రోడ్డుపై కనికట్టు..బొగ్గు, చాక్‌పీస్‌లతో ఒక కాలువను సృష్టించినా! వీడియోలతో

Indian Woman Poonam 3D Street Artist Mesmerizes With Art - Sakshi

పశ్చిమ బెంగాల్‌లోని భద్రేశ్వర్‌ అనే ఊళ్లో రోడ్ల మీద హఠాత్తుగా డాల్ఫిన్‌ దుముకుతుంటుంది. గోడ నిలబడుతుంది. గుంత ఉందనే భ్రాంతి కలుగుతుంది. పూనమ్‌ అనే గృహిణి ఇలా 3డి ఆర్ట్‌తో కనికట్టు చేస్తోంది. ఆమె వీడియోలు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

కోల్‌కతా నుంచి భద్రేశ్వర్‌ గంటన్నర దూరం. ఒకప్పుడు అది వేరే ఊరుగాని ఇప్పుడు దాదాపుగా సిటీలో కలిసిపోయింది. ఆ ఊరు ఒకప్పుడు జూట్‌ మిల్లుకు ప్రసిద్ది. ఇప్పుడు పూనమ్‌ వేస్తున్న త్రీడీ బొమ్మలకే ప్రసిద్ధి చెందుతోంది.

భద్రేశ్వర్‌లోని ఇరుకు వీధుల్లో పూనమ్‌ హటాత్తుగా ప్రత్యక్షమై బొగ్గు, చాక్‌పీస్‌లతో ఒక కాలువను సృష్టించినా, బావిని తవ్వినా త్రీ డైమన్షనల్‌ ఇల్యూజన్‌ వల్ల నిజంగా అనిపిస్తాయి. థ్రిల్‌ పుట్టిస్తాయి. వీటిని పూనమ్‌ రీల్స్‌గా, షార్ట్‌ వీడియోస్‌గా విడుదల చేయడం వల్ల వైరల్‌గా మారుతున్నాయి. బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంటున్నాయి.

‘సాక్షి’ పలకరింపు
3 లక్షల సబ్‌స్క్రయిబర్లతో ‘పూనమ్‌ ఆర్ట్‌ అకాడెమీ’ యూ ట్యూబ్‌ చానల్‌  పూనమ్‌ వేస్తున్న త్రీడీ బొమ్మల వీడియోలతో ట్రెడింగ్‌లో ఉంటోంది. ఇప్పటికి ఆమె వీడియోలకు దాదాపు 14 కోట్ల వ్యూస్‌ వచ్చాయంటే ఎంత మంది ఎక్కడెక్కడ చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ పేజీలో ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ‘సాక్షి’ పలకరించితే పూనమ్‌ ఉత్సాహంగా తన విశేషాలు చెప్పింది. కేవలం చూడటం ద్వారానే ఈ కళను నేర్చుకున్నానని చెప్పింది.

ఎంఏ బిఇడి చదివి
పూనమ్‌ భద్రేశ్వర్‌లోనే పుట్టి పెరిగింది. ఎం.ఏ, బీఈడి చేసింది. అదే ఊళ్లో కమర్షియల్‌ ఆర్టిస్ట్‌గా, త్రీడీ ఆర్టిస్ట్‌గా ఉన్న చందన్‌ను వివాహం చేసుకుంది. చందన్‌ కూడా తన బొమ్మలతో సోషల్‌ మీడియాలో ఫేమస్‌. కాని పెళ్లయ్యాక 2002 నుంచి పూనమ్‌ కూడా వీడియోలు రిలీజ్‌ చేయడం మొదలుపెట్టి గుర్తింపు పొందింది.

‘చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలంటే ఆసక్తి. మా స్కూలు మాస్టారు ఒకాయన నాలో బొమ్మల గురించి ఆసక్తి పెంచారు. నా భర్త చందన్‌ కూడా ఆర్టిస్ట్‌ కావడంతో పెళ్లయ్యాక నేను బొమ్మలు ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టాను. అయితే నా భర్త త్రీడీ బొమ్మలు వేయడంలో ఎక్స్‌పర్ట్‌. నేను అతన్ని నేర్పించమని అడగలేదు. కేవలం చూస్తూ నాకు నేనుగా నేర్చుకున్నాను.

త్రీడి బొమ్మ గీయాలంటే కొలతల్లోనే ఉంది అంతా. అలాగే షేడ్‌ ఎక్కడ ఇవ్వాలో తెలియాలి. అది నేను నేర్చుకున్నాను. ముఖ్యంగా నేనూ నా భర్తా, పిల్లలూ సులభంగా బొమ్మలు గీసేలా టెక్నిక్స్‌ కనిపెట్టాం. అవి వీడియోల ద్వారా చెబుతున్నాం... అలాగే నేరుగా కూడా క్లాసులు చెప్పి నేర్పిస్తున్నాం. మా కృషి ఆదరణ పొందడం ఆనందంగా ఉంది’ అని తెలిపింది పూనమ్‌.

ప్రత్యేక ఆహార్యం
పూనమ్‌ తన అన్ని వీడియోల్లో చీరకట్టుతో, తల మీద కొంగు కప్పుకుని కనిపిస్తుంది. పూర్తిగా గృహిణి ఆహార్యంలో ఉండటం వల్ల, అలాంటి ఆహార్యంలో త్రీడీ బొమ్మలు వేసే స్త్రీలు ఎవరూ లేరు కనుక ఆమె వీడియోలు కుతూహలం రేపుతున్నాయి.

‘మా వాడలోని పిల్లలంతా నా వీడియోలకు సహకరిస్తుంటారు. బావి గీసి దానిలో దూకమంటే దూకుతున్నట్టుగా యాక్ట్‌ చేస్తారు. లేని మెట్ల మీద నుంచి గెంతుతారు. వారు లేకపోతే నా వీడియోలు లేవు’ అంది పూనమ్‌. ఆమె ప్రతి ఆల్ఫాబెట్‌తో బొమ్మలు ఎలా గీయాలో వీడియోలు చేసింది. అలాగే అంకెలతో కూడా. ప్రతి గీతను బొమ్మగా మార్చే ఆమె ప్రతిభ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఉదాహరణకు ఒక ఇంటి ముందు మెట్లు లేకపోయినా మెట్లు గీయడంతో ఆ ఇంటి గడప లుక్కే మారి ఆశ్చర్యం కలుగుతుంది. పూనమ్‌ వీడియోలు ఆమెకు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ప్రతిభ ఉంటే ఉన్న చోట నుంచే ఉనికి పొందవచ్చంటోంది పూనమ్‌.

చదవండి: బాదం పంట దిగుబడులకు ఇవే ఆధారం! తేనెటీగలు లేకుంటే..
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top