫిక్‌ నియమాలను తు.చ తప్పకుండాపాటించేవారికి వినూత్న డ్యాన్స్‌ స్టెప్స్‌తో సెల్యూట్‌ చేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తుంటుంది.

సారీ... డ్యాన్స్‌ వయసు ఎరుగదు!
డెబ్బై అయిదు సంవత్సరాల వయసులో వేగంగా నడవడమే కష్టం. ఈ బామ్మ మాత్రం అలా కాదు. ఒక హిందీపాటకు ఆమె చేసిన డ్యాన్స్‌ వీడియోకు 47.4 మిలియన్‌లకు పైగా వ్యూస్, లక్షలాది కామెంట్స్‌ వచ్చాయి. ‘ప్రతి విషయాన్ని వయసుతో ముడిపెట్టడం మనకు అలవాటైంది. వృద్ధులు కూడా ఒకప్పుడు పిల్లలే, యువతరంలో భాగమే. అభిరుచులు అనేవి ప్రాణవాయువులు. అవి వయసుతో పాటు ఆగిపోవు అని చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం’ అని ప్రశంసించారు నెటిజనులు.

ఎనభై సంవత్సరాల పూల్‌మణి సబర్‌ అనే వృద్ధురాలు జంషెడ్‌పూర్‌లోని గిరిజన సాంస్కృతిక కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ‘సబర్‌’ నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ, చెమటలు పడుతున్నప్పటికీ నృత్యం చేయడం ఆమెకు కష్టం కాలేదు. అలసట కనిపించకపోవడం మరో విశేషం. అస్సామీ సంప్రదాయ దుస్తులతో మరో బామ్మ బిహు సాంగ్‌కు వేసిన డ్యాన్స్‌ ఆహా అనిపించింది. కేరళకు చెందిన 82 సంవత్సరాల బామ్మ తన 25 సంవత్సరాల మనవడితో కలిసి చేసిన ఫోక్‌ డ్యాన్స్‌ ‘వారెవా’ అనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement