
కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వరుని దర్శనానికి భక్తజన సందోహం ఏటేటా పెరుగుతోంది. గడచిన పదకొండేళ్లలో దాదాపు పాతిక కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఏడాదికి సగటున రెండున్నర కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఎప్పటికప్పుడు క్యూలైన్‌లో మార్పులు చేస్తుంది. ఇప్పటికే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు ఒకటి, రెండు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడుగా మరో క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది.శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ప్రతినిత్యం విచ్చేస్తుంటారు. పూర్వం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య వందల్లో ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంది.
భక్తుల కోసం సౌకర్యాలు పెంచే కొద్ది తిరుమలలో భక్తుల తాకిడి కూడా పెరుగుతూ వస్తోంది. తొలినాళ్లలో తిరుమలకు చేరుకోవడానికి నడక మార్గం మాత్రమే ఉండేది. అప్పట్లో భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. తొలి ఘాట్‌రోడ్డును టీటీడీ 1943లో నిర్మించింది. క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతూ రావడంతో 1979లో రెండో ఘాట్ రోడ్డును కూడా నిర్మించింది. తిరుమల చేరుకోవడానికి, తిరిగి తిరుపతి చేరుకోవడానికి రెండు రోడ్డు మార్గాలు అందుబాటులోకి రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల మొదలైంది. మొదటి ఘాట్‌రోడ్డును నిర్మించిన తర్వాత కూడా 1951 నాటికి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజుకు ఆరువందలకు పైచిలుకుగా మాత్రమే ఉండేది.
క్రమంగా ఈ సంఖ్య 1961 నాటికి రోజుకు మూడువేలకు పైచిలుకు, 1971 నాటికి రోజుకు తొమ్మిదివేల పైచిలుకు వరకు చేరుకుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 1981 నాటికి గణనీయంగా పెరిగి, రోజుకు ఇరవై ఒక్క వేల పైచిలుకుకు చేరుకుంది. ఆ ఏడాదిలో శ్రీవారిని 79.52 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆ తర్వాత 1991లో తొలిసారిగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి కోటి దాటింది. మరో దశాబ్దం గడిచేసరికి 2001 నాటికి ఈ సంఖ్య రెట్టింపై రెండుకోట్లు దాటింది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 2011లో రోజుకు డెబ్బయివేలకు చేరుకుంటే, ఆ ఏడాది 2.55 కోట్ల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, ‘కోవిడ్’ ప్రభావంతో 2021లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఆ ఏడాది రోజుకు సగటున ఇరవై ఎనిమిదివేల మంది, ఏడాది మొత్తంలో 1.04 కోట్ల మంది మాత్రమే ఆ దేవదేవుని దర్శించుకున్నారు.
రద్దీకి అనుగుణంగా మార్పులు
తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఎప్పటికప్పుడు క్యూలైన్ల విధానంలో మార్పులు చేస్తూ వస్తోంది. మొదట్లో భక్తులను మహాద్వారం నుంచి అనుమతించే టీటీడీ, ఆ తర్వాత 1970లలో పీపీ షెడ్లను ఏర్పాటు చేసింది. వరాహస్వామి ఆలయానికి వెనుక వైపున షెడ్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించేది. ఆ తర్వాత 1985లో మొదటి క్యూకాంప్లెక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.
మరో పదహారేళ్లకు 2001లో రెండో క్యూకాంప్లెక్స్‌ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. అప్పటికీ భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుండటంతో ఏడాదికి దాదాపు 150 రోజుల పాటు భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి వెలుపల క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో 2014లో నారాయణగిరి ఉద్యానవనంలో టీటీడీ తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. నారాయణగిరి ఉద్యానవనంలో 2019 నాటికి శాశ్వత ప్రాతిపదికన కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేయగా, 2024 నాటికి గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్లను ఏర్పాటు చేసింది. ఇలా క్యూలైన్లలోనే 65 వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేసినా, స్వామివారి దర్శనం కోసం భక్తులు 24 గంటలకు పైగా వేచి ఉండే సమయాలు ఏడాదికి వంద రోజులకు పైగానే ఉంటున్నాయి.
నిరీక్షణ తగ్గించడానికి చర్యలు
శ్రీవారి దర్శనం కోసం భక్తులు నిరీక్షించే సమయాన్ని తగ్గించడానికి దర్శన విధానంలో టీటీడీ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తోంది. మొదట్లో భక్తులను శ్రీవారి ఆలయంలోని కులశేఖర పడి వరకు అనుమతించేవారు. దీంతో రోజూ శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు ఇరవైవేలకు పరిమితం అయ్యేది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి 1983లో టీటీడీ లఘుదర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులను రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతించే ఈ విధానంలో రోజూ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య సుమారు నలభైవేలకు చేరుకుంది.
భక్తుల తాకిడి మరింత పెరుగుతూ వస్తుండటంతో 2005లో టీటీడీ మహాలఘుదర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులను జయవిజయుల గడప నుంచి దర్శనానికి అనుమతిస్తుండటంతో స్వామివారిని రోజుకు దాదాపు లక్షమంది దర్శించుకునే అవకాశం ఏర్పడింది. తోపులాట లేకుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా 2014లో బంగారు వాకిలిలో మూడో క్యూలైన్‌ను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత మరిన్ని మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో టీటీడీ అదే విధానాన్ని కొనసాగిస్తోంది.
∙