చిలుకల తల్లికి గ్రీన్‌ ఆస్కార్‌ | Indian conservationist Parveen Shaikh has won the prestigious Whitley Award 2026 | Sakshi
Sakshi News home page

చిలుకల తల్లికి గ్రీన్‌ ఆస్కార్‌

May 13 2026 1:29 AM | Updated on May 13 2026 1:29 AM

Indian conservationist Parveen Shaikh has won the prestigious Whitley Award 2026

చంబల్‌... ఒకప్పుడు బందిపోట్లకు నెలవు. ఇప్పుడు అదే చంబల్‌ అంతరించిపోతున్న అందమైన పక్షి జాతికి అభయారణ్యం. ఆ మార్పుకు కారణం – పర్వీన్‌ షేక్‌. నిప్పుకణిక లాంటి ముక్కుతో చిలుకల్లా ఉండే ‘ఇండియన్‌ స్కిమ్మర్‌’ పక్షులు ఒరిజినల్‌గా ఏ దేశానివి. అవి మన దేశానికి వలస పక్షులా? లేక మన దేశంలో ఉంటాయా? ఆ పక్షులు అంతరిస్తుంటే ఆమె వాటి సంఖ్యను పెంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అందుకే ‘గ్రీన్‌ ఆస్కార్స్‌’గా పిలిచే ‘విట్లీ అవార్డు’ ఆమెను వరించింది.

లండన్ లోని రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీ హాల్‌... వేదిక మీద బ్రిటన్‌ రాకుమారి ప్రిన్సెస్‌ ఆన్‌... ఆమె చేతిలో 50,000 పౌండ్ల చెక్‌... ప్రిన్సెస్‌ ఆన్‌ నుంచి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ‘విట్లీ అవార్డు’ అందుకునేందుకు పర్వీన్‌ షేక్‌ వేదిక ఎక్కగానే చప్పట్లు మార్మోగాయి. అంతరించిపోతున్న ‘ఇండియన్‌ స్కిమ్మర్‌’ అనే చంబల్‌ చిలుకలను కాపాడినందుకు ఆమెకు గౌరవం. ‘ఈ అవార్డు నాకు కాదు, చంబల్‌ ఇసుకలో గూళ్లకు కాపలా కాసిన నా గ్రామీణ సోదరులకు’ అని వేదిక మీద ఆమె చెప్పిన మాటలకు హాల్‌ అంతా చప్పట్లతో మార్మోగింది. ‘గ్రీన్‌ ఆస్కార్‌’గా భావించే విట్లీ అవార్డును అందుకున్న పర్వీన్‌ తాను చేసిన సుదీర్ఘ పోరాటాన్ని తలుచుకుని ఉద్వేగం పొందింది.

పక్షి ప్రేమికురాలు...
పర్వీన్‌ షేక్‌ ముంబై అమ్మాయి. రామ్‌నరైన్‌ రూయా కాలేజీలో జువాలజీ చదివిన రోజుల్లోనే పక్షుల మీద పిచ్చి పట్టుకుంది. ‘‘నా కాలేజ్‌ చదువే నన్ను బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ వైపు నడిపించింది’’ అంటారామె. 2012లో బాంబే నేచురల్‌ హిస్టరీలో సైంటిస్ట్‌గా చేరిన పర్వీన్ కి ఒక క్లారిటీ ఉండేది– ‘అంతరించిపోతున్న పక్షి జాతుల కోసం పని చేయాలి’ అని. ఆ అన్వేషణలోనే ఒకరోజు ఆమె దృష్టి ఒక మేగజీన్‌లోని ఒక పక్షి ఫొటో మీద పడింది. 

నల్లటి రెక్కలు, తెల్లటి పొట్ట, నిప్పు అంటుకున్నట్టు ఎర్రగా మెరిసే ముక్కు. కింది దవడ పైదవడ కంటే పొడుగు. పేరు ‘ఇండియన్‌ స్కిమ్మర్‌’. ఒకప్పుడు దక్షిణ ఆసియా అంతటా కనిపించే ఈ పక్షి, ఇప్పుడు ఇండియా, బంగ్లాదేశ్‌లలో మాత్రమే మిగిలింది. మన దేశంలో 1990లో 10,000 ఉండే ఈ పక్షులు 2017కి 400కి పడిపోయాయని తెలిశాక ఆమె గుండె విలవిలలాడింది. వీటిని కాపాడలేనా అనుకుందామె.

చంబల్‌ లోయకు ప్రయాణం...
మన దేశంలో ఇండియన్‌ స్కిమ్మర్‌ పక్షులు ఎక్కువగా చంబల్‌ లోయలో ఉంటాయి. అందుకే డిసెంబర్‌ 2016లో పర్వీన్‌ బృందం చంబల్‌ నది మీద బోట్‌లో సర్వే మొదలుపెట్టింది. ఇది ఇండియాలో ఇండియన్‌ స్కిమ్మర్‌ మీద జరిగిన మొదటి శాస్త్రీయ సర్వే. అక్కడ కనపడిన దృశ్యాలు ఆమె మనసును ఇంకా వికలం చేశాయి. ఇండియన్‌ స్కిమ్మర్‌ పక్షి నది ఒడ్డున ఇసుక లోడి గుడ్లు పెడుతుంది. అదే దాని గూడు. అలాంటి గూళ్ల మీద ఆవుల మందలు నడుస్తూ నాశనం చేస్తున్నాయి. ఇసుక మాఫియా ట్రాక్టర్లకు మిగిలినవి బలి అవుతున్నాయి. మిగతావి కుక్కలు, నక్కలు, మనుషుల ఆటలకు. ‘పక్షులను చంపుతోంది ప్రకృతి కాదు. మన నిర్లక్ష్యం’’ అని ఆ రోజు డైరీలో రాసుకుంది.

నెస్ట్‌ గార్డియన్స్...
‘గూళ్లకు కాపలా పెడితే?’– పగిలిన గుడ్డు చేతిలో పట్టుకుని పర్వీన్‌ వేసుకున్న శపథం అది. కానీ చెప్పడం తేలిక. చేయడం? బందిపోట్ల లోయ అనే పేరున్న చంబల్‌లో, ఇసుక మాఫియా రాజ్యమేలే చోట, ముంబై నుంచి వచ్చిన ఒక మహిళా సైంటిస్టు మాట ఎవరు వింటారు? పర్వీన్‌  గ్రామాల్లో తిరిగింది. ‘ఈ పక్షులు నది ఆరోగ్యానికి గుర్తు. ఇవి పోతే నది చచ్చిపోయినట్టే. నది చస్తే మనమూ బతకలేం’ అని అర్థమయ్యే భాషలో చెప్పింది. మొదట్లో నవ్వారు. తర్వాత విన్నారు. అర్థం చేసుకున్నారు. అలా 30 మందికి పైగా స్థానిక యువకులు, మత్స్యకారులు ‘నెస్ట్‌ గార్డియన్స్’గా మారారు.

వాళ్లు చేసే పని మామూలుది కాదు.  ఆ పక్షుల బ్రీడింగ్‌ సీజన్  మార్చి నుంచి జూన్‌ దాకా ఎండనకా వాననకా, ఇసుక తిన్నెల దగ్గర కాపలా కాస్తారు. గూళ్ల చుట్టూ వెదురు కంచె వేసి ‘పక్షులు గుడ్లు పెడుతున్నాయి, దయచేసి దూరంగా వెళ్లండి’ అని బోర్డులు పెడతారు. ఫలితం? 2025లో పక్షుల సంఖ్య 400 నుంచి 1000 దాటింది. అంతకంటే గొప్ప విషయం ఏంటే, ‘ఇవి మన పక్షులు’ అని గ్రామస్తులు ఓన్‌ చేసుకున్నారు. ఇదే పర్వీన్ కి అతిపెద్ద విజయం. 

పర్వీన్‌ చేతిలో తుపాకీ లేదు. ఇసుక తిన్నెల మీద వెలిసిన పక్షుల గూళ్ల మీద అవ్యాజమైన ప్రేమ ఒక్కటే ఉంది. అందుకే ఇవాళ చంబల్‌ చిలుకలు తిరిగి ఆకాశంలో ఎగురుతున్నాయి. ‘గ్రీన్‌ ఆస్కార్‌’ పర్వీన్ కి దక్కిన గౌరవం కాదు, చంబల్‌ నది ఆమె పాదాలు కడిగి చెప్పిన కృతజ్ఞత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement