ధ్రువపు ఎలుగుబంటి వింతలెన్నో! | Interesting Facts About The Polar Bear | Sakshi
Sakshi News home page

ధ్రువపు ఎలుగుబంటి వింతలెన్నో!

May 30 2026 12:35 PM | Updated on May 30 2026 12:39 PM

Interesting Facts About The Polar Bear

ఉత్తర ధ్రువం అంటే మంచు, మంచు, ఇంకా మంచు. అక్కడ మనం రెండు నిమిషాల్లో గడ్డకట్టేస్తాం.  కానీ అక్కడ ఒక రాజు హాయిగా తిరుగుతుంటాడు. పేరు ‘ధ్రువపు ఎలుగుబంటి’. ఇంగ్లీష్‌లో ‘పోలార్‌ బేర్‌’ అంటారు. ఇది మామూలు ఎలుగుబంటి కాదు. దీని దగ్గర చాలా వింతలు ఉన్నాయి.

వింత 1: తెల్లగా లేదు!
అదేంటి, తెల్లగా కదా కనిపిస్తుంది అంటారా? దాని బొచ్చు అసలు తెల్లగా ఉండదు. గాజు పీచులా పారదర్శకంగా (్టట్చnటp్చట్ఛn్ట) ఉంటుంది. సూర్యుడి కాంతి దాని మీద పడి మనకు తెల్లగా కనిపిస్తుంది. దాని చర్మం మాత్రం నల్లగా ఉంటుంది. ఆ నలుపు ఎండను పీల్చుకుని శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.

వింత 2 వాసన రాడార్‌!
ధ్రువపు ఎలుగుబంటి ముక్కు సూపర్‌ పవర్‌. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీల్‌ వాసనను కూడా పసిగట్టేస్తుంది. అంటే హైదరాబాద్‌లో ఉండి సికింద్రాబాద్‌లో బిర్యానీ వాసన చూసినట్టు.

వింత 3 స్విమ్మింగ్‌ ఛాంపియన్‌
దీనికి నీళ్లంటే భయం లేదు. ఆగకుండా 100 కిలోమీటర్లు ఈదుతుంది. దాని కాళ్లు తెడ్డుల్లా పెద్దగా ఉంటాయి. మంచు నీళ్లలో గంటల తరబడి చేపల్లా ఈదేస్తుంది.

వింత 4 హీటర్‌  బాడీ
దీని ఒంటి మీద 11 సెంటీమీటర్ల మందం కొవ్వు ఉంటుంది. అది ఒక పెద్ద బ్లాంకెట్‌ లాంటిది. బయట మైనస్‌ 40 డిగ్రీలు ఉన్నా, దీని బాడీ మాత్రం వెచ్చగా ఉంటుంది. కానీ పాపం, ఇప్పుడు దీనికి కష్టం వచ్చింది. భూమి వేడెక్కిపోతుంటే అక్కడ మంచు కరిగిపోతోంది. మంచు లేకపోతే అది సీల్స్‌ని వేటాడలేదు. ఆకలితో బాధపడుతోంది. మనం కరెంట్, పెట్రోల్‌ వృధా చెయ్యకుంటే ఈ తెల్ల రాజు హాయిగా బతుకుతాడు.

Advertisement
 
Advertisement
Advertisement